రివ్యూ : తాజా హాట్ కేక్ 'షాదీ ముబారక్'

రివ్యూ : తాజా హాట్ కేక్ 'షాదీ ముబారక్'

తెలుగు టైమ్స్. నెట్ రేటింగ్ : 2.75/5  

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  
నటీనటులు: వీర్ సాగర్ (ఆర్కే నాయుడు), దృష్ట్యా రఘునాథ్, రాహుల్ రామకృష్ణ, హేమ, ఝాన్సీ, ప్రియదర్శిని రామ్ రాజశ్రీ నాయర్, హేమంత్, శత్రు, భద్రం, మధు నందన్, అజయ్ ఘోష్, తదితరులు నటించారు.
సంగీతం: సునీల్ కశ్యప్
ఎడిటర్ : మధు, ఆర్ట్ డైరెక్టర్: నాని, లైన్ ప్రొడ్యూసర్: బండి రత్న కుమార్
అసోసియేట్ ప్రొడ్యూసర్:  టి. శ్రీనివాస్ రెడ్డి, సమర్పణ : అనిత
నిర్మాతలు: దిల్  రాజు, శిరీష్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: పద్మశ్రీ,
విడుదల తేదీ : 05.03.2021

ఈ నాటి ప్రేక్షకుడి నాడి పట్టుకున్న దిల్ రాజు కోట్లు ఖర్చుపెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాదు.. అప్పుడప్పుడు చిన్న సినిమాలను కూడా ఆదరిస్తుంటాడు దిల్ రాజు. అలా ఆయన బ్యానర్ నుంచి వచ్చిన సినిమా షాదీ ముబారక్. చక్రవాకం సీరియల్ ఆర్కే నాయుడు ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. దిల్ రాజు టేక్ ఓవర్ చేసిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయ్యింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో "నా జడ్జ్‌మెంట్‌ని నమ్మి శాటిలైట్ వాళ్లు కానీ.. ఓటీటీ వాళ్లు ముందుకు వస్తారు వాళ్ళ నమ్మకం ‘షాదీ ముబారక్’ వమ్ము చేయదు" అన్న మాట మరి ఆయన ఎంత వరకు నిలపెట్టుకున్నాడో సమీక్షలో చూద్దాం.

కథ:
సున్నిపెంట మాధవ్(వీర్ సాగర్, ఆర్కే నాయుడు) ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు పెళ్ళిచూపులకు వస్తాడు. ఒకే రోజు ముగ్గురు అమ్మాయిలు చూడడానికి వెళ్తాడు. ఆయనకు తోడుగా మ్యారేజ్ బ్యూరో తరఫు నుంచి సత్య భామ (దృష్ట్యా రఘునాథ్) వస్తుంది. ఈ ప్రయాణంలో తెలియకుండానే ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోతారు. కానీ అదే సమయంలో ఆ చూసిన ముగ్గురు అమ్మాయిలలో ఒకరికి మాధవ్ ఓకే చెప్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది కథ..

నటీనటులు:
సీరియల్స్ తో మెప్పించిన ఆర్కే నాయుడు ఈ సింపుల్ కథతో హీరో అయ్యాడు. స్క్రీన్ పై బాగా కనిపించడమే కాదు.. నటించాడు కూడా. ఇక హీరోయిన్ దృష్ట్యా రఘునాథ్ అద్భుతంగా నటించింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అలరించింది. ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ..ఆ వాయిస్ తో ప్రేమలో పడిపోతారు ప్రేక్షకులు. రాహుల్ రామకృష్ణ, హేమంత్, భద్రం ముగ్గురు బాగా నవ్వించారు. హీరోయిన్ తండ్రిగా ప్రియదర్శిని రామ్ నటన బాగుంది.

సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకు మెయిన్ హీరో దర్శకుడు పద్మశ్రీ. అందమైన కథను ఖర్చు లేకుండా అలరించే విధంగా తెరకెక్కించాడు ఈయన. ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి సన్నివేశాలు రాసుకున్నాడు. ఎడిటింగ్ చాలా నీట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువలు సినిమాకు సరిపడా వున్నాయి.

విశ్లేషణ:
సినిమాకి ఎంత ఖర్చు పెట్టమన్నది ముఖ్యం కాదు ఎలా ప్రేక్షకుడిని మెప్పించమన్నది ఈ సినిమా రుజువు చేసింది. కథ, కథనం పక్కాగా రాసుకోవాలే గానీ.. సినిమా తీయడానికి కోట్లు అవసరం లేదు ఒక కారు.. అందులో పెట్రోల్ ఉంటే చాలు అని నిరూపించింది షాదీ ముబారక్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కారులోనే కథను నడిపిస్తూ.. అది కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు పద్మశ్రీ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. పెళ్లి చూపులకు అబ్బాయిని తీసుకెళ్లిన అమ్మాయి.. కొన్ని గంటల్లోనే అతడి ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఆ ఇద్దరు ఎలా కలిశారు అని రాసుకున్న స్క్రీన్ ప్లే  చాలా బాగుంది. ఓ వైపు ఎంటర్టైన్మెంట్.. మరోవైపు లవ్ స్టోరీ.. రెండింటినీ పర్ఫెక్ట్ గా బాలెన్స్ చేశాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో రాహుల్ రామకృష్ణ, భద్రం.. సెకండాఫ్ లో హేమంత్ కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సింపుల్ కథను ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మంచి స్క్రీన్ ప్లేతో నడిపించాడు దర్శకుడు పద్మశ్రీ. ఎక్కడ తడబాటు లేకుండా తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు చాలా క్లారిటీతో ఈ సినిమా తీసినట్లు అర్థమవుతుంది. బడ్జెట్ పరిమితులు ఉన్నా కూడా కంటెంట్ తో కవర్ చేశాడు దర్శకుడు. కొన్ని సినిమాలు చూసినప్పుడు అరే భలే తీసార్రా అనిపిస్తుంది. అలాంటి సినిమా షాదీ ముబారక్.. ఖర్చు లేని కథ ఉన్న సినిమా ఇది. నాలుగేళ్ల కింద పెళ్లి చూపులు సినిమా ఎలాంటి ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చిందో.. అలాంటి మ్యాజిక్ షాదీ ముబారక్ లో కనిపించింది. 

 

Tags :