సప్తపర్ణిలో సప్తగిరీశ్వరుని కీర్తనలతో అలరించిన శోభారాజు గానామృతం

సప్తపర్ణిలో సప్తగిరీశ్వరుని కీర్తనలతో  అలరించిన శోభారాజు గానామృతం

“ శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః “ అని ఆర్యోక్తి. పెద్దలే కాదు పిల్లలు, చివరికి సర్పాలు కూడా ఆ గాన మాధుర్యానికి పరవశం చెందుతాయి. మరి అలాంటి గాన మాధుర్యానికి భక్తి, ఆధ్యాత్మికత తోడైతే.. ? అది అలౌకికానంద గాన ప్రవాహమే. “అన్నమాచార్య భావనా వాహిని “ వ్యవస్థాపకురాలు, తి.తి.దే. ఆస్థాన విద్వాంసురాలు, “అన్