అప్పడు నిలదీసి ఉంటే జయసుధగారి నిజాయితీ బయట పడేది! : నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్

నటిగా ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది సహజ నటి జయసుధ. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై జయసుధ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని సమర్ధిస్తూనే నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె శ్రీరామరాజ్యం సినిమా విషయంలో బాలకృష్ణ అవార్డు ఇవ్వకుండా అడ్డుపడితే ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. తప్పును ప్రశ్నించినప్పుడే నాయకుడు అవుతారని ఆయన అన్నారు. అసలు బాలకృష్ణకు అవార్డు రాకుండా ఆపిందెవరు? ఏ కారణంతో ఆపారనే వివరాల్లోకి వెళితే..సహజ నటి జయసుధ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఐదు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారని, టాలీవుడ్ ఇండస్ట్రీ తననెవరూ పట్టించుకోలేదని కనీసం బొకే కూడా పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఇండస్ట్రీలో ఇతర భాషలకు చెందిన హీరోయిన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, అవార్డుల విషయంలోనూ సీనియర్స్‌ను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కూడా అన్నారు. దీనిపై సీనియర్ టాలీవుడ్ నిర్మాత, ఛాంబర్ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ స్పందించారు.
జయసుధ వ్యాఖ్యల్లో అవార్డుల అంశంపై ఆయన అనుకూలంగా మాట్లాడుతూనే ఆమెకు చురకలంటించారు. ఇంతకీ తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘జయసుధ సినీ పరిశ్రమకు చెందినవారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. ఆ సమయంలో శ్రీరామరాజ్యం సినిమాకు బాలకృష్ణ కు బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డును ఖరారు చేశారు. అయితే రాముడు బీజేపీ, ఆర్.ఎస్.ఎస్కి సంబంధించిన వ్యక్తి అని ఆ అవార్డును మరో హీరోకు ఇచ్చారు. నేషనల్ అవార్డ్స్‌లోనూ ఇదే విధానాన్ని పాటించారు. ఇది తప్పు కదా. ఆరోజున ఆ తప్పును జయసుధగారు నిలదీసి ఉంటే బావుండేది. మనకు తెలిసి ఓ తప్పు జరుగుతుంటే ప్రశ్నించాలి. అప్పుడే నాయకురాలి హోదా ఉంటుంది. అసెంబ్లీలో ఈ విషయాన్ని ఆమె మాట్లాడి ఉంటే బావుండేది.