రివ్యూ : ఈ సంక్రాంతికి కేక 'క్రాక్' ఎక్కించిన మూవీ

రివ్యూ : ఈ సంక్రాంతికి కేక  'క్రాక్' ఎక్కించిన మూవీ

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ 3/5
నిర్మాణ సంస్థ :  సరస్వతి ఫిలిం డివిజన్
జానర్ : యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు : రవితేజ, శ్రుతీహాసన్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సముద్రఖని, సుధాకర్‌ కోమాకుల, వంశీ, రవి శంకర్‍, సప్తగిరి తదితరులు
సంగీతం :  తమన్‌ ఎస్‌, సినిమాటోగ్రఫీ :  జీకే విష్ణు, ఎడిటర్‌ : న‌వీన్ నూలి, మాటలు : సాయి మాధవ్ బుర్ర
సహా నిర్మాత : కానుమిల్లి అమ్మిరాజు, నిర్మాత : ‘ఠాగూర్‌’మధు
కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం :  గోపీచంద్‌ మలినేని
విడుదల  : జనవరి 9, 2021 రాత్రి రెండవ ఆటతో... 

మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. 'రాజా ది గ్రేట్' తర్వాత ఆయన ఖాతాలో  హిట్ మూవీ లేనే లేదు  గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన  'డిస్కో రాజా' ప్రయోగం కూడా విఫలమైంది. ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రవితేజ. ఇందులో భాగంగానే తనకు గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబి తో  'క్రాక్' అనే మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా నిన్న జనవరి 9 విడుదల ప్లాన్ చేసారు కొన్ని అనివార్య కారణాల వలన ఫైనాన్సర్లు క్లీయరెన్సు ఇవ్వకపోవడంతో ఉదయం ఆటలు పడలేదు ఎట్టకేలకు రాత్రి సెకండ్ షోతో ‘క్రాక్’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రవితేజను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? గోపిచంద్ మలినేని, రవితేజ కాంబో హ్యాట్రిక్ విజయం సాధించిందా? నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది రివ్యూలో చూద్దాం.

కథ:

‘ఒక ‘క్రాక్’ పోలీస్ ఆఫీసర్.. ఇతను ముందు ఎవడైనా బ్యాగ్రౌండ్ పేరు ఎత్తితే క్రాక్ ఎక్కేస్తుంటుంది. ఎక్కడికి ట్రాన్స్ ఫర్ అయినా అక్కడి లోకల్ నేరస్థులతో గొడవ.. వాళ్ల భరతం పట్టి బొక్కలో వేయడం..తన కర్తవ్యం అంటాడు. ‘జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గుర్ని తోపుల్ని తొక్కి తాటతీస్తాయి.. కామన్ పాయింట్ ఏంటి అంటే.. ఈ ముగ్గురితో ఆడుకున్నది ఒకే పోలీసోడు వాడే ‘పోతరాజు వీర శంకర్’.

సలీమ్ (చిరాగ్ జానీ) దేశంలోనే కరుడుకట్టిన తీవ్రవాది.. ఇతన్ని పట్టుకోవడం కోసం పోలీస్ యంత్రాంగం మొత్తం పనిచేస్తుండగా.. కర్నూల్ ఎస్ ఐగా ఉన్న పోతరాజు వీర శంకర్ (రవితేజ) అతన్ని చాకచక్యంగా పట్టుకుంటాడు. యాభై రూపాయల నోటు కోసం సలీమ్.. శంకర్‌కి చిక్కుతాడు. ఎలా అన్నది తెరపై చూస్తేనే కిక్కు. ఇక రెండో నేరస్తుడు కడప రెడ్డి (రవి శంకర్) కడపలోనే ఫ్యాక్షన్ లీడర్.. ఇతడు కూడా ఒక మామిడికాయ నేపథ్యంలో సీఐగా ప్రమోట్ అయిన శంకర్‌కి చిక్కుతాడు. మూడో నేరస్థుడు మోస్ట్ డేంజరస్.. అతడే కటారి కృష్ణ (సముద్రఖని). ఒంగోలులో ఇతను చేయని నేరం అంటూ ఉండదు. చట్టం కళ్లుకప్పి పెద్ద మనిషిగా చలామణీ అవుతాడు. సిటీలో చాకులా ఉండే కటారి కృష్ణను బోకులా చేసి.. ఒక్క మేకు సాయంతో కటకటాల వెనక్కి పంపుతాడు శంకర్. ఇంతకీ ఆ మామిడికాయ ఏంటి?? యాభై రూపాయల నోటి ఏంటి?? మేకు ఏంటి?? ఈ మూడింటి నేపథ్యం ఏంటి అన్నదే క్రాక్ సినిమా అసలు కథ. కడప, కర్నూల్, ఒంగోలు ఈ మూడు సిటీలలో ముగ్గురు నేరస్థుల భరతం ఎలా పట్టాడన్నదే ఈ సినిమా స్టోరీ లైన్.

