ఎన్నికల ప్రచార కర్తగా రాజమౌళి..!

ఎస్.. మీరు విన్నది నిజమే. ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఎన్నికల ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఆస్కార్ అవార్డుల హడావుడిలో ఉన్న రాజమౌళిని ప్రస్తుత ఎన్నికల్లో ప్రచారకర్తగా వాడుకోవడం ద్వారా ఓటింగ్ శాతం పెంచాలని అధికారులు భావించారు. ఆయన ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగం కోసం ప్రచారం చేస్తారో లేదో తెలీదు కానీ రాజమౌళిని మాత్రం అధికారులు ఎన్నికల ప్రచార కర్తగా అనౌన్స్ చేసేశారు. ఎక్కడో తెలుసా... కర్నాటకలో.! అది కూడా రాష్ట్రం మొత్తానికి కాదండోయ్.. కేవలం ఒక జిల్లాకు మాత్రమే.!
సాధారణంగా ఎన్నికల సమయంలో కొంతమంది ప్రముఖులను ఎన్నికల ప్రచారకర్తలుగా ఎన్నికల సంఘం నియమిస్తూ ఉంటుంది. ఓటు హక్కు ప్రాధాన్యతను వాళ్ల ద్వారా తెలియజేస్తో ఓటర్లు స్పూర్తి పొంది ఓటు హక్కు వినియోగించుకుంటారనేది ఎన్నికల సంఘం ఆలోచన. న్యూట్రల్ గా ఉండే సినిమా స్టార్లు, క్రీడాకారులు, ఎంట్రప్రెన్యూర్లు.. ఇలా ఎంతోమందిని గతంలో ఎన్నికల సంఘం ప్రచారకర్తలుగా నియమించింది. వాళ్లు కూడా ఓటుహక్కు వినియోగించుకోవాలని వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు పిలుపునిచ్చేవారు.
కానీ ఇప్పుడు రాజమౌళి విషయంలో అలా జరగలేదు. రాజమౌళిని ఎన్నికల సంఘం నియమించలేదు. కర్నాటకలోని రాయచూరు జిల్లా కలెక్టర్ రాజమౌళిని ఆ జిల్లాకు ఎన్నికల ప్రచారకర్తగా నియమించారు. ఇదిప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. రాజమౌళిని ఒక జిల్లాకు మాత్రమే.. అది కూడా ఒక కలెక్టర్ ఎన్నికల ప్రచారకర్తగా నియమించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో ఏదో మతలబు జరిగిందని భావిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిని రాయచూరు జిల్లాలో ఎన్నికల ప్రచారకర్తగా నియమించడంపైన కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే రాయచూరుకు, రాజమౌళికి ఓ లింక్ ఉంది. అదేంటంటే.. గతంలో రాజమౌళి కుటుంబం రాయచూరులో కొన్నాళ్లపాటు నివసించింది. అక్కడే వ్యవసాయం కూడా చేసింది. రాజమౌళి కూడా అక్కడ కొంతకాలంపాటు చదువుకున్నారు.
మరోవైపు సాధారణంగా ఇలా ఎన్నికల ప్రచారకర్తలుగా తటస్థులను ఎంపిక చేస్తుంటుంది ఎన్నికల సంఘం. కానీ ఇప్పుడు రాజమౌళి తండ్రి ఎస్.విజయేంద్ర ప్రసాద్ ను బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేసింది. పైగా ఆయన బీజేపీ అనుకూలురుగా పేరొందారు. బీజేపీకి అనుకూలంగా కొత్తగా సినిమాలు కూడా తీయబోతున్నారనే సమాచారం ఉంది. అలాంటప్పుడు ఆయన కుమారుడు రాజమౌళిని ఎన్నికల ప్రచారకర్తగా నియమించడంపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.