రివ్యూ: పూరి అన్నిచిత్రాల కథలతో 'రొమాంటిక్' మూవీ

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ 2.75/5
నటీనటులు : ఆకాశ్ పూరీ, కేతికా శర్మ, రమ్య కృష్ణ, మకరంద్ దేష్ పాండే, సునైన బాదం, రమాప్రభ, ఉత్తేజ్ తదితరులు
నిర్మాణ సంస్థలు : పూరీ కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్
నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ, దర్శకత్వం : అనిల్ పాదూరి
సంగీతం : సునీల్ కశ్యప్,సినిమాటోగ్రఫీ : నరేష్ రానా
విడుదల తేది : అక్టోబర్ 29,2021
పూరీ జగన్నాథ్ తనయుడు బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్ పూరి. ఆయన హీరోగా తెరకెక్కిన రెండవ చిత్రం ‘రొమాంటిక్’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని హిట్ ట్రాక్ ఎక్కించాలని ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించాడు పూరి. ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? ఈ సినిమాతో పూరీ తనయుడు ఆకాశ్ హిట్ కొట్టాడా లేదా రివ్యూలో చూద్దాం.
కథ:
గోవాకి చెందిన వాస్కోడి గామా(ఆకాశ్ పూరీ) పక్కా ఆవారా. ఆయన తండ్రి ఓ సిన్సియర్ పోలీసు అధికారి. ఆయన నిజాయతీ వల్ల ఓ గ్యాంగ్‌స్టర్ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. దీంతో వాస్కోడిగామా నానమ్మ మేరీ (రమా ప్రభ) దగ్గర బస్తీలో పెరుగుతాడు. గోవాలో పేరుమోసిన ఓ డ్రగ్స్ ముఠాలో చేరుతాడు. అనూహ్య పరిణామాల వల్ల ఆ గ్యాంగ్‌కే లీడర్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి మోనిక (కేతిక శర్మ) పరిచయం అవుతంది. ఆమెను చూసి మోహంలో పడతాడు. చివరకు అది ప్రేమగా మారుతుంది. మరోవైపు వాస్కోడిగామా గ్యాంగ్ ఆగడాలకు కళ్లెం వేయడానికి గోవాలో కొత్తగా అడుగుపెడుతుంది అంతేకాక తనకి తాను గా మాఫియా కి రాజు గా ప్రకటించుకుంటాడు. ఈ ప్రక్రియ లో ఆకాష్ ఒక ఎస్ఐ ను చంపుతాడు. ఇదే సమయం లో ఒక క్రూరమైన ఎసిపి రమ్య (రమ్య కృష్ణ) వాస్కో ను పట్టుకోవడానికి ముంబై నుండి గోవా కి బదిలీ చేయడం జరుగుతుంది. రమ్య కృష్ణ తను అనుకున్న పనిని సాధిస్తుందా? వాస్కో మరియు మోనికా ల రిలేషన్ షిప్ ఏమవుతుంది? నిజానికి అది మోహమా, ప్రేమా? అనేదే ‘రొమాంటిక్’కథ. మిగతా విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటినటుల హావభావాలు:
ఆకాష్ మొదటి చిత్రం మెహబూబా తో పోల్చితే చాలా మెరుగు పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా లో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. అతని కాన్ఫిడెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు డైలాగ్ డెలివరీ మెయిన్ హైలెట్ అని చెప్పాలి. చాలా కీలక సన్నివేశాల్లో ఆకాష్ సినిమాను భుజానికి ఎత్తుకున్నారు. ఇక మోనిక పాత్రకి పూర్తి న్యాయం చేసింది కేతికాశర్మ. తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటుందని చెప్పాలి. ఆమెకు ఇది తొలి చిత్రం అయిన కూడా ఆమె నటన చాలా డీసెంట్‌గా ఉంది. ఈ చిత్రంలో రమ్య కృష్ణ సిన్సియర్ పోలీస్ పాత్రలో నటించి కీ రోల్ ప్లే చేశారు. రమ్య వాయిస్ ఓవర్ తో ఈ చిత్రం కథ సరిగ్గా వివరించ బడింది అని చెప్పాలి. హీరో బెస్ట్‌ఫ్రెండ్‌గా దేవియాని శర్మ, గ్యాంగ్ శాంసన్‌గా మకరంద్ దేశ్‌పాండే, పోలీసు అధికారిగా ఉత్తేజ్, అతని భార్యగా యాంకర్ సునైనా తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరో రామ్ పోతినేని ఉస్తాద్ అవతార్ లో ఒక ప్రత్యేక పాటలో మాస్ గా కనిపించడం జరిగింది.
