రివ్యూ: గ్రాండ్ విజువల్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్'

రివ్యూ: గ్రాండ్ విజువల్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5

బ్యానెర్లు : యు వీ క్రియేషన్స్ , టి సిరీస్ 
సమర్పణ: గోపీకృష్ణా మూవీస్ 
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడేకర్‌, ప్రియదర్శి, మురళి శర్మ జయరాం,  రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్ తదితరులు 
సంగీతం - సౌత్ : జస్టిన్‌ ప్రభాకరన్‌, సంగీతం - హిందీ : మిథున్‌, అమాల్‌ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: యస్ థమన్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్  హిందీ:  సంచిత బాళ్హర,  అంకిత్ బాళ్హరా 
సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు 
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీద, కథ  స్క్రీన్ ప్లే దర్శకత్వం: రాధాకృష్ణ

విడుదల తేదీ: 11.03.2022

రాధేశ్యామ్‌.. నాలుగేళ్లుగా సినీ ప్రేక్షకుడి దృష్టి లో వున్న ఈ సినిమా కోసం రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు మాత్రమే కాదు ఆల్‌ ఇండియా మూవీ లవర్స్‌ అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రమిది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ, లండన్ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా..దాదాపు నాలుగేళ్ల క్రితం షూటింగ్‌ స్టార్ట్ చేసిన మూవీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7010 స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్స్ కు  భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది. ఓవర్సీస్‌తో పాటు  పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను రివ్యూ లో తెలుసుకుందాం.  

కథ :

విక్రమాదిత్య (ప్రభాస్) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హస్త సాముద్రికుడు. ఇండియా లోని  గురువు పరమహంస (కృష్ణంరాజు) వద్ద జ్యోతిష్య శాస్త్రంలో శిష్యరికమ్ చేసి ఇటలీ లో స్థిరపడతారు. విక్రమాదిత్య జ్యోతిష్యం చెప్పాడంటే అది వంద శాతం జరిగితీరుతుంది. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు. తన చేతిలో ప్రేమ రేఖ లేదని తెలుసుకుని ప్రేమ పెళ్లి భాందవ్యాలు లేకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. అనుకోకుండా ప్రేరణ (పూజా హెగ్డే) ని కలుస్తాడు. అప్పటి వరకు విక్రమాదిత్య వెంటబడే అమ్మాయిలను చూసిన విక్రమాదిత్య ప్రేరణ కోసం వెంటపడతాడు.  అయితే తనకు ప్రేమ రేఖ లేదని ముందే విక్రమాదిత్యకు తెలిసినా ఆరాధిస్తాడు. ఈ క్రమంలో ప్రేరణతో ఉన్న భవిష్యత్తు గురించి తెలుసుకున్న విక్రమాదిత్య ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు. అసలు ఇంతకీ వీరిద్దరి మధ్య ప్రేమ కథ ఏమైందనే ఈ విషయాలు తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే…

నటి నటుల హావభావాలు :

ఈ సినిమాకు మొదటి నుండి ప్రధాన బలం ప్రభాస్. బాహుబలి వంటి పాత్రలో నటించిన ప్రభాస్ తన ఇమేజ్ చట్రం లోంచి బయటికి వచ్చి చేసిన సినిమా ఇది. లవర్ బాయ్ పాత్రలో ప్రభాస్ గతంలోనే నటించాడు. ఇప్పుడు కూడా ఆ పాత్రలో పర్ ఫెక్ట్ గా చేశాడు. పామ్ హిస్టరీలో నిపుణుడిగా.. అలానే ప్రేమికుడిగా విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ పరకాయ ప్రవేశం చేసేశాడు. విక్రమాదిత్యకు జంటగా నటించిన పూజాహెగ్డే పాత్ర కూడా మరో హైలెట్. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే కూడా ఒదిగిపోయింది. ప్రభాస్ కు ఏమాత్రం తగ్గకుండా యాక్టింగ్ తో పాటు అందంతో కూడా అదరగొట్టింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.గురూజీ గా కృష్ణంరాజు సహజంగా నటించారు. ఇటలీ లో స్థిరపడిన భారతీయ వ్యాపారవేత్తగా జగపతి బాబు కు అంత ప్రాముఖ్యత వున్నా పాత్ర లభించలేదు.ఇక పూజాహెగ్డే పెదనాన్నగా సచిన్ ఖేడేకర్‌,  ప్రభాస్ కు తల్లిపాత్రలో చేసిన భాగ్య శ్రీ కూడా చాలా బాగా చేశారు. మంచి పాత్ర ద్వారా రీఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. ఇక మిగిలిన నటీనటులు ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు.…

సాంకేతికవర్గం పనితీరు :

