రివ్యూ: 'పుష్ప' ది బన్నీ ఫైర్

రివ్యూ: 'పుష్ప' ది బన్నీ ఫైర్

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5 
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్,
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, సునీల్, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్, మాళవిక వేల్స్,  మరియు  సమంత., (స్పెషల్ సాంగ్) తదితరులు నటించారు,
సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, ఎడిటర్స్ : కార్తీక శ్రీనివాస్, రూబెన్,
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్, సహా నిర్మాత : చెర్రీ
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం : సుకుమార్
విడుదల తేదీ : 17.12.2021

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో హ్యాట్రిక్ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన సినిమా ‘పుష్ప... ది రైజ్’. పార్ట్ 1, రష్మిక మందన్న హీరోయిన్ గా  నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, ధనుంజయ, ఫహాద్ ఫాజిల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ‘తగ్గేదే లే’ అంటూ భారీ అంచనాలతో వచ్చిన  పాన్ ఇండియా సినిమాగా నేడు  భారీ స్థాయిలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

పుష్ప రాజ్ (అల్లు అర్జున్) ఉంచుకున్న దాని కొడుకుగా ఇంటిపేరు కూడా లేకుండా సమాజంలో ఎన్నో అవమానాలను బాధలను ఎదుర్కొని కసితో పెరుగుతాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ముఠాలో కూలీవాడిగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్ తన ధైర్యసాహసాలతో  కూలీ నుంచి ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్ లో వాటాదారుగా ఆ ముఠా నాయకుడు కొండారెడ్డి (అజయ్ ఘోష్)కి పార్టనర్ గా మారతాడు.  కూలీ ద‌గ్గ‌ర నుంచి సిండికేట్ లీడ‌ర్ గా మారినంత వ‌ర‌కూ అల్లు అర్జున్ త‌న న‌ట‌న‌తో దుమ్మురేపాడు.  తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఎర్రచందనం సిండికేట్ హెడ్ మంగళం శ్రీను (సునీల్)ను ఎదిరించి.. పుష్పరాజ్ తానే సిండికేట్ హెడ్ గా రూపాంతరం చెందుతాడు. ఈ మధ్యలో శ్రీవల్లీని (రష్మిక మందన్న) చూసి ప్రేమలో పడిన పుష్పరాజ్ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఆలాగే ఎర్రచందనం సిండికేట్ ను గుప్పిట్లో పెట్టుకున్న పుష్పరాజ్ ని టార్గెట్ చేసే వ్యక్తి ఎవరు? అసలు భన్వర్ సింగ్ షెఖావత్ (ఫహాద్ ఫాజిల్)తో పుష్ప రాజ్ కి వచ్చిన సమస్య ఏమిటి? అనేది థియేటర్లలో చూడండి!

నటీనటుల హావభావాలు:

శేషాచ‌లం అడవులు కేంద్రంగా సాగే క‌థ కావ‌టంతో సినిమా అంతా అల్లు అర్జున్ చిత్తూరు యాస‌లోనే మాట్లాడాడు.  అయితే ఈ విష‌యంలో ఎక్క‌డా తేడా రాకుండా గెట్ అప్ విషయం లో గాని, ఆహార్యం గాని ఎక్కడ తగ్గేది లే అన్నట్టు ఎంతో  జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. కూలీ ద‌గ్గ‌ర నుంచి సిండికేట్ లీడ‌ర్ గా మారినంత వ‌ర‌కూ అల్లు అర్జున్ త‌న న‌ట‌న‌తో దుమ్మురేపాడు. మునుపెన్నడూ చూడని విధంగా రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో బన్నీ అద్భుతంగా నటించాడు. నిజంగానే కుడి భుజం వంగి పోయినట్టు చాలా సహజంగా కనిపించాడు.  పుష్ప‌రాజ్ పాత్ర‌ను అలా ఒంటిచేత్తో చేసాడు అల్లు అర్జున్. శ్రీవల్లీగా రష్మిక మందన్న డీ గ్లామర్ లుక్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. నటన పరంగానూ రష్మిక ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కింది. ఆన్  స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మంగళం శ్రీనుగా సునీల్ కొత్తగా క్రూరం గా  కనిపించాడు. సునీల్ కెరీర్ లో నిలిచిపోయే పాత్ర ఇది. కీలక పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్  బాగుంది.  దాక్షాయణిగా అనసూయ నటన కూడా డిఫరెంట్ గా  వుంది. హీరోయిన్ సమంత చేసిన హు అంటావా హు హు అంటావా అంటూ సాగిన  స్పెషల్ సాంగ్ థియేటర్స్ లో విజిల్స్ వేయించింది.  అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:

భారీ అంచనాలకు తగ్గట్టుగానే.. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్  హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో మరియు గ్రాండ్ విజువల్స్ లో ఏ మాత్రం తగ్గలేదు. కథ విషయం లో...   కథనం విషయంలో.... ఈ సారి దర్శకుడు సుకుమార్ చాలా స్లోగా నడిపాడు. పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల అవి మెలోడ్రామాలా అనిపిస్తాయి. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం,  పైగా మధ్యమధ్యలో ఆ పాత్రలను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ వస్తూ ఉండటం , అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ కూడా సినిమా స్థాయిని తగ్గించినట్లనిపించింది. ఈ సారి సుకుమార్  రచయితగా తడబడినా దర్శకుడిగా మాత్రం  బాగా ఆకట్టుకున్నాడు.  దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది. ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి’, ‘ఏయ్‌ బిడ్డా’ ఇలా అయిదు పాటలు కూడా బాగున్నాయి. అయితే, అన్ని సాంగ్స్ లో కల్లా ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ పాట మాస్  ప్రేక్షకులను ఇంకా బాగా అలరిస్తోంది.  నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది.  కుబ బ్రోజెక్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎంతో రియలిస్టిక్ గా, గ్రాండ్ విజువల్స్ తో ప్రతి సన్నివేశాన్ని అందంగా చూపించాడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నేషనల్ రేంజ్ లో పాన్ ఇండియా మూవీ స్థాయికి ఏ మాత్రం తగ్గలేదు. 

విశ్లేషణ:

‘తగ్గేదే లే’ అంటూ హై ఓల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో  అల్లు అర్జున్ పాత్రలోని  షేడ్స్ ను, రష్మిక మండన్నాతో సాగే లవ్ ట్రాక్ ను, అదే విధంగా  అడవి  నేపథ్యంలోని ఎర్రచందనం మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా సుకుమార్ ప్రతి పాత్రను, ప్రతి అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంట్రస్ట్ గా సాగే  క్యారెక్టరైజేషన్ మరియు గ్రాండ్ విజువల్స్ తో   రఫ్ అండ్ మాస్ గెట్ అప్ లో అల్లరు అర్జున్ సరి కొత్త పాత్రలో అలరించాడు. కాకపోతే కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపించడం.   సెకండ్ హాఫ్  పై ఆసక్తి తారాస్థాయికి తీసుకువెళ్ళగలిగే ముగింపు లేకపోవడం, ఇక కొన్ని సీన్స్ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఆడియన్స్ కి ఈ సినిమా కొత్త జోనర్ తో డిఫరెంట్ గా అనిపిస్తుంది. కానీ బన్నీ ఫ్యాన్స్ కి మాత్రం సంత్రుప్త్రి ని ఇస్తోంది.  
 

 

Tags :