సాంకేతిక వర్గం పనితీరు :
రొమాంటిక్ కథ మీకు పోకిరి, షారుక్ ఖాన్ రాయీస్, పూరి జగన్నాథ్ 143 వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. కథ అంత కొత్తగా ఏమీ ఉండదు, ప్రధాన పాత్రల పై సినిమా ఆధారపడి ఉంటుంది. క్యారెక్టరైజేషన్స్, స్టోరీ సెటప్, మేకింగ్ మరియు డైలాగ్స్ అన్నీ కూడా పూరి మార్క్ తో ఉన్నాయి. దర్శకుడు అనిల్ పాడురీ మంచి చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు అని చెప్పాలి. నటీనటులను మంచిగా హ్యాండిల్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే స్క్రిప్ట్ అనవసరం గా మరియు మామూలుగా ఉంటుంది.
మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ రొమాంటిక్ చిత్రం కి మెయిన్ పిల్లర్లలో ఒకరు అని చెప్పాలి. ఈ చిత్రం లో మంచి పాటల తో పాటుగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. ఎడిటింగ్ బావుంది, సినిమాటోగ్రఫి కూడా పర్వాలేదు అని చెప్పాలి. సుందరమైన గోవా బీచ్ లు మరియు కొన్ని ప్రదేశాలు బాగా చిత్రీకరించబడ్డాయి. నిర్మాణ విలువలు కథకు, స్థాయికి తగిన విధంగా ఉన్నాయి.
విశ్లేషణ :
పూరీ సినిమాల్లో హీరోలే విలన్స్‌గా ఉంటారు. ఒక మంచి పని చేయడం కోసం చెడు మార్గాన్ని ఎంచుకుంటారు. ‘రొమాంటిక్’కథ కూడా అంతే. కానీ దీనికి కొంత ‘రొమాంటిక్’టచ్ ఇచ్చాడు దర్శకుడు, పూరీ శిష్యుడు అనిల్ పాదూరి. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ, కథణం, స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పూర్తిగా ఆయన సినిమాలాగే అనిపిస్తుంది. పూరి గత సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, ఈసినిమాలోనూ అలానే ఉంటాడు. `కర్లో యా మర్‌లో` అనే తత్వం హీరోది. ఇంకా మీసాలు కూడా పూర్తిగా మొలవని ఓ కుర్రాడు.. సడన్‌గా డాన్ అయిపోవడం, ఓ గ్యాంగ్ ని మెయింటైన్ చేయడం.. ఇదంతా సినిమాటిక్‌గా ఉంటుంది.
అయితే లాజిక్‌లను పక్కనపెట్టి.. మ్యాజిక్‌ని నమ్ముకునే పూరీ.. ఇందులో కూడా తనకు తగినట్లుగా సీన్స్ రాసుకున్నాడు. ప్రతి సీన్‌లోనూ, డైలాగ్స్‌లో పూరీ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సినిమాలో కొత్తదనం లేకున్నా.. తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకున్నాడు పూరీ. ఫస్టాఫ్ కొంచెం స్లో అనిపించినప్పటికీ.. సెకండాఫ్ చాలా ఫాస్ట్‌గా ఆసక్తికరంగా సాగుతుంది. సాంకేతికపరంగా చూస్తే..సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్యం సంగీతం అదిరిపోయింది. ఈ సినిమాకి ప్రధానబలం.. పూరి మార్క్ డైలాగులు. ఒక్కో డైలాగ్ బుల్లెట్లలా దూసుకెళ్తాయి. నరేష్ రానా సినిమాటోగ్రఫీ బాగుంది. గోవా నేపథ్యంలో సన్నివేశాల్ని చాలా కలర్‌ఫుల్ గా, జాయ్ ఫుల్ గా తెరకెక్కించాడు.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. చివరగా చెప్పాలంటే.. లాజిక్కులు పక్కనపెట్టి సినిమా చూస్తే.. ఎంజాయ్ చెయ్యొచ్చు. పాత సీసాలో కొత్త సారాయి అన్నట్లు....కొత్తదనం అంటూ ఎక్కడా కనపడదు.