కాంగ్రెస్ అగ్రపీఠం కోసం పోటీలో.. థరూర్ వర్సెస్ గెహ్లాట్?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు శశిథరూర్, అశోక్ గెహ్లాట్ పోటీ పడుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీపై అసహనంతో సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో.. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్టోబర్ 17వ ఈ ఎన్నికలు జరుగుతాయని తెలిసిందే. ఆ ఎన్నికల్లో శశి థరూర్, అశోక్ గెహ్లాట్.. అధ్యక్ష పదవి కోసం పోటీపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబంతో సంబంధం లేని మరో వ్యక్తి చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కూడా ఈ ఎన్నికల బరిలో దిగుతారా? అనే విషయంలో క్లారిటీ లేదు. ఇదిలా వుండగా సోమవారం నాడు సోనియా గాంధీని శశి థరూర్ కలవడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు శశి థరూర్ చెప్పేశారు. గత 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి సోనియా లేదా రాహుల్ చేతుల్లోనే ఉంది. బీజేపీ చేతిలో రెండుసార్లు ఓటమి చవి చూసిన అనంతరం.. పార్టీలో వ్యవస్థీకృత మార్పులు జరగాలని సోనియాకు లేఖ రాసిన జీ23 నేతల్లో శశి కూడా ఒకరు. అలాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి దక్కుతుందా? అనేది ప్రశ్న. అయితే ఈ పదవి కోసం సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆయన మాత్రం రాహుల్ గాంధీనే అధ్యక్షుడు అవ్వాలని కోరుతున్నాడు.
ఈ పార్టీ టాప్ పోస్ట్ కోసం నామినేషన్ల ఫైలింగ్ మరో మూడు రోజుల్లో మొదలవుతుంది. అయితే వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్‌కే మళ్లీ పట్టం కట్టాలని భావిస్తున్నారు. మరి ఈసారి కాంగ్రెస్ పీఠంపై ఎవరు కూర్చుంటారో చూడాలి. కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన చివరి గాంధీ కుటుంబేతర వ్యక్తి సీతారామ్ కేసరి. ఆయన తర్వాత 1998లో సోనియా ఈ పార్టీ పగ్గాలు చేపట్టారు.