రివ్యూ: రాజమౌళి మార్క్ విజువల్ వండర్ 'RRR'

రివ్యూ: రాజమౌళి మార్క్ విజువల్ వండర్ 'RRR'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5

బ్యానర్: డి వి వి ఎంటర్టైన్మెంట్స్

నటీనటులు: జూనియర్ N. T. రామారావు , రామ్ చరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, శ్రియా శరణ్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు. సంగీత దర్శకుడు: ఎం. ఎం. కీరవాణి సినిమాటోగ్రఫీ: కె. కె. సెంథిల్ కుమార్ ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్ మాటలు : సాయి మాధవ్ బుర్ర కథ: కె. వి. విజయేంద్ర ప్రసాద్ నిర్మాత: డి.వి.వి.దానయ్య స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎస్.ఎస్.రాజమౌళి

విడుదల తేదీ: 25.03.2022

సహజంగా ఓ స్టార్ హీరో సినిమా వస్తుందంటే సినీ ప్రేక్షకుడికి పండగే పండగ... అదే ఇద్దరు అగ్రహీరో కలసి నటిస్తే.... దానికి తోడు అప్రతిహతంగా ఓటమి ఎరుగని దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి వంటి ప్రేక్షక నాడి తెలిసిన దర్శకుడు నీరు లాంటి ఎన్టీర్ ను, నిప్పు వంటి రాంచరణ్ కు ఆజ్యం తోడైనట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు తలతిప్పేటట్లు ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. కథా గమనంలో ప్రేక్షకుడ్ని లీనం చేయడం. ఆ కథ నచ్చిందంటే ప్రేక్షకుడ్ని కౌగిలి నుంచి విడుదల కానివ్వదు. ఇలాంటి కథల తాలుకా లక్షణాల వృక్షం రాజమౌళి. సినిమా అంటే జీవితం అనే ఫిల్మ్ మేకర్స్ చాలామందే ఉంటారు.. కానీ వెండితెరపై జీవితాన్ని ఆవిష్కరించే శిల్పి జక్కన్న. ఎంత గ్రాఫిక్స్ మాయాజాలంతో జక్కన్న చిత్రం చెక్కినా.. అందులో భావోద్వేగాలకి ధీరోదాత్తతకి పెద్ద పీట వేస్తాడు. పోరాట యోధులు, చరిత్రకారులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ల పాత్రలను మిళితం చేసి ఓ పిరియాడికల్ యాక్షన్ డ్రామాను ఫిక్షన్ కథగా రాసుకుని ప్రజలను ఎంటర్టైన్ చేయడం మాములు విషయం కాదు. రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ ఈ ముగ్గురిలో మొదటి అక్షరాలు 'R' 'R' 'R' వర్కింగ్ టైటిల్ గా 2019 మార్చ్ 14న ప్రకటన ఇచ్చారు. ఆ తరువాత కరోనా వేవ్స్ దాటుకుంటూ... నాలుగైదు సార్లూ విడుదల వాయిదా వేసుకుంటూ. ఎట్టకేలకు ఈ రోజు ప్రెకషకుడి ముందుకు వచ్చింది. కొమరం భీం గా యంగ్ టైగర్ ఎన్టీర్, అల్లూరి సీతారామరాజు గా మెగా పవర్ స్టార్ రాంచరణ్, చిత్రం లో ఎలా కనిపించారో? 1920 లో జరిగిన కథగా బ్రిటీష్ వారిపై ఎలా పోరాటం చేసారో? రౌద్రం రణం రుధిరం 'ఆర్ఆర్ఆర్' చిత్ర సమీక్ష లో తెలుసుకుందాం.

కథ:

