రివ్యూ : నాగార్జున ఫైరింగ్ యాక్షన్ 'వైల్డ్‌డాగ్'

రివ్యూ : నాగార్జున ఫైరింగ్  యాక్షన్ 'వైల్డ్‌డాగ్'

తెలుగుటైమ్స్. నెట్ రేటింగ్ : 2.75/5

షష్ఠి పూర్తి చేసుకున్న సరే మరింత గ్లామర్‌గా రెడీ అవుతూ మన్మథుడు టైటిల్ సార్ధకత ఏర్పర్చుకున్న కింగ్‌ నాగార్జున. అందం, ఫిట్‌నెస్‌లో నేటి  యువ హీరోలకు ధీటుగా కనిపిస్తుంటాడీ స్టార్‌ హీరో. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచే ప్రయోగాలు చేస్తున్న కింగ్ 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న కథా చిత్రాలను చేశాడు. జయాపజయాలను లెక్క చేయకుండా తన పంథాలోనే  దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక పరాజయాలను ఎదుర్కొంటున్న అక్కినేని హీరో,  ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో యాక్షన్‌ థ్రిల్లర్‌ 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. నూతన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాపై నాగ్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ఎన్నో అశలు పెట్టుకున్నారు. ఇలా ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్‌ 02 విడుదలైన ఈ సినిమా నాగార్జునను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? కింగ్‌ నాగార్జున చేసిన మరో ప్రయోగాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? నూతన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్ విజయాన్ని అందుకున్నాడా? రివ్యూలో చూద్దాం.

కథ:

విజయ్‌ వర్మ(నాగార్జున అక్కినేని)  నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అధికారి. సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులను పట్టుకోవడం అతని పని. అయితే ఆయన మాత్రం ఉగ్రవాదులను అరెస్ట్‌ చేయడం కంటే అంతం చేయడమే ఉత్తమమని భావిస్తాడు. అందుకే డిపార్ట్‌మెంట్‌లో ఆయన్ను అంతా ‘వైల్డ్‌ డాగ్‌’ అని పిలుస్తుంటారు. అలా అనేకమంది తీవ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసి సస్పెండ్‌ అవుతాడు విజయ్‌ వర్మ. ఇదిలా ఉండగా  పూణేలోని ఒక బేకరీలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఈ బ్లాస్ట్‌లో విదేశీయులతో పాటు చాలా మంది చనిపోతారు. అయితే, ఈ బ్లాస్ట్ ఎవరు చేశారు అనే విషయంలో పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకదు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎన్ఐఏ మాజీ అధికారి విక్రమ్ వర్మ ను ప్రభుత్వం రంగంలోకి దించుతుంది. విక్రమ్ వర్మ తన టీమ్‌తో కలిసి ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు? ఆయన ఇన్వెస్టిగేషన్‌లో బయటపడిన విషయాలు ఏంటి? ఈ బ్లాస్ట్‌ చేసిన టెర్రరిస్ట్‌ను బ్లాక్ డాగ్ టీమ్ ఎలా పట్టుకుంది? వంటి విషయాలతో మిగతా కథ ఉంటుంది.

నటి నటుల హావ భావాలు:

ఈ సినిమాకు ప్రధాన బలం కింగ్ నాగార్జున. ఇలాంటి పాత్రలు చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఇప్పటికే ‘గగనం’లో ఎన్ఎస్‌జీ కమాండోగా నాగార్జునను చూశాం. ఇప్పుడు ఎన్ఐఏ అధికారిగా ఆయన కనిపించారు. 60 ఏళ్లు పైబడినా అలీరెజా లాంటి కుర్రాళ్లతో పోటీపడి నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశారు. విక్రమ్ వర్మ భార్యగా దియా మీర్జా కనిపించారు. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్నంతలో పర్వాలేదనిపించారు. దియాతో పోలిస్తే సయామీ ఖేర్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉంది. రా ఏజెంట్‌గా ఆమె తన ధైర్య సాహసాలను చూపించారు. ఇక అలీరెజాకు మంచి రోల్ దక్కింది. తన పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. అతుల్ కులకర్ణి, దయానంద్ రెడ్డి, అనీష్ కురువిల్లా, అవిజిత్ దత్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఓ సీరియస్‌ స్టోరీని తెరపై చూపించి మెప్పించడంలో కొంతవరకు సఫలం అయ్యాడు దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్‌ చుట్టూ కథని తిప్పాడు. కథను పక్కదారి పట్టించకుండా మెయిన్  కాన్సెప్ట్‌పై ఫోకస్‌ పెడుతూ సినిమా నడించాడు. ఫస్టాప్‌ ఎక్కువగా ఎమోషనల్‌ కంటెంట్‌కు చోటు ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్‌ మాత్రం ఎక్కువగా పోరాట ఘట్టాలపైనే దృష్టి పెట్టాడు. సెకండాఫ్‌ అంతా చాలా సీరియస్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్‌ నేపథ్య సంగీతం. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కీలక సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే బాగుండనిపిస్తుంది. యాక్షన్స్‌ సీన్స్‌ని మలిచిన తీరు, తెరపై చూపించిన విధానం బాగుంది. షానియల్ డియో సినిమాటోగ్రఫీ అడవిలో ఉగ్రవాదుల వేట వంటి సీన్స్‌ను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు షానియర్ డియో. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

విశ్లేషణ:

హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే ‘వైల్డ్ డాగ్’. మనదేశంలో జరిగే ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్ వెనుక కొంత మంది అధికారుల శౌర్యం, త్యాగం ఉంటాయి. నిజానికి అలాంటి అధికారులకు గుర్తింపు ఏమీ ఉండదు. వాళ్లు అన్‌సంగ్ హీరోలుగానే చరిత్రలో నిలిచిపోతారు. సినిమా పుణ్యమా అని అలాంటి కొంత మంది అన్‌సంగ్ హీరోలను వెండితెరపై చూడగలుగుతున్నాం. ఈ ‘వైల్డ్ డాగ్’ కూడా అలాంటి సినిమానే. ఎన్‌ఐఏ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో ‘వైల్డ్ డాగ్’ కథ సాగుతుంది. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను పట్టుకోవడానికి ఎన్ఐఏ చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా నిజజీవిత ఘటనలతో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు అహిషోర్ సాల్మన్. ఇన్వెస్టిగేషన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్స్ అంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే చాలా కీలకం. అయితే, ‘వైల్డ్ డాగ్’ విషయంలో స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. నెరేషన్ ఇంకాస్త బాగుండి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది.

 

Tags :