రివ్యూ : కమనీయ ప్రేమకథా చిత్రం 'సీతారామం'

రివ్యూ : కమనీయ ప్రేమకథా చిత్రం 'సీతారామం'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు : వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్
నటీనటులు : దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాగూర్‌, సుమంత్‌, ప్రకాశ్‌ రాజ్‌, భూమిక, రష్మిక,
గౌతమ్‌ మీనన్‌, తరుణ్‌ భాస్కర్‌,సచిన్‌ ఖేడ్కర్‌ తదితరులు
సంగీతం : విశాల్‌ చంద్రశేఖర్‌, సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్ - శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: అశ్వినీదత్‌
దర్శకత్వం: హను రాఘవపూడి
విడుదల తేది:05.08.2022

దుల్కర్‌ సల్మాన్‌ మలయాళ హీరో అయినప్పటికీ తనదైన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు 'మహానటి' తర్వాత ఈ రొమాంటిక్‌ హీరో నేరుగా తెలుగులో నటించిన రెండవ చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి సీత,రామ్‌ల లవ్‌స్టోరీపై అందరికి ఆసక్తి ఏర్పడింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించే చిత్రాలు ఎంత హృద్యంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రేమ కథను తెరకెక్కించడంలో ఆయన శైలి విభిన్నంగా ఉంటుంది. అయన దర్శకత్వం లో వచ్చిన మరో ప్రేమ కథ ‘సీతారామం’. ఇక ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలు మంచి టాక్‌ని సంపాదించుకోవడమే కాకుండా..సినిమాపై అంచనాలు పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడం, అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంటి హీరోలను భాగం చేయడంతో ‘సీతారామం’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ రోజు  శుక్రవారం(ఆగస్ట్‌ 5) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? సీతారామంల లవ్‌ స్టోరీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథ :

‘సీతారామం’ కథంతా  1965, 1985 నేప‌థ్యంలో సాగుతుంది. 1985లో జరుగుతున్నా కూడా దాని గతం మాత్రం 1965 నేపథ్యంలోనే ఉంటుంది. పాకిస్తాన్‌ ఆర్మీ అధికారి(సచిన్‌ ఖేడ్కర్‌) మనవరాలు అఫ్రిన్‌(రష్మిక). లండన్‌లో ఉంటున్న ఆమె తిరిగి వచ్చేసరికి తాతయ్య చనిపోతాడు. ఇంట్లో ఓ ఉత్తరం ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌ రామ్ (దుల్కర్ సల్మాన్). తను ఒక అనాథ...టెర్రరిస్ట్‌లు వేసిన ఓ పథకాన్ని అడ్డుకుని రియల్ హీరో అవుతాడు. రామ్ అనాథ అని.. తెలియడంతో అతనికి దేశం నలు వైపుల నుంచి తామున్నామంటూ ఉత్తరాలు వస్తాయి. ఇందులో సీతా మహాలక్ష్మీ పేరిట కొన్ని ఉత్తరాలు వస్తాయి. రామ్ సీతల ప్రేమ అలా మొదలవుతుంది. అయితే ఈ వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? సీత కోసం రామ్ చివరగా రాసిన ఉత్తరం ఏంటి? ఆ ఉత్తరాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారి తరిఖ్ తన మనవరాలు అఫ్రిన్ కు ఎందుకు ఇస్తాడు?.. దాన్ని సీతా మహాలక్ష్మీ వద్దకు చేర్చే బాధ్యత, అఫ్రిన్ మీదకు ఎందుకు వచ్చింది? ఈ కథలో విష్ణు శర్మ (సుమంత్) పాత్ర ఏంటి? చివరకు రామ్ రాసిన ఉత్తరం సీతకు చేరిందా? ఆ ఉత్తరంలో ఏముంది? అనేది మిగతా కథ.

నటీనటుల హావభావాలు:

