హైదరాబాద్ లో 250 కోట్ల పెట్టుబడితో అమెరికా కంపెనీ

తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ పెట్టుబడులకు నిలయంగా మారింది. హైదరాబాద్ నగరంలో ఏరోస్పేస్ రంగానికి మరింత జోష్‌నిస్తూ హెలికాప్టర్ గేర్లు, గేర్‌బాక్సుల తయారీ కేంద్రం రానున్నది. రూ.250 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను స్కంద ఏరోస్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఏటీపీఎల్) ఏర్పాటు చేస్తున్నది. రఘు వంశీ మెషీన్ టూల్స్, అమెరికాకు చెందిన రేవ్ గేర్స్ జాయింట్ వెంచరే ఈ ఎస్‌ఏటీపీఎల్. ఇందులో మెజారిటీ వాటా (55శాతం) రేవ్ గేర్స్‌కు ఉండగా, మిగతా వాటా (45 శాతం) రఘు వంశీదే. వచ్చే 3-5 ఏండ్లలో వెయ్యి మందికి ఉద్యోగవకాశాలు రానున్నాయి. అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా నడుస్తున్న రేవ్ గేర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్ ఇండస్ట్రీలకు డిజైనర్, మాన్యుఫ్యాక్చరర్, గేర్ల సిస్టమ్ ఇంటిగ్రేటర్‌గా సేవలందిస్తున్నది. బోయింగ్, రోల్స్ రాయిస్, బెల్, కొల్లిన్స్, బీఏఈ సిస్టమ్స్, మెక్‌లారన్, నాస్కర్ తదితర సంస్థలు రేవ్ గేర్స్ కస్టమర్లే. ఇక రఘు వంశీ మెషీన్ టూల్స్ కూడా బోయింగ్, బీఏ ఏవియేషన్, ఈటన్, హనీవెల్ తదితర సంస్థలకు కీలక విడిభాగాల సరఫరాదారుగా ఉన్నది.