కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి

సైనికులను నాలుగేళ్ల ప్రాతిపదికన నియమించు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే యువకులు బలవుతున్నారని ఆరోపించారు. అన్నివిధాల ఆలోచించి, చర్చించి తీసుకురావాల్సిన అగ్నిపథ్ సర్వీసును కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిందన్నారు. సైన్యంలో చేరికలను ఔట్ సోర్సింగ్ ద్వారా చేపట్టడాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఆగ్నిపథ్పై దేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరమన్నారు. రైతులు దేశానికి వెన్నెముఖ అని, సైనికులు దేశ రక్షణ అనే గొప్ప సందేశాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు.
పార్లమెంట్లో చర్చించిన తర్వాత చేయాల్సిన చట్టాలను, చట్టాలు చేసిన తర్వాత పార్లమెంట్లోకి తీసుకొస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకొని, పరీక్షలకు సిద్దమైన యువకుల పట్ల మోదీ ప్రభుత్వం నిరంకుశత్వ వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే సికింద్రాబాద్ స్టేషన్లో అల్లురు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పిలుపునిస్తే టీఆర్ఎస్, ఎంఐఎం దాడి చేశాయో? అని నిలదీశారు. ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భమా అని ప్రశ్నించారు. వారణాసిలో కూడా దాడులు జరిగాయని, అక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్ చేయించిందా? అని ప్రశ్నించారు. రైల్వేస్టేషన్లో జరిగిన ఘర్షణలో ఒకరు చనిపోవడంతో పాటు ఐదుగురికి గాయాలయ్యాని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధితులను పరామర్శించకుండా అమిత్ షా దగ్గరకు వెళ్లారని ఆరోపించారు.