1920 ప్రాంతంలో ఇద్దరు వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిసి తెల్లదొరలపై పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో అల్లిన పిరియాడికల్ ఫిక్షన్ కథే ఈ సినిమా. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో విశాఖపట్నం పరిసర ప్రాంతానికి చెందిన రామరాజు (రాంచరణ్) పోలీస్ ఆఫీసర్ గా ఢిల్లీ లో పనిచేస్తుంటాడు. బ్రిటిష్ అధికారుల మెప్పు, పదోన్నతి పొందాలన్నదే అతని ఆశయం. అతని తండ్రి వెంకట రాజు(అజయ్ దేవగణ్) ఆశయం, మరదలు సీత(అలియా భట్) కు ఇచ్చిన మాట నెరవేరాలంటే తన లక్ష్యం ఇదేనని బాధ్యతగా ఉద్యోగం నిర్వర్తిస్తాడు. మరో వైపు బ్రిటీష్ గవర్నర్ స్కాట్ దొర (రే స్టీవెన్ సన్) తన కుటుంబముతో ఆదిలాబాద్ అడవి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అక్కడ గోండు జాతికి చెందిన మల్లి అనే చిన్నారిని బలవంతంగా ఢిల్లీ తీసుకెళతారు. అడ్డు వచ్చిన తల్లిని, గిరిజనులను హింసిస్తారు.గోండు జాతికి ఉక్కు కవచంలాంటి భీం (ఎన్టీర్) చిన్నారిని తెల్లదొరల బానిసత్వం నుంచి విడిపించడానికి ఢిల్లీకి వెళ్లి అక్తర్‌గా మారతాడు భీమ్. అయితే భీమ్ సమచారం తెలుసుకున్న బ్రిటీష్ గవర్నర్ స్కాట్ దొర అతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక అధికారిగా రామరాజుని నియమిస్తాడు. అనూహ్యంగా భీమ్, రామరాజులు స్నేహితులుగా మారతారు. తప్పనిసరి పరిస్థితుల్లో తన ఆశయం కోసం రామరాజు భీమ్‌ని బంధిస్తాడు? దారుణంగా హింసిస్తాడు.. ఓ వైపు స్నేహం.. మరోవైపు తన ఆశయం.. ఇలాంటి పరిస్థితుల్లో రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు.. భీమ్ తన స్నేహితుడ్ని ఎలా కాపాడుకున్నాడు.. వీళ్లిద్దరి మధ్య జరిగిన సంఘర్షణ ఏంటి? మల్లి కోసం ఢిల్లీ వచ్చిన భీమ్.. మట్టికోసం స్వరాజ్యం కోసం అందరికీ ఆయుధం అందించాలనే ఆశయంతో వచ్చిన రామరాజు కలిసి తెల్లదొరలపై తిరగబడిన చేసిన రణం ఏ విధంగా ఉందొ తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

నటి నటుల హావభావాలు:

నిప్పు నీరు అంటూ ఇద్దరు హీరోలను రెండు శక్తులుగా.. విప్లవ జ్యోతులుగా పరిచయం చేసి కథలోకి తీసుకుని వెళ్లారు రాజమౌళి. అలాంటి రెండు శక్తులు తలపడితే పోరు ఎంత భీకరంగా ఉంటుందో కళ్లకి కట్టారు రాజమౌళి. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అయితే రెండు పులులు తలపడినట్టుగా అనిపిస్తాయి. పులితో పోరాడి బంధించే సీన్‌లో కొమరం భీం విజృంభించాడు. అయితే పులుల్ని క్రూర మృగాలను ఎందుకు వేటాడుతున్నాడు.. ఎందుకు బంధిస్తున్నాడన్న దానికి ఇంటర్వెల్‌‌ బ్యాంగ్‌లో ఇచ్చే జస్టిఫికేషన్‌కి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారు. ఇక ఎన్టీఆర్ తన పరిపక్వతమైన నటనతో, చరణ్ తన ఎమోషనల్ కనెక్టివిటీతో ఈ చిత్రంలోనే ఇద్దరు ఉత్తమమైన నటనను కనబర్చారు. డిఫరెంట్ వేరియేషన్స్‌లో రామ్ చరణ్‌ పాత్రని అద్భుతంగా చెక్కాడు జక్కన్న. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో హీరోలిద్దరూ తమ మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. ముఖ్యంగా రెండు పాత్రల్నీ బ్యాలెన్స్ చేసిన విధానం బాగుంది.

అయితే ఫస్టాఫ్‌లో చాలావరకూ రామ్ చరణ్ పాత్రకి ఎక్కువ స్కోప్ లభించింది. ప్రాణంకంటే ఎక్కువ నమ్మిన భీమ్‌ని అంత క్రూరంగా ఎందుకు హింసిస్తున్నాడు.. తెల్లదొరల ప్రోత్సాహం పొంది స్పెషల్ ఆఫీసర్ కావడం కోసం భీమ్‌ని అంత రాక్షసంగా హింసించాలా? అయ్యో పాపం అనేట్టుగా చేసి.. చివర్లో అతని లక్ష్యాన్ని.. దాని వెనుక ఉన్న నేపథ్యాన్ని చూపించి అతని రోల్‌కి మరింత బలాన్ని ఇచ్చారు. భీమ్ కోసం అతను చేసిన త్యాగంతో కథ వేగం పుంజుకుంది.. ఇద్దరికిద్దరు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటించారు. సీతారామరాజు తండ్రి పాత్రలో వెంకటరామరాజుగా అజయ్ దేవగన్ ఉన్నంత సేపు ఆకట్టుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లో భాగం అయ్యారు. అతని భార్య సరోజిని‌గా శ్రియ ఆకట్టుకుంది. బ్రిటీష్ యువతి పాత్రలో ఓలివియా మోరిస్.. ఉన్నంతలో పర్వాలేదు. ఎన్టీఆర్‌కి సాయంగా నిలిచే బ్రిటీష్ యువతిగా ఆ పాత్రకి న్యాయం చేసింది. ఇక సీత పాత్రలో రామ్ చరణ్‌కి జోడీగా చేసి అలియాభట్ పర్వాలేదు. అయితే ఈ రెండు పాత్రలకు బాలీవుడ్, హాలీవుడ్ భామలు అవసరమా అనేట్టుగా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్లకు పెద్దగా స్కోప్‌లేదు. వీళ్లకంటే పెర్ఫామెన్స్ పరంగా శ్రియ మెప్పించిందనే చెప్పాలి. రామరాజు బాబాయ్‌గా సముద్రఖని మెప్పించారు. అయితే భీమ్‌కి స్నేహితుడిగా నటించిన రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంలో మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది.

