లాస్‌ ఏంజిల్స్‌లో ఘనంగా సీతారాముల కళ్యాణం

లాస్‌ ఏంజిల్స్‌లో ఘనంగా సీతారాముల కళ్యాణం

లాస్‌ ఏంజిల్స్‌లో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. లాస్‌ఏంజెసెల్‌ నగరానికి సమీప రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో లాస్‌ఏంజెలెస్‌ నగర వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. సిమీ ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ కల్యాణం భద్రాచల శ్రీరాముల కల్యాణ మహోత్సవాన్ని తలపించేలా జరిగింది. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించి అమెరికాకు తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో మేళతాళాల సాక్షిగా సీతారాముల పెళ్ళి జరిపించారు. ఆడ పడుచుల కోలాటాల మధ్య సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకుంది.

దాదాపు 50 మంది తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాదుకలకు పట్టాభిషేకం నిర్వహించారు. గోవింద, రామ నామ స్మరణతో ఆ ప్రాంగణం అంతా మార్మోగి పోయింది. ఈ కార్యక్రమములో పాల్గొన్న వారంతా సంప్రదాయ దుస్తులు ధరించారు. దాదాపు 700 మందికి పైగా భక్తులు కల్యాణోత్సవంలో భాగమయ్యారు. 70కి పైగా జంటలు సామూహికంగా కళ్యాణంలో పాల్గొన్నాయి. ఈ కల్యాణోత్సవానికి సహాకరించిన ప్రతీ ఒక్క స్వచ్చంధ సంస్థకి నిర్వాహకులు రామ్‌ కొడితాల, నంగినేని చందు, టీ కుమార్‌, ఏ మనోహార్‌లు కృతజ్ఞతలు తెలిపారు. 

హ్యూస్టన్‌లో..

హ్యుస్టన్‌ టెక్సాస్‌లోని స్థానిక శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అష్టలక్ష్మి దేవాలయం, కేటీ హిందూ కమ్యూనిటీ సంయుక్తంగా జరిపిన జరిపిన సీతారాముల కళ్యాణ వేడుకల్లో సుమారు 800 మంది పాల్గొన్నారు. వేదపండితులు సీత రాములకళ్యాణంతో పాటు, పట్టాభిషేకం, మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి  సహకరించిన దాతలు, వలంటీర్లకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు.

 

Tags :