ఎన్నికల ఫలితం తర్వాత ప్రకాశ్ రాజ్ షాకింగ్ డిసిషన్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా

ఎన్నికల ఫలితం తర్వాత ప్రకాశ్ రాజ్ షాకింగ్ డిసిషన్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. తను అతిథిగా మాత్రమే ఉండాలనుకునే అసోసియేషన్‌లో మెంబర్‌గా ఉండలేనని ఆయన అన్నారు. అయితే తెలుగు సినిమాల్లో నటిస్తానని అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. ఆదివారం జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఆయన విష్ణు మంచు చేతిలో ఓడిపోయారు. అనంతరం సోమవారం రోజున ఆయన ‘మా’కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను తెలుగువాడిని కాను.. ప్రాంతీయ‌వాదం, జాతీయ వాదంతో ఎన్నిక‌లు జ‌రిగాయి. మీరు వ‌చ్చిన త‌ర్వాత బైలాస్‌ను మారుస్తాన‌ని కూడా చెప్పారు. నా త‌ల్లిదండ్రులు తెలుగువాళ్లు కాదు. అది నా త‌ప్పుకాదు, వాళ్ల త‌ప్పు కాదు. ఓ అసోసియేష‌న్‌కు తెలుగువాళ్లే ఉండాల‌న్నారు. దాన్ని మా స‌భ్యులు కూడా ఆమోదించారు. తెలుగు బిడ్డ‌ను ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వీక‌రించాలి. మంచిదే. కాకపోతే కళాకారుడిగా నాకు ఆత్మ గౌరవం ఉంటుంది కాబ‌ట్టి... ‘మా’ స‌భ్య‌త్వానికి నేను రాజీనామా ఇస్తున్నాను. నాకు, ప్రేక్ష‌కుల‌కు ఉన్న బంధంతో, నాకు ద‌ర్శ‌కుల‌కు ఉన్న బంధంతో సినిమాలు చేస్తాను. అలాగే నాకు నిర్మాత‌ల‌కు, ర‌చ‌యిత‌ల‌కు ఉన్న బంధం కొన‌సాగుతుంది.

వ‌చ్చే రోజుల్లో.. అసోసియేష‌న్‌లో అతిథిగానే ఉండాలంటే అందులో నేను ఉండ‌టం స‌రికాదు. ఇది నొప్పితో తీసుకున్న నిర్ణ‌యం కాదు. స్వాగతిస్తున్నాను. పెద్ద పెద్ద క‌ళాకారులు మోహ‌న్‌బాబుగారు, కోట‌శ్రీనివాస‌రావుగారు, ర‌విబాబుగారు.. ఇలా అంద‌రినీ గౌర‌విస్తాను. వాళ్లంద‌రూ ఇదే విష‌యాన్ని ఓపెన్‌గా చెప్పారు. కాబట్టి అతిథిగానే ఉంటాను. బీజేపీ నేత బండి సంజయ్ వంటి వాళ్లు జాతీయ వాదాన్ని నిలబెట్టినందుకు విష్ణు టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పారు. ఎలక్షన్స్ ఎలా జ‌రిగాయి. ఎలా ఓడిపోయామ‌ని నేను మాట్లాడ‌ను. ఎల‌క్ష‌న్స్ చ‌క్క‌గా జ‌రిగాయి. వాళ్లు గెలిచారు. నేను వారిని అభినందిస్తున్నాను. 21 ఏళ్ల అనుబంధం ముగిసింది.ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌లు వ్య‌క్తిగ‌తం కాదు క‌దా. ఏం చెప్పినా, నాగ‌బాబు ఏం మాట్లాడినా.. ఆయ‌న ఒక ఓటు వ‌ల్ల నేను గెల‌వ‌లేదు క‌దా. స‌భ్యుల నిర్ణ‌యాన్ని గౌర‌వించాలి క‌దా. నాకు ఓటు వేసిన వారికి థాంక్స్‌. ఓట‌మిని జీర్ణించుకున్నాను కాబ‌ట్టే ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. ప్రాంతీయవాదం ఉండే ఇండస్ట్రీలో నేను మనలేను’’ అన్నారు. ‘మా’ ఎన్నికల అనంతరం ముందుగా మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేయగా, ఇప్పుడు ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు.

 

Tags :