రిషి సునాక్ కు పెరిగిన మద్దతు

రిషి సునాక్ కు పెరిగిన మద్దతు

బ్రిటన్‌ తదుపరి ప్రధానమంత్రి పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తుది పోటీలో నిలిచిన భారత సంతతికి చెందిన రిషీ సునాక్‌, లిజ్‌ ట్రస్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. తాజాగా స్కై టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రిషీ సునాక్‌కు అనూహ్య మద్దతు లభించింది. టీవీ డిబేట్‌ను స్టూడియోలో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆయనవైపు మొగ్గుచూపారు. స్కై టీవీ డిబేట్‌లో రిషీ సునాక్‌, లిజ్‌ ట్రస్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రెజెంటర్‌ కే బర్లీ... రిషీకి మద్దతు ఇస్తున్న వారిని చేతులు పైకి ఎత్తమనగా స్టూడియోలో ఉన్న దాదాపు అందరూ స్పందించారు. లిజ్‌ ట్రస్‌కు ఎంత మంది మద్దతు ఇస్తున్నారని అడగ్గా అంత అంతంత మాత్రం స్పందన లభించింది. దీంతో రిషీ, ట్రస్‌ సహా అక్కడున్నవారంతా సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే రిషీ గెలిచే అవకాశాలు 10 శాతం మాత్రమే ఉన్నాయని బ్రిటన్‌ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రిషీకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించడం ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రిటన్‌ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికవుతారనేది సెప్టెంబర్‌ 5న తెలుస్తుంది.  ఇక డిబేట్‌లో భాగంగా రిషీ సునాక్‌, లిజ్‌ ట్రస్‌ ఇద్దరూ కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. లండన్‌ బయట నివసించే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించాలని డిమాండ్‌ చేసి యూటర్న్‌ తీసుకోవడం గురించి లిజ్‌ ట్రస్‌ను ప్రశ్నించగా తన ప్రతిపాదనను మీడియా తప్పుగా ప్రచారం చేసిందని సమాధానం ఇచ్చారు. మంచి నాయకులు తమ తప్పులను ఒప్పుంటారా, ఇతరులను నిందిస్తారా అని కే బర్లీ ఎదురు ప్రశ్న వేయగా.. తాను ఎవరినీ నిందిచడం లేదని, తాను ప్రతిపాదించిన విధానాన్ని వక్రీకరించారని చెబుతున్నానని లిజ్‌ ట్రస్‌ తడబడుతూ జవాబిచ్చారు. రష్యా దండయాత్రపై ఉక్రెయిన్‌ తరపున పోరాడేందుకు బ్రిట్స్‌కు మద్దతు ఇస్తానని చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఆమె ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుత తరుణంలో బ్రిటీష్‌ ప్రజలు ఉక్రెయిన్‌కు వెళ్లకూడదనే ట్రావెల్‌ ఎడ్వైజరీ ఉందని గుర్తు చేశారు.

రిషీ సునాక్‌ కూడా కే బర్లీ నుంచి కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ‘మీరు ఖరీదైన ప్రాడా షూస్‌లో నడుస్తున్నందున వారి బూట్లు ధరించి ఒక మైలు కూడా నడవలేరని ప్రజలు భావిస్తున్నార’ని పశ్నించారు. బిలియనీర్‌ అయిన మామగారికి అల్లుడనే ఉద్దేశంతో ఆమె ఈ ప్రశ్న అడిగ్గా.. ‘తాను ఎన్‌హెచ్‌ఎస్‌ కుటుంబంలో పెరిగానని, నా ప్రచారంలో ఈ విషయం గురించి మీరు వినే ఉంటార’ని రిషీ జవాబిచ్చారు. తన తండ్రి జాతీయ ఆరోగ్య సేవ(ఎన్‌హెచ్‌ఎస్‌)లో డాక్టర్‌గా పనిచేశారని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. 

 

Tags :