సాంకేతికవర్గం పనితీరు:

సినిమా ఆధ్యంతం గ్రాండియర్ గా వుంది. ఈ సినిమాకి ప్రధాన బలం నేపథ్య సంగీతం. భీకరపోరు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యింది. సెంథిల్‌ సినిమాటోగ్రఫీ, శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్.. రాజమౌళి ఊహా ప్రపంచానికి మరోసారి ఊపిరి పోశాయనే చెప్పాలి. విజువల్ వండర్ క్రియేట్ చేశారు. ఇక బ్రిటీష్ నాటి ఇండియా ను కళ్లకు కట్టినట్లుగా నిర్మిచారు సాబు సిరిల్ ఇందులో పాత్రల కోసం రామా రాజమౌళి ఎంపిక చేసిన కాస్ట్యూమ్స్ నటులను పాత్రలోకి పరకాయప్రవేశం చేసాయి. సల్మాన్ పోరాట ఘట్టాలు, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ, రామరాజు సీతారామారాజుగా మారి.. తొక్కుకుంటూ వెళ్దాం భీమ్ అనే పదునైన సంభాషణలతో సాయి మాధవ్ బుర్ర పదును చాలా చోట్ల వినిపిస్తుంది. ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్ కత్తిరింపు కథకు అనుగుణంగా వుంది. చందమామ కథల్లాంటి ఫిక్షన్ స్టోరీ రాయడంలో రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్‌ మహాదిట్ట. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు వంటి రెండు పాత్రలను ముడిపెడుతూ రచయిత విజయేంద్ర ప్రసాద్ అల్లిన కథ అందరిని మెప్పించింది.

ఇక రాజమౌళి ఊహా ప్రపంచానికి మరోసారి ఊపిరి పోశాయనే చెప్పాలి. విజువల్ వండర్ క్రియేట్ చేశారు.మొత్తంగా రాజమౌళి కథ చెప్పే విధానంలో కన్ఫ్యూజ్ ఉండదు. ఎందుకంటే కథ మొత్తం ముందే చెప్పేస్తారు. ఇతని ఫిక్షన్ కథలు చందమామ కథలాగే ఉంటాయి. కథ మొత్తం ముందే చెప్పినా... .కుర్చీలో నుంచి కథలకుండా చేయడమే రాజమౌళి స్పెషాలిటీ. సెకండాఫ్‌లో కాస్త సాగదీతగా అనిపించినా యాక్షన్ సీక్వెన్స్‌లతో కవర్ చేశారు. ఇప్పటి వరకు సింగల్ ప్లాప్ ఎరుగని రాజమౌళి సినిమా హిట్ పక్కా అని ఫిక్స్..

విశ్లేషణ:

విజువల్ వండర్ గా సాగిన ఈ ఎమోషనల్ క్లాసిక్ డ్రామాలో.. గొప్ప యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ – చరణ్ నటన, రాజమౌళి దర్శకత్వ పనితనం, కీరవాణి సంగీత స్వరాలు.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం, ఎంత పెద్ద హిట్ అనేదే అసలు విషయం. బాహుబలితో పోలిక అడక్కుండానే వస్తుంటుంది కాబట్టి..ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ వేరు ఈ చిత్రం వేరు మరీ ఆ స్థాయిలో లేకపోయినా.. . రౌద్రం రణం రుధిరం సమపాళ్లలో రంగరించిన ఉద్వేగ ఝ‌రి. మరుపురాని ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని ఆశించాలనే భారీ అంచనాలతో కాకుండా ఓ మంచి సినిమా చూద్దాం అనేవారికి తప్పుకుండా నచ్చుతుంది. సినిమా చూసిన వాళ్లు బాగుందనే సంతృప్తితో థియేటర్స్ బయటకు వస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు.

 

 

 

Tags :