నటీనటుల హావభావాలు:

మాస్ అనే పదానికి పర్యాయపదంలా కనిపిస్తాడు రవితేజ. ఈ  సినిమాలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్‌ మ్యాన్‌ షో నడిచింది. మాస్ మహారాజాలోని ఫైర్‌ను మరోసారి మనం తెరపై చూడొచ్చు. రవితేజ అభిమానులకు అయితే కన్నులపండువలా ఉంటుంది. ఎనర్జీతో పాటు స్టైలిష్‌గా కూడా కనిపించారు. సీఐ పోత రాజు వీర శంకర్ అనే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్ పాత్ర రవితేజ ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించారు. హీరోయిన్ శృతి హాసన్‌.. క్రాక్ పోలీసోడు భార్య కళ్యాణిగా మెస్మరైజ్ చేసింది. ఫస్టాఫ్‌లో  హీరోయిన్ ఉండాలి అందుకే ఈ పాత్రే అన్నట్టుగానే ఉన్నా.. సెకండాఫ్‌లో ఆమెకు అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ఇచ్చి మైండ్ బ్లాక్ చేశాడు దర్శకుడు. శృతి హాసన్ కెరియర్‌లోనే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర చేసింది. శృతి హాసన్‌ గ్లామర్‌తో పాటు.. యోగా, కరాటే ఇలా ఆమెలో ఉన్న మల్టీటాలెంట్‌ని ఫుల్‌గా ఉపయోగించుకున్నాడు దర్శకుడు. ఆమె క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అలాగే జయమ్మ అనే నెగెటివ్ పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ మెప్పించారు.

రవితేజ తరవాత సినిమాలో బాగా పండిన పాత్ర సముద్రఖనిది. ’కఠారి‘ అనే విలన్ పాత్రకు ఆయన జీవం పోశాడు. తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు.  సుధాకర్‌, రవి శంకర్‍, తమ పాత్రల పరిధి మేర నటించారు. భూమి బద్దలు అనే ఐటెం సాంగ్ లో అంకిత మహారణా హాట్ హాట్ గా కనిపిస్తుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని కొడుకు ఈ చిత్రంలో రవితేజకు కొడుకుగా నటించి నవ్వులు పూయించాడు. ‘నాన్నా.. రాత్రి బెడ్ రూంలో పడుకుంటున్నా.. ఉదయానికి హాల్‌లోకి ఎలా వస్తున్నా’ అంటూ అడిగే సీన్లకు రవితేజ రియాక్షన్‌కి థియేటర్స్‌లో నవ్వులు కురిశాయి. ఇది ప్రతి ఇంట్లో ఉండే సరదా ఇష్యూ కావడంతో ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేశారు. 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమా  కాన్సెప్ట్ రొటీన్‌గానే ఉన్నా.. డిఫరెంట్ నెరేషన్‌తో సినిమాపై ఆసక్తికలిగించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ రాజా రవితేజ‌లో ఉన్న మాస్ ఎలిమెంట్స్‌ని ఫుల్‌గా వాడుకుని ఫ్యాన్స్ రవితేజ ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించాడు.  కథ లో కొత్తదనం లేకపోయినా మాస్ ఎలిమెంట్స్‌తో డిఫరెంట్ ప్రజెంటేషన్ చేశారు. రవితేజ కోసమే ఈ కథ అన్నట్టుగా ఆయన్ని చూపించారు. బలుపు, డాన్ శీను చిత్రాలు ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా టేకింగ్‌తో మరో మెట్టు ఎక్కాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే కూడా చాలా రేసీగా ఉంటుంది.. రొటీన్ కథను ఎక్కడా బోర్ కొట్టించకుండా నెక్స్ట్ ఏమౌతుంది అన్న రీతిలో కథ పక్కదారి పట్టకుండా గ్రిప్పింగ్‌గా ముందుకు నడిపించారు. ఈ సినిమాకి పాత్రల ఎంపికకు దర్శకుడికి మంచి మార్కులు వేయొచ్చు. ఇక తమన్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. రవితేజ ఎలివేషన్స్ షాట్స్‌కి తమన్ అందించిన ఆర్ ఆర్ అదిరింది. క్రాకూ.. క్రాకూ.. అంటూ వచ్చే ఆర్ ఆర్ మళ్లీ మళ్లీ అనేట్టు చేసింది. బూమ్ బద్దల్.. భలేగా తగిలావే బంగారం.. కోర మీసం పోలీసోడా .. బిరియానా సాంగ్స్‌ బాగా వచ్చాయి.. థియేటర్స్‌లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. కె.జి విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది.

