ఏపీలో ప్రతిదీ రాజకీయమేనా..? అన్ని వేళ్లూ అటువైపే ఎందుకు..?

ఏపీలో ప్రతిదీ రాజకీయమేనా..? అన్ని వేళ్లూ అటువైపే ఎందుకు..?

ఏపీలో ఏం జరిగినా అది రాజకీయ రంగు పులుముకోవడం సర్వసాధారణం అయిపోయింది. ప్రతి చిన్న సంఘటన వెనుకూ ఎవరో ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. అది పల్లెలో జరిగినా, పట్నంలో జరిగినా ఎవరో ఫలానా నాయకుడి వల్లే ఇలా జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు విజయవాడలో వెలుగులోకి వచ్చిన సంకల్ప సిద్ధి చీటింగ్ కేసు వ్యవహారం కూడా పొలిటికల్ టచ్ అద్దుకుంటోంది. ఈ సుమారు 170 కోట్ల రూపాయల కుంభకోణం దీని వెనుక ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీల ఆధ్వర్యంలోనే జరిగిందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. వీళ్లు మాత్రం దీనికి, తమకు ఏమాత్రం సంబంధం లేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్తున్నారు. మరి దీని వెనుక ఎవరున్నారు..?

విజయవాడలో సంకల్ప సిద్ధి చీటింగ్ కేసు తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు వసూలు చేసిన ఈ సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేసింది. పది వేల నుంచి పది లక్షల వరకూ బాధితులు పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు నెలల్లో కట్టిన డబ్బుకు మూడింతలు చెల్లిస్తామని సంకల్ప సిద్ధి సంస్థ డబ్బులు వసూలు చేసింది. ప్రారంభంలో కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెట్టినవారికి బాగానే చెల్లించడంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగింది. దీంతో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది వరకూ ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని ఆశించిన పెట్టుబడిదారులు తాము కూడబెట్టిన సొమ్మును సంకల్ప సిద్ధిలో పెట్టారు. కొంతమంది అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టినట్లు చెప్తున్నారు. చివరకు సంకల్ప సిద్ధి సంస్థ చేతులెత్తేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

సంకల్ప సిద్ధి సంస్థ అనతికాలంలోనే ప్రజలకు చేరువైంది. పది వేల నుంచి ఎంతమొత్తంలో అయినా పెట్టుబడి పెట్టే వీలుండడం.. తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బు రిటర్న్ వస్తుందని నమ్మించడంతో చాలా మంది పెట్టుబడి పెట్టారు. తాము పెట్టిన డబ్బులతో రియల్ ఎస్టేట్, ఎర్రచందనం మొక్కల పెంపకం చేపట్టబోతున్నట్టు సంకల్ప సిద్ధి ఎండీ గుత్తా వేణుగోపాల్, అతని అనుచరులు నమ్మించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని భూములు కూడా కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ భూముల్లోనే ఎర్రచందనం మొక్కలు పెంచి పెద్దఎత్తున రిటర్న్స్ ఇవ్వబోతున్నట్టు జనాన్ని నమ్మించారు. అంతేకాదు.. సంకల్ప్ మార్ట్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో మార్టులు ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. ఒక్కో మార్టుకు 50 లక్షల మేర ఫ్రాంచైజీ ఫీజ్ వసూలు చేసేందుకు స్కెచ్ వేశారు.

సంకల్ప సిద్ధి సంస్థ ఎండీ గుత్తా వేణుగోపాల్ విజయవాడలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందారు. ఆయన పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నట్టు సమాచారం. అంతేకాక.. పెద్దమొత్తంలో బంగారంపైన కూడా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఏఏ సంస్థలో ఎంత పెట్టుబడి పెట్టారు.. ఆయనకు ఎవరెవరితో లావాదేవీలు ఉన్నాయనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే గుత్తా వేణుగోపాల్ తో పాటు ఆయన అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది.

సంకల్ప సిద్ధి స్కాం సూత్రధారి గుత్తా వేణుగోపాల్ కు.. వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీకి సంబంధం ఉందని టీడీపీ నేత పట్టాభి, బొండా ఉమ ఆరోపించారు. వాళ్ల కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని.. దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని కాల్ డేటాను బహిర్గత పరచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీ నేతల ఆరోపణలపై వల్లభనేని వంశీ స్పందించారు. ఆయన డీజీపీని కలిసి సంకల్ప సిద్ధి వ్యవహారంపై విచారణ జరిపాలని కోరారు. తనపాత్ర కానీ, కొడాలి నాని పాత్ర కానీ ఉన్నట్టు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. గతంలో కూడా గుడివాడలో క్యాసినా వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు కొడాలి నాని పేరు బయటికొచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా వీళ్ల పేర్లు బయటకు రావడంతో మున్ముందు ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. 

 

 

Tags :