లెఫ్ట్‌నెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ ఒదిగిపోయాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు.. ఆ కారెక్టర్‌కు దుల్కర్‌ను ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే అర్థమవుతుంది. రామ్ కారెక్టర్‌లోని నిజాయితీ, దేశభక్తి, ప్రేమ, మంచితనం అన్నీ కలగలిపిన బావాలు అతనిలో కనిపిస్తాయి.  ఈ పాత్రను ఎంతో స్వచ్చంగా పోషించినట్టు అనిపిస్తుంది. తెరపై అందంగా కనిపిస్తూ.. తనదైన మాటతీరు, నటనతో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రకు దుల్కర్‌ ఫర్‌ఫెక్ట్‌ చాయిస్‌ అనేలా నటించాడు.  ఇక సీత పాత్రకు మృణాల్‌ న్యాయం చేసింది. తెరపై బ్యూటిఫుల్‌గా కనిపించింది. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా చక్కగా నటించింది. మత పిచ్చి, పొగరు ఉన్న అమ్మాయి అఫ్రిన్‌గా రష్మిక అదరగొట్టేసింది. క్లైమాక్స్‌లో ఆమె పాత్రకు ఇచ్చిన ముగింపు సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో బాగా పండిన పాత్రల్లో సుమత్‌ది ఒకటి. ఆర్మీ అధికారి విష్ణుశర్మగా సుమంత్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర తొలి నుంచి అనుమానంగానే చూపిస్తూ.. ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచారు. ఆయన భార్యగా భూమిక కనిపిస్తుంది. కానీ ఆమె పాత్రలో అంతగా స్కోప్‌ లేదు. ఇక గోపాల్‌గా తరుణ్‌ భాస్కర్‌తో పాటు ఆర్మీ చీఫ్‌లుగా ప్రకాశ్‌ రాజ్‌, గౌతమ్‌ మీనన్‌ తమ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :

హను రాఘవపూడి సినిమాలు, ఆ ఫ్రేమింగ్, కథ కథనాలు అందరినీ మెప్పిస్తాయి. ఆయన తీసిన ప్రతీ చిత్రం ఓ వర్గాన్ని మాత్రం మెప్పిస్తుంది. పాటలు కూడా అద్భుతంగా అనిపిస్తాయి. వినడానికే కాదు చూడటానికి ఎంతో హృద్యంగా మలిచేస్తాడు. అలాంటి హను రాఘవపూడి నుంచి వచ్చిన 'సీతారామం' కూడా మంచి అనుభూతినిచ్చింది. ఈ సారి స్వచ్చ మైన ప్రేమతో పాటు  దేశ భక్తిని చూపించాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం విశాల్ చంద్రశేఖర్ సంగీతం. అద్భుతమైన పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తనదైన బీజీఎంతో విజువల్స్ స్థాయిని పెంచడమే కాదు.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ పనితీరు అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై అందంగా చూపించాడు. కశ్మీర్‌ అందాలను అద్భుతంగా చూపించాడు. అద్భుతమైన విజువల్స్‌ని అందించి ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేశాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ పర్వాలేదు. వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలు భారీగా వున్నాయి.

విశ్లేషణ:

పాకిస్తాన్‌ తీవ్రవాదులు కశ్మీర్‌లో ఎలా విధ్వంసం సృష్టిస్తున్నారు అనే పాయింట్‌తో కథ మొదలవుతుంది. అయితే ఇది ప్రేమ కథా చిత్రమని మేకర్స్‌ మొదటి నుంచి ప్రచారం చేయడంతో ప్రేక్షకుల ఆసక్తి అంతా రామ్‌, సీతల లవ్‌ స్టోరీపైనే ఉంటుంది. ఎప్పుడైతే రామ్‌కి సీత ఉత్తరాలు రాయడం మొదలు పెడుతుందో అ‍ప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది.  యుద్దంతో రాసిన ప్రేమ కథ అంటూనే ఈ సినిమాపై అందరి దృష్టి పడేలా చేసారు. ఏంటా? యుద్దం.. ఎవరు ఎవరితో చేశారు.. ఎందుకు చేశారు.. చివరకు గెలిచారా? లేదా? అనే ఆసక్తిని రేకెత్తించేలా కథనాన్ని నడిపించాడు. చివరి వరకు కూడా సీతారాములకు ఏం జరుగుతుంది? అనేది రివీల్ చేయకుండా చూపించాడు. అసలు సీత సీతే కాదని చూస్తున్న ప్రేక్షకుడి ఇంటర్వెల్‌లో ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్‌కు థియేటర్లో అందరూ చప్పట్లు కొట్టేస్తారు. అలాగే అఫ్రిన్‌ పాత్ర ఇచ్చిన ముగింపు కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని ప్రతి పాత్రని ఫర్‌ఫెక్ట్‌గా వాడుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్‌ కొంత స్లోగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం  ఎమోషనల్‌గా నడిపించి సరికొత్త ప్రేమ కథను చూపించాడు. ఎలాంటి అశ్లీలత లేకుండా ఓ స్వచ్ఛమైన ప్రేమకథ చిత్రం.

 

Tags :
ii). Please add in the header part of the home page.