ఇలాంటి సినిమాలకు కథ దారమైతే  సాంకేతిక విభాగం పువ్వులు వంటివి. సినిమా చూస్తున్నంతసేపు విజువల్ బ్యూటీ నెస్ ప్రతి ఫ్రేమ్ లో కనపడుతుంది.  సినిమాలో ఎక్కువ ఫస్ట్ క్రెడిట్స్ ఎవరికైనా ఇవ్వాలంటే మాత్రం అది  ప్రొడక్షన్ డిజైనర్ కె చెందుతుంది. పీరియాడిక్ మూవీస్ లో ఏదైనా ఒక సెట్ ను డిజైన్ చేయడం అంటేనే చాలా కష్టం. 70లో జరిగిన కథ కాబట్టి అప్పటి కార్లు, టెలిఫోన్, టి వి అందులో ఇటలీ వంటి రాయల్ ప్లేస్ లో జరిగిన కథకు అనుగుణంగా క్లైమేట్ ను ఇక్కడ సెట్స్ ద్వారా రీక్రియేట్ చేయాలంటే అది మాములు విషయం కాదు. ఇండియాలోనే ఇటలీని చూపించేశారు. ఇక మ్యూజిక్.. ఇప్పటికే పాటలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాకు ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫి అందమైన లోకేషన్స్ ను తన కెమెరాలో బంధించేశాడు మనోజ్ పరమహంస. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. 300 కోట్ల బడ్జెట్ అంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని.. ప్రతి ఫ్రేమ్ లో అది కనిపిస్తూనే ఉంది. దర్శకుడు రాధా కృష్ణ కథకు న్యాయం చేసాడు. విజువల్స్ అన్నీ మిళితమై ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకనేలా, అన్నీ కోణాలు ఈ సినిమాలో ఉండేలా చూపించాడు రాధాకృష్ణ. ఒక కళాఖండం రావాలంటే 24 ఫ్రేమ్స్ పర్ఫెక్ట్ గా ఉంటాలి. అది కొన్ని సినిమాలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విషయం లో రాధే శ్యామ్ చిత్రానికి కుదిరింది. టెక్నీకల్ గా ఇండియన్ స్క్రీన్ మీద హాలీవుడ్ లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పొచ్చు. 

విశ్లేషణ :

ఇలాంటి కథల గురించి ఒక్క పాయింట్ లో చెప్పడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కథతో పాటు ప్రేక్షకుడు కూడా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతాడు కాబట్టి..అందులో ఇది  పీరియాడికల్ లవ్ స్టోరీ.. దానికి తగ్గట్టు సన్నివేశాలు.. పాత్రలు..బ్యాక్ గ్రౌండ్  విజువల్స్ అన్నీ మిళితమై ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకనేలా ఉంటుంది. రాధేశ్యామ్ విషయంలో అదే జరిగింది. లవ్ స్టోరీ, క్లాస్ మూవీ, యాక్షన్ సీక్వెన్స్, మిస్టరీ ఎలిమెంట్స్, రొమాంటిక్ ఇలా చాలా కోణాలతో ఈ సినిమా టైటిల్ ను ప్రకటించినప్పుడే ప్రేమకథ చిత్రం గా ఉంటుందని అందరూ ముందుగానే ఊహించారు.  దేవదాస్-పార్వతీ, రోమియో-జూలియేట్, సలీమ్-అనార్కలీ లాంటి వారి పేర్లు చూసినప్పుడే ఈ సినిమాపై ఒక క్లారిటీ వచ్చేసింది చాలామందికి. ఎందుకంటే పైన తెలిపిన వారు గొప్ప ప్రేమికులుగా చరిత్రలో మిగిలిపోయారు కానీ.. వారు మాత్రం కలిసి జీవించలేకపోయారు. అయితే ప్రేమకథలు ఎన్ని వచ్చినా వాటికి మనవాళ్లు ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటారు. ఇక అలాంటి ప్రేమకథల్లో కొత్త యాంగిల్.. ట్విస్ట్ లు ఉంటే ఇంకెలా ఉంటుంది. అనే పాయింట్ పై రాధాకృష్ణ  అలాంటి కథనే రాసుకున్నాడు. అయితే చివరగా  మన రాత మన చేతుల్లో కాదు.. మన చేతల్లో ఉంటుందని దానికి ప్రేమకథను జోడించి చెప్పాడు. హస్తసాముద్రికలో నిపుణుడైన ఓ ప్రేమికుడు ఆఖరికి తన ప్రేమను గెలిపించుకోవడానికే విధికి సైతం ఎదురుతిరగడమే ఈసినిమాకు హైలెట్ పాయింట్. ఇప్పటివరకూ ఇలాంటి పాయింట్ తో ఏ సినిమా రాలేదని చెప్పొచ్చు. హస్తసాముద్రికలో నిపుణుడైన ఓ ప్రేమికుడు ఆఖరికి తన ప్రేమను గెలిపించుకోవడానికే విధికి సైతం ఎదురుతిరగడమే ఈ సినిమాకు హైలెట్ పాయింట్. ఒక అందమైన ప్రేమకావ్యంలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండూ చూడాల్సిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.   

 

Tags :