రివ్యూ : నేటి ప్రజాస్వామ్య వ్యవస్థను బట్టబయలు చేసిన 'రిపబ్లిక్‌'

రివ్యూ  : నేటి ప్రజాస్వామ్య వ్యవస్థను బట్టబయలు చేసిన 'రిపబ్లిక్‌'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీస్టూడియోస్‌,
నటీనటులు :  సాయి తేజ్‌, ఐశ్యర్యా రాజేశ్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ, ఆమని, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ తదితరులు
సంగీతం :  మణిశర్మ, సినిమాటోగ్రఫీ : ఎం.సుకుమార్‌, ఎడిటింగ్‌:  కె.ఎల్‌.ప్రవీణ్
స్క్రీన్ ప్లే : దేవా కట్టా, కిరణ్ జయ్ కుమార్, నిర్మాతలు :  జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు
కథ,  దర్శకత్వం : దేవా  కట్టా
విడుదల తేది : 01.10. 2021

‘వెన్నెల‌’ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేసి ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవ‌క‌ట్టా త‌ర్వాత ‘ప్రస్థానం’మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు దేవ్‌ కట్టా. ఆ తర్వాత ఇదే సినిమాను 2019లో హిందీలో తెరకెక్కించి బాలీవుడ్‌లో సైతం గుర్తింపు పొందారు. అలా వైవిధ్యమైన కోణంలో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. మ‌నిషి అనుకోకుండా చేసిన ఓ త‌ప్పు త‌న ప్ర‌యాణాన్ని ఎలా మార్చింద‌నే క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. దీనికి పొలిటిక‌ల్ ట‌చ్ ఇచ్చారు. త‌ర్వాత ఆయ‌న డైరెక్ట్ చేసిన ‘ఆటోన‌గ‌ర్ సూర్య’ సినిమాలో మ‌నిషి ఆలోచ‌న‌తో స్వ‌తంత్య్రంగా బ‌త‌కాలి, తెలివైనోడికి ఎవ‌రి దయా దాక్షిణ్యం అక్క‌ర్లేదు అనే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. త‌ర్వాత తెలుగులో ఈయ‌న చేసిన రీమేక్ మూవీ డైనమైట్ డిజాస్ట‌ర్ అయ్యింది. ఐదారేళ్ల త‌ర్వాత తెలుగులో దేవ క‌ట్టా సాయితేజ్ హీరోగా చేసిన మూవీ ‘రిప‌బ్లిక్‌’.  

మెగా మేనల్లుడు సాయితేజ్‌ ఈ మూవీలో కలెక్టర్‌గా కనిపించబోతుండడంతో ‘రిపబ్లిక్‌’పై మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు హీరో సాయితేజ్ బైక్ యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స  పొందుతున్న విషయం తెలిసిందే! ఇప్పటి రాజకీయ వ్య‌వ‌స్థ‌, బ్యూరోక్రాట్ సిస్ట‌మ్‌, న్యాయ‌వ్య‌వ‌స్థ ఎలా ఉండాలి. ఈ మూడు వ్య‌వ‌స్థ‌లు ఏది ఒక‌టి గాడి త‌ప్పినా స‌మాజం ఎలా ఇబ్బంది ప‌డుతుందనే విష‌యాన్ని తెలియ‌జేస్తూ రూపొందిన చిత్రం  ‘రిప‌బ్లిక్’ ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆక‌ట్టుకుందో రివ్యూ లో తెలుసుకుందాం.

కథ :
డెబ్బయో దశకం లో స్వచ్ఛమైన తెల్లేరు సరస్సును రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు  కబ్జా చేస్తారు. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఆ సరస్సులో విషపు ఆహారాన్ని వేస్తూ చేపలను పెంచుతారు. దాని కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అయినప్పటికీ ఆంధ్ర ప్రజా పార్టీ అధినేత్రి విశాఖవాణి(రమ్యకృష్ణ) తన వ్యాపారాన్ని వదులుకోదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా ఎదుగుతూ తన కొడుకుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుంది. ఇది ఇలా ఉండగా పంజా అభిరాం(సాయితేజ్‌) డిప్యూటీ క‌లెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్‌(జ‌గ‌ప‌తిబాబు) కొడుకు. ఎం.ఎస్ చ‌దువుకుని అమెరికా వెళ్లాల‌నుకుంటాడు. ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో తన ఓటుని ఎవ‌రో రిగ్గింగ్ చేస్తారు. ఆ పోలింగ్‌లో ఎన్నిక‌ల‌ను ఆపాలంటూ క‌లెక్ట‌ర్ విజ‌య్‌కుమార్‌(సుబ్బ‌రాజు)తో గొడ‌వ‌ప‌డ‌తాడు అభిరాం. కానీ విజ‌య్ కుమార్‌తో మాట్లాడిన త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్న అభిరాం యు.పి.ఎస్‌.సి ఎగ్జామ్స్ రాసి కలెక్ట‌ర్ అవుతాడు. ఆ ప్రాంతానికి కలెక్టర్‌గా వచ్చిన పంజా అభిరామ్‌ తెల్లేరు సరస్సు ఆక్రమించినవారిపై చర్యలు తీసుకుంటాడు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విశాఖవాణితో వైర్యం పెరుగుతోంది.  విశాఖ వాణికి రైట్ హ్యాండ్‌లాంటి రౌడీషీట‌ర్ గుణ‌(బాక్స‌ర్ దిన‌)ను ఎన్‌కౌంట‌ర్ చేయిస్తాడు. ఈ పరిణామం ఎంతవరకు దారి తీసింది? నిజాయతీపరుడైన కలెక్టర్‌ అభిరామ్‌.. అవినీతి నాయకురాలైన విశాఖ వాణికి ఎలా బుద్ది చెప్పాడు?   అనేదే మిగతా కథ.

నటీనటుల హావభావాలు :
మెయిన్ హీరో హాస్పటిల్ లో ఉండగా రిలీజ్ అయినా తొలి  చిత్రం ఇదేనేమో?  హీరో సాయితేజ్ న‌టుడిగా మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు.  అవినీతి పరుడైన తండ్రిని కాదని తన కాళ్లమీద తాను నిలబడే వ్యక్తిగా, నిజాయతీ గల కలెక్టర్‌ అభిరామ్‌ పాత్రలో సాయి తేజ్‌ అదరగొట్టేశాడు. ప్రాంతీయపార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించింది. ఇక అవినీతికి పాల్పడే గ్రూప్‌ 1 అధికారి దశరథ్ పాత్రలో జగపతిబాబు ఎప్పటిమాదిరే పరకాయప్రవేశం చేశాడు. అద్భుత ప‌ర్‌ఫార్మెన్స్ అందరికి ఆకట్టుకున్నాడు. ఇక తప్పిపోయిన అన్నయ్యను వెత్తుకుంటూ అమెరికా నుంచి ఇండియా వచ్చిన యువతి మైరా(ఐశ్వర్య రాజేశ్‌) తన పాత్రకు న్యాయం చేసింది. అవినీతి ఎస్సీగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కలెక్టర్‌గా సుబ్బరాజ్‌, జగపతిబాబు భార్యగా ఆమని, తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికవర్గం పనితీరు :
ద‌ర్శ‌కుడు దేవ క‌ట్టా. ఆయ‌న తెర‌కెక్కించిన ప్ర‌స్థానం, ఆటోన‌గ‌ర్ సూర్య చిత్రాల్లో చూపించిన పొలిటిక‌ల్ డ్రామా కంటే, రిప‌బ్లిక్ సినిమాలో పొలిటిక‌ల్ నేప‌థ్యాన్ని ఎక్కువ‌గా చూపించారు. సినిమా ప్రారంభం నుంచి చివ‌ర‌కు వ‌ర‌కు సినిమాను ఓ టెంపోలోనే తీసుకెళ్లారు.అస‌లు వ్య‌వ‌స్థ‌లో ఎక్క‌డ లోప‌ముంది అనే పాయింట్‌ను సునిశితంగా స్పృశించారు డైరెక్ట‌ర్ దేవ‌క‌ట్టా. దీనికి త‌గిన‌ట్లు ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌ను రాసుకున్నారు.  మ‌ణిశ‌ర్మ సంగీతం పర్వాలేదు. త‌న‌దైన పంథాలో మంచి నేప‌థ్య సంగీతాన్ని అందించారు. ఇందులో మూడే పాటలున్నాయి. అవికూడా తెచ్చిపెట్టినట్లుగా కాకుండా సందర్భానుసారంగా వస్తాయి. సుకుమార్ సినిమాటోగ్రఫి బాగుంది.

విశ్లేషణ:
ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌, అడ్మినిస్ట్రేషన్, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ మూడు గుర్రాల వంటివి. ఈ మూడు స‌క్ర‌మంగా దౌడు తీసినపుడే  ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంది. కానీ ముఖ్యంగా రాజ‌కీయ వ్య‌వ‌స్థ తానే బలమైన వ్య‌వ‌స్థ అనుకుని మిగిలిన రెండు వ్య‌వ‌స్థ‌ల‌ను కంట్రోల్ చేయలేకపోవడం వ‌ల్ల వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు దేవ క‌ట్టా. అస‌లు వ్య‌వ‌స్థ‌లో ఎక్క‌డ లోప‌ముంది అనే పాయింట్‌ను సునిశితంగా స్పృశించారు. సినిమా ప్రారంభం నుంచి చివ‌ర‌కు వ‌ర‌కు సినిమాను మంచి టెంపోలోనే తీసుకెళ్లారు. మొత్తంగా చెప్పాలంటే రొటీన్ కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన వారి సంగతి పక్కన పెడితే, పొలిటికల్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి ఈ  ‘రిపబ్లిక్’ నచ్చుతుంది. 

 

Tags :