ప్రపంచంలోనే ది బెస్ట్ విమానాశ్రయం ఇదే

ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్‌లోని ఛాంగి అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. రెండేళ్ల తర్వాత ఖతార్ ను వెనక్కి నెట్టి మళ్లీ తన స్థానాన్ని తిరిగి సాధించుకుంది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్ విదేశీ విమానాల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధించింది. దీంతో రెండేళ్ల క్రితం ఆ స్థానాన్ని ఖతర్ చేజిక్కించుకుంది. అయితే పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో రాకపోకలపై సింగపూర్ ఆంక్షలు ఎత్తివేసింది. దీంతో మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఖతార్ రాజధాని దోహా లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో నిలవగా టోక్యోలోని హనీదా విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. విమాన ప్రయాణం చేసిన తర్వాత ప్రయాణికులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా స్కైట్రాక్స్ సంస్థ ప్రతి ఏటా సర్వే నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే తొలి 20 ఉత్తమ విమానాశ్రయాలను ఎంపిక చేసి స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్ పేరిట సత్కరిస్తోంది. అయితే ఉత్తమ ఎయిర్‌పోర్టులుగా నిలిచిన వాటిలో తొలి 10 స్థానాల్లో అమెరికాకు చెందిన ఒక్క విమానాశ్రయం కూడా లేకపోవడం గమనార్హం.