జస్టిస్ ఎన్వీ రమణ మరో సంచలన నిర్ణయం

జస్టిస్ ఎన్వీ రమణ మరో సంచలన నిర్ణయం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా గే వ్యక్తి నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు సీనియర్‌ న్యాయవాది సౌరభ్‌ కిర్పాల్‌కు పదోన్నతి కల్పించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. న్యాయవ్యవస్థలో బహిరంగంగా స్వలింగ సంపర్కుడైన సభ్యుడిని బెంచ్‌కు ప్రమోట్‌ చేయాలని సుప్రీం కొలీజియం సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. కిర్పాల్‌ గనుక న్యాయమూర్తిగా నియమితులైతే, భారతదేశపు మొట్టమొదటి గే జడ్జిగా రికాక్డుకెక్కుతారు. నవంబర్‌ 11న జరిగిన కొలీజియం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో లా లో అండర్‌ అండర్‌గ్రాడ్యుయేషన్‌, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాస్టర్‌ డిగ్రీ చేసిన సౌరభ్‌ సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాలకుపైగా లాయర్‌గా ఉన్నారు. తొలిసారిగా 2017 అక్టోబర్‌లోనే ఆయనకు పదోన్నతి కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఆయన పేరును సిఫార్సు చేయడం ఇది నాలుగోసారి అని తెలుస్తోంది.

 

Tags :