ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరు...

తాము పేదల కోసం పని చేస్తే, బీజేపీ బడా పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన చింతన్ శిబిర్‌లో పాల్గొన్న రాహుల్, గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా జిల్లా దుంగార్పూర్లోని వాల్మీకి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధనవంతులు, కొద్ది మంది పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని రూపొందించాలని బీజేపీ, ప్రధాని మోదీ కోరుకుంటున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులు, రైతులు పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నదని తెలిపారు. ఇది ఒక పోరాటం. ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరు. అందరినీ కలుపుతూ, అన్ని సంస్కృతులను గౌరవిస్తూ, పరిరక్షిస్తూ మనం ముందుకు సాగాలని కాంగ్రెస్ చెబుతోందన్నారు. బీజేపీ విభజించడానికి, అణిచివేసేందుకు పనిచేస్తుంది అని అన్నారు.