‘ఖిలాడి’ రెండు పాటల చిత్రీకరణ మిగిలివుంది? రిలీజ్ వాయిదా పడుతుందా?

‘ఖిలాడి’ సినిమా రిలీజ్ డేట్ ఫిబ్రవరి 11 అని ప్రకటించారు. కానీ మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉందని, దర్శకుడు రమేష్ వర్మ ప్లానింగ్ లేకపోవడంతో చిత్రీకరణ చేయలేకపోయారని, ఈ విషయంపైనే దర్శకుడిపై రవితేజ కోపంగా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాస్ మహరాజా వరుస సినిమాలను పూర్తి చేస్తూ ఒక వైపు.. కొత్త సినిమాలను సెట్స్ పైకి తీసుకెళుతూ తన స్పీడుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. జనవరి 15న ఆయన తన ‘రావణాసుర’ చిత్రాన్ని షురూ చేశారు. గత ఏడాది ‘క్రాక్’ సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమాతో పాటు శరతమ్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమాను స్టార్ట్ చేయడమే కాకుండా శర వేగంగా పూర్తి చేసేస్తున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న మూడు సినిమాల్లో ముందుగా స్టార్ట్ చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ సినిమాను ఫిబ్రవరి 11న వచ్చేస్తున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేసేశారు. నిజానికి ‘ఖిలాడి’ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది.
సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. కానీ.. ఇంకా రెండు పాటలు చిత్రీకరణ చేయాల్సి ఉంది. దర్శకుడు రమేష్ వర్మ.. ప్లానింగ్ సరిగా లేకపోవడంతో అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తి చేయలేకపోయారట. అప్పటికీ రవితేజ వెయిట్ చేసి చూసినా ఫలితం లేకుండా పోయిందట. దీంతో ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెట్టేశారు. ఇప్పుడు ‘ఖిలాడి’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రవితేజను రమేష్ వర్మ సంప్రదిస్తే.. ఆయన డైరెక్టర్‌కి కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. రమేష్ వర్మ కంటే వెనుక సినిమాను స్టార్ట్ చేసిన డైరెక్టర్స్ పక్కా ప్లానింగ్ ప్రకారం సినిమాలను పూర్తి చేసేశారని, కానీ తను మాత్రం చేయలేకపోయారని రవితేజ కాస్త సీరియస్ అయ్యారట. ఇప్పుడు ఇతర సినిమాలకు డేట్స్ కేటాయించేశానని, పాటలు చిత్రీకరణకు ఇప్పట్లో డేట్స్ కేటాయించలేనని చెప్పిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిప్పుడు ఈ వార్తలపై ‘ఖిలాడి’ దర్శక నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. మార్చి 25న రవితేజ తన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మరో వైపు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమా కూడా చకచకా షూటింగ్‌ను పూర్తి చేసేసుకుంటుంది. ఇంకో వైపు రవితేజ రావణాసుర సినిమాను లాంఛనంగా ప్రారంభించేశారు.