రవితేజను పోలీస్ ఆఫీసర్‌గా బాగా చూపించారు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో తన కెమెరా పనితనం చూపించి మంచి విజువలైజేషన్ అందించారు విష్ణు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్‌లకు థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. మాస్ రాజా రవితేజకు మంచి పవర్ ఫుల్ డైలాగ్‌లు పడ్డాయి. ఒంగోలు నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా. ఊర మాస్ డైలాగ్‌లు మాస్ రాజా చెప్తుంటే థియటర్లలో విజిల్స్ మోత మోగింది. నవీన్ నూలి ఎడిటింగ్.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్  స్వేత, నీరజ్ కోనా క్యాస్ట్యూమ్స్ అన్నీ ‘క్రాక్’కి బాగా కుదిరాయి. నిర్మాణపు విలువలు నైపుణ్యంగా వున్నాయి. 

విశ్లేషణ:

రియల్‌ క్యారెక్టర్స్‌ను కమర్షియల్‌ సినిమాలోకి పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్‌ చేసి తీసిన సినిమా ‘క్రాక్‌’. రాయలసీమ, ఒంగోలు ప్రాంతం లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. మాస్‍ ఆడియన్స్‌కి నచ్చే సినిమా తీయాలనేది దర్శకుడి మెయిన్‍ టార్గెట్‍ అనేది సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే అర్థమవుతంది. మావిడికాయలో మేకు గుచ్చి, ఒక యాభై రూపాయల నోటుపై దానిని పెట్టి... కథ మొదలు పెట్టినపుడు ఇదంతా కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కానీ సినిమా కథ మొత్తం అదే అని చెబుతూ.. తెరపై చూపించిన విధానం కాస్త కొత్తగా అనిపిస్తుంది. మొత్తానికి దర్శకుడు ఎదో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. కథ నేపథ్యాన్ని హీరో వెంకటేశ్‌తో చెప్పించడం, వేటపాలెం బ్యాచ్‍ ఒకటి బీచ్‍లో ఇసుకలోంచి బయటకు వచ్చి... గాడిద రక్తం తాగేసి అరగడం కోసం అటు ఇటు పరుగెత్తడం ప్రేక్షకులను కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్లు మాత్రం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. ఇస్త్రీ బట్టలు తీసుకెళుతున్న మహిళ చేతిలోంచి జారి పడ్డ బట్టల్లో బురఖా జారి పడడం చూసి హీరో వెళ్లి ఒక టెర్రరిస్టుని పట్టుకోవడం, అలాగే మెయిన్‌ విలన్‌ కేసుకు సంబంధించి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ కాపీ వెతుకుతుండగా, అది గోడ మీద నుంచి జారిపడడం అంత కన్వీనియంట్‌గా అనిపించదు. అలాగే సినిమా కథ కూడా కాస్త రొటీన్‌గా సాగుతుంది. నెక్ట్‌ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఈజీగా గెస్‌ చెయ్యగలడు. కానీ రోటీన్‌ కథని దర్శకుడు తెరపై చూపించే విధానం చాలా బాగుంది. ఇక హీరో, హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్  పండలేదు.

మాస్ రాజా అభిమానులకు అసలుసిసలు పండగ అంటే ఈ ‘క్రాక్’ సినిమానే. రవితేజను అభిమానులు ఎలా చూడాలని ఆశపడుతుంటారో దర్శకుడు గోపీచంద్ మలినేని ఆ రేంజ్‌లో చూపించారు. పోతరాజు వీర శంకర్‌గా రవితేజ విశ్వరూపం చూపించాడు. ఇది ‘డీజే కాదు.. ఓజే ఒంగోలు జాతర’ అని అన్నట్టుగానే ‘క్రాక్’ పోలీసోడి కిక్ ఎలా ఉంటుందో చూపించారు రవితేజ. ఉడుకురక్తంతో ఉన్న పాతికేళ్ల కుర్రాడికి పోలీస్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో రవితేజ అలా అనిపించారు. ఫుల్ ఎనర్జీతో పవర్ ఫుల్ యాక్షన్‌తో అదరగొట్టాడు. మాస్ రాజా డాన్స్‌తో అలరించాడు. క్రాక్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. రవితేజ ఎంట్రీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలారోజుల తరువాత మాస్ మహరాజా ఫుల్ లెంగ్త్ ఎనర్జీతో ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు. క్రాక్ పోలీస్ ఆఫీసర్‌గా కేక పుట్టిస్తూ.. కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు రవితేజ. తన డైలాగ్ డెలివరీతో ఈ సంక్రాంతి పండుగలో  మాస్ ఆడియన్స్‌కి విందు భోజనం అందించాడు  రవితేజ.. 

 

Tags :