బాంబుతో పేల్చేస్తాం.. రాహుల్ గాంధీకి బెదిరింపు..

బాంబుతో పేల్చేస్తాం.. రాహుల్ గాంధీకి బెదిరింపు..

కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. అయితే తాజాగా యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఉద్దేశించి ఓ బెదిరింపు లేఖ వచ్చింది. రాహుల్ యాత్ర తాజాగా మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చేరుకుంది. అక్కడి నుంచి జుని అనే ప్రాంతం మీదుగా సాగాల్సి ఉంది. కానీ జుని ప్రాంతంలోని ఓ షాపు వద్ద రాహుల్‌పై బాంబు దాడి చేస్తామంటూ ఓ లేఖ లభ్యమైంది. రాహుల్ ఇక్కడకు రాగానే నగరం బాంబు మోతలతో మారుమోగిపోతుందంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు. దాంతో పాటుగా ఈ బాంబు దాడిలో రాహుల్‌తో పాటు మాజీ సీఎం కమల్ నాథ్‌ను కూడా హతం చేస్తామని పేర్కొన్నారు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని అని భావిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం దీనిపై దృష్టి సారిస్తున్నారు. అసలు లేఖ ఎవరు వదిలి వెళ్లారన్న విషయం తెలుసుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సెల్ టవర్‌ సిగ్నల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే వీర్ సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్న క్రమంలో ఈ బెదిరింపు లేఖ విషయాన్ని తేలికగా తీసుకునే ఆలోచనలో పోలీసులు కనిపించడం లేదు. దానికి తోడుగా కొంతకాలంగా ప్రముఖులకు బెదిరింపు లేఖలు రావడం పెరుగుతోంది. ఈ క్రమంలో జుని ప్రాంతంలోకి జోడో యాత్ర ప్రారంభానికి ముందే అక్కడ భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఈ మేరకు పోలీసు శాఖకు ప్రత్యేక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. వాహన తనిఖీలను ముమ్మరం చేయాలని, అనుమానంగా కనిపించిన వారిని విచారించాలని పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.