తెలుగు రాష్ట్రాలు మరోసారి అగ్రస్థానంలో

సరళతర వ్యాపార నిర్వహణలో తెలుగు రాష్ట్రాలు మరోసారి అగ్రస్థానంలో నిలిచాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు తొలిస్థానాల్లో నిలిచాయి. వ్యాపార సంస్కరణలను సమర్థంగా అమలు చేయడంలో మొత్తం ఏడు రాష్ట్రాలు ర్యాంకులు సాధించగా వాటిలో ఈ మూడు రాష్ట్రాలు ముందంజలో నిలిచినట్లు తాజా నివేదిక వెల్లడించింది. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2020 అమలు ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆర్థికశాఖ ర్యాంకులు ప్రకటించింది. ఇందులో మొత్తం ఏడు రాష్ట్రాలకు గాను ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణలో ముందు వరుసలో నిలవగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వ్యాపార సంస్కరణలు అమలు చేసిన విభాగంలో ర్యాంకులు పొందాయి.
ఈ విభాగంలో అస్సాం, కేరళ, గోవాతో సహా ఏడు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ఇక అభివృద్ధి చెందుతున్న వాణిజ్య వ్యవస్థ కేటగిరీలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఢల్లీి, పుదుచ్చేరి, త్రిపుర వంటి రాష్ట్రాలు ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు.