రివ్యూ : మహేష్ కనుసోంపైనా 'సర్కారు వారి పాట'

రివ్యూ : మహేష్ కనుసోంపైనా 'సర్కారు వారి పాట'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్  
నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, నదియా, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, మహేష్ మంజ్రేకర్, తదితరులు.
సంగీత దర్శకుడు: థమన్ ఎస్, సినిమాటోగ్రఫీ: ఆర్ మధి, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట
దర్శకత్వం : పరశురాం పెట్ల
విడుదల తేదీ : 12.05.2022

రెండున్నరేళ్లుగా తెరపై మహేష్ బాబుని చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్‌కు టైం వచ్చింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సర్కారు వారి పాట. ఈ సినిమా రాక కోసం అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ చిత్రం ఈ రోజు అత్యధిక థియేటర్లలో విడుదల అయింది. దాదాపు సర్కారు వారి పాట చిత్రం ఈరోజు  (మే 12) విడుదలైంది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

కథ:
మహేష్ (మహేష్ బాబు) యూఎస్‌లో లోన్ రికవరీ బిజినెస్ చేస్తుంటాడు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా డబ్బు విషయంలో మహేష్ ఎంతో నిబద్దతతో ఉంటాడు. బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ తల్లిదండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులను కోల్పోయిన మహేష్.. అప్పు లేని వాడు బలవంతుడు అని.. ఆ అప్పును రికవరీ చేసేవారు ఇంకా బలవంతులని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పోరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు. వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహేష్ ను మోసం చేసి కళావతి (కీర్తి సురేష్) అతని దగ్గర అప్పు తీసుకుంటుంది. డబ్బు తిరిగి చెల్లించకుండా చీట్ చేస్తోంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్‌కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ (నదియా) తారసపడుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కళావతి తండ్రి రాజేంద్రనాథ్ ను కలుస్తాడు మహేష్. రాజేంద్రనాథ్ తనకు పదివేల కోట్లు అప్పు ఉన్నాడని మహేష్ మెలిక పెడతాడు. ఈ క్రమంలో కథ మలుపు తిరుగుతుంది. అసలు మహేష్ టార్గెట్ ఏమిటి? ఇంతకీ ఎవరు ఈ రాజేంద్రనాథ్? మహేష్ అతన్ని ఎలా హ్యాండిల్ చేశాడు? అసలు మహేష్ ఇదంతా దేని కోసం చేశాడు ? అనేది మిగిలిన కథ.  వైజాగ్‌కు వచ్చిన మహేష్ ఏం చేశాడు? బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి? అసలు పది వేల కోట్ల మ్యాటర్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:
మహేష్ కామెడీ టైమింగ్‌ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఇక తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే మహేశ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూల్ చేసే పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి కారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతీ ఒక్క సీన్‌లో మహేష్ తన మార్క్ చూపించాడు. ఇక ఇందులో యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మహేష్ అభిమానుల చేత విజిల్స్ వేయిస్తాయి. ఈ సినిమా మొత్తాన్ని మహేష్  ఒంటి చేత్తో నడిపించేశాడు. ఇక కీర్తి సురేష్‌ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంత వరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్బుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్ర నాథ్ పాత్రలో సముద్రఖని మెప్పించాడు. అలాగే కీలకమైన నదియా రోల్‌.. ఆ పాత్రలో ఆమె నటించిన విధానం ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. తనికెళ్లభరణి, వెన్నెల కిషోెర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను ఇలా అందరూ కూడా పర్వాలేదనిపించారు.  ఫ్లాష్ బ్యాక్‌లో ఓ రెండు మూడు నిమిషాలు కనిపించే సీన్‌లో నాగబాబు మహేష్ తండ్రి పాత్రలో మెప్పించాడు.

సాంకేతిక వర్గం పనితీరు:
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. పరుశురామ్ దర్శకుడిగా ఆకట్టుకున్నా.. రచయితగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారానిపిస్తుంది. అప్పు తీసుకోవడం, తీర్చడం వంటి విషయాల మీద ఈ సినిమాను నడిపించాడు దర్శకుడు. అయితే కథలో బలం లేకపోయినా, కామెడీతో సాగే వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. సంగీత దర్శకుడు తమన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాలో విజువల్ పరంగా వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ కూడా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సినిమాలో కొన్నిచోట్ల స్లోగా సాగిన కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. మూడు నిర్మాణ సంస్థలు కలిసి చేసిన ఈ చిత్ర నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.

విశ్లేషణ:
సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించినా.. లోతుల్లో మాత్రం సందేశాన్ని అందింస్తుంది. అది ప్రతీ ఒక్కరికీ రిలేట్ అవుతుంది. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పుల్లేని మనుషులు సాదారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు.. తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు. అప్పు తీసుకోవడం, తీర్చడం వంటి విషయాల మీద కథను అల్లుకున్నాడు దర్శకుడు. అప్పు తీసుకునేటప్పుడు భయం ఉండాలి.. తీర్చేటప్పుడు గర్వం ఉండాలి.. ఒక్కసారి ఆ గర్వం ఎలా ఉంటుందో చూడండి అని చివర్లో మహేష్ బాబు విలన్‌కు చెప్పే డైలాగ్స్ మాత్రం అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి. అప్పు అంటే ఆడపిల్లలాంటిదని, బాధ్యత గల అమ్మాయి తండ్రిలా మార్చుతాను అంటూ మహేష్ బాబు చెప్పే మాటలు బాగున్నాయి.  

దేశంలోని ప్రస్తుత పరిస్థితి, జరిగిన కొన్ని విషయాలను స్పృశిస్తూ ఈ కథను దర్శకుడు పరుశురామ్ రాసుకున్నట్టు కనిపిస్తోంది. రైతులు, సాధారణ ప్రజలు, మధ్య తరగతి వాళ్ల మీద బ్యాంకులు చూపించే ప్రతాపం.. వేల కోట్ల ఎగవేసి విదేశాలకు పారిపోయే వారి మీద చూపించదని పరోక్షంగా చురకలు అంటించారు. కొంత మంది వేలకోట్లు ఎగవేస్తే.. వాటిని సాధారణ ప్రజల నుంచే బ్యాంకులు, ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయ్ అని ఈ సినిమా ద్వారా సందేశాన్ని అందించారు. వారు ఎగవేస్తే వాటిని ప్రజలు కడుతున్నారంటూ అందరిలోనూ ఆలోచనలు కలిగించేలా మాటలు, కథను డైరెక్టర్ రాసుకున్నాడు. అయితే ఇలాంటి సీరియస్ అంశానికి వినోదాన్ని జోడించి చూపించడం పంటికింద రాయిలా అనిపిస్తుంది. కానీ కమర్షియల్ లెక్కలు, ఫ్యాన్స్ ఈక్వేషన్స్ దృష్ట్యా అవి తప్పవు.

అయితే ఈ కథలో మాత్రం ఆహా అనిపించే ట్విస్టులు గానీ, ఓహో అనిపించే సీన్లు గానీ, సీటు అంచున కూర్చోబెట్టే కథనం గానీ ఉండదు. అంతా కూడా ఊహకందేలానే సాగుతుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో మహేష్ బాబు కామెడీ, కీర్తి సురేష్‌తో రొమాంటిక్ ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. ఇక ద్వితీయార్థంలో కాస్త సీరియస్‌గా కథ సాగుతుందని అనుకుంటే అక్కడా కాస్త  నిరాశే ఎదురవుతుంది. అయితే సెకండాఫ్‌లో కీర్తి సురేష్ పాత్రకు ఏ మాత్రం  ప్రాధాన్యం లేనట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో ప్రేక్షకుడికి ముందే తెలిసి పోతుంది. అయితే మహేశ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో తన అభిమానులను బాగా అలరించాడు కాబట్టి సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఓవరాల్ గా ఈ చిత్రం మహేష్ హిట్ మూవీస్ లో ఆడ్ అవుతుంది.

 

Tags :