MKOne TeluguTimes-Youtube-Channel

గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీకేజీ వెనుక కవిత.. ఆర్‌ఎస్పీ షాకింగ్ కామెంట్స్!

గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీకేజీ వెనుక కవిత.. ఆర్‌ఎస్పీ షాకింగ్ కామెంట్స్!

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ విషయంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్వశ్చన్ పేపర్ లీకేజీ వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్ రావు హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్‌కు చెందిన కొందరు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కాన్ఫిడెన్సియల్ విభాగంలో పనిచేస్తున్నారని చెప్పిన ప్రవీణ్ కుమార్.. వీళ్లే గ్రూప్-1 క్వశ్చన్ పేపర్లను కవితకు అందించారని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని.. సరైన సమయంలో వాటిని హైకోర్టుకు కానీ, సీబీఐకి కానీ అప్పగిస్తానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ బి. జనార్ధన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే ఈ పేపర్ లీకేజీ గురించి దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్‌పై తనకు ఏమాత్రం నమ్మకం లేదని తేల్చేశారు. సిట్ నుంచి డీజీపీ, చీఫ్ సెక్రటరీకి వచ్చే నివేదికలు చివరకు సీఎం చేతికే చేరతాయని.. ఇలాంటి సమయంలో బాధితులకు కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని.. తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి ఆర్టికల్ 317 కింద టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.

 

 

Tags :