ఇది మీ ప్రభుత్వం... దయచేసి ఆందోళన విరమించండి

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి స్పందించారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన విరమించాలని కోరుతూ విద్యార్థులకు లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నారనే నా ఆవేదన. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దు. విద్యార్థుల ఆందోళనలు చూస్తే మంత్రిగా ఓ అమ్మగా బాదేస్తోంది. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్ని నియమించాం. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణను ప్రభుత్వం మీ వద్దకు పంపింది. వారితో కూడా చర్చించండి అని సబిత సూచించారు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ కమిటీ, యూనివర్సిటీ కమిటీ అంతర్గతంగా చర్చించుకొని, సమస్యలను పరిష్కారించుకోవాలని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాసర ట్రిపుల్ ఐటీకి మంచి పేరుంది. అలాంటి యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలగవద్దని మాత్రమే కోరుతున్నాను అని లేఖ పేర్కొన్నారు.