పని పూర్తి చేయనివ్వండి.. 2024 ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించిన బైడెన్

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి అధ్యక్ష ఎన్నికల నగారాకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే ఏడాది ఆ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కూడా డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ నిలబడతారా? లేక మరొకరు బరిలో దిగుతారా? అని తర్జన భర్జనలు జరిగాయి. వీటన్నింటికీ బైడెన్ స్వయంగా బదులిచ్చారు. తాజాగా ఆయన తన 2024 ఎలక్షన్ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తను ప్రారంభించిన పని పూర్తయ్యే వరకు అవకాశం ఇవ్వాలని బైడెన్ తన ప్రజలను కోరారు. ప్రస్తుతం 80 ఏళ్ల వయసున్న బైడెన్ ఇప్పటికే పలుమార్లు ఈ విషయంలో విమర్శల పాలయ్యారు. కనీసం విమానం మెట్లు కూడా సరిగా ఎక్కలేని ప్రెసిడెంట్ అంటూ కొందరు ఆయన్ను నెట్టింట ఎగతాళి చేశారు కూడా. అయినా సరే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కూడా తను నిలబడతానని బైడెన్ ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో కూడా బైడెన్ ప్రధాన ప్రత్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నిలబడే అవకాశం ఉంది. అయితే అతని గురించి మాత్రం బైడెన్ తన వీడియోలో ప్రస్తావించలేదు. అయితే ట్రంప్‌కు ఈ పదవి దక్కకుండా అడ్డుకునే సత్తా మాత్రం తనకే ఉందని బైడెన్ భావిస్తున్నట్లు ఈ వీడియో తేటతెల్లం చేస్తోంది. అయితే డెమొక్రాట్ పార్టీలో కూడా బైడెన్‌కు అంత మద్దతు లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరైనా కొత్త నేతను అధ్యక్ష పోటీలో నిలబెట్టాలని డెమొక్రాట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను నిలబెడితే చాలా గొడవలు జరిగే అవకాశం ఉంది. కానీ ఒకవేళ బైడెన్ గెలిచి, ఆయనకు ఏమైనా జరిగితే అధ్యక్ష పగ్గాలు అందుకునేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కానీ ఆ దేశ ప్రజలను మాత్రం బైడెన్ గెలవలేపోయారు. అసలు డెమొక్రాట్ పార్టీలోని ఓటర్లే బైడెన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా జనాభాలో ప్రతి 10 మందిలో ఏడుగురు ప్రస్తుతం అమెరికా సరైన మార్గంలో వెళ్లడం లేదని ఫీల్ అవుతున్నారు. ఈ సమస్యలనే ఎత్తి చూపి ఈసారి ఎలాగైనా బైడెన్‌ను ఓడించాలని రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ ఈ రేసులో అందరి కన్నా ముందున్నారు. అయితే ఫ్లోరిడా మేయర్ రాన్ డిసాంటిస్ నుంచి ట్రంప్‌కు గట్టి పోటీ ఉంది. వీరిద్దరిలోనే ఒకరు రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెంట్‌గా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.