111 జీవో నిర్ణయం వెనుక ... రూ. లక్షల కోట్ల కుంభకోణం : రేవంత్ రెడ్డి

111 జీవో నిర్ణయం వెనుక రూ.లక్షల కోట్ల కుంభకోణం ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బినామీలు, బంధువర్గాలకు రూ.లక్షల కోట్ల ఆస్తులు కట్టబెట్టడమే హైదరాబాద్‌లో 111 జీవో రద్దు లక్ష్యమని అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం జంట నగరాల పర్యావరణంపై అణువిస్పోటం లాంటిదని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య పేరు చెప్పి కేసీఆర్ సమస్యను చిన్నదిగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బినామీ చట్టాన్ని వర్తింపజేసి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎవరెవరికి భూములు కేటాయించారన్న అంశంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేస్తామని ప్రకటించారు. మొత్తం భూములను పేదల నుంచి కొనుగోలు చేశాక ఇప్పుడు జీవో రద్దు చేశారు. కేసీఆర్ బంధుగుణం, బినామీ చేతుల్లోనే 80 శాతం భూములు ఉన్నాయి. కేసీఆర్ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారు. బినామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలి. జంటనగరాలను కాపాడాలన్న చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలి అని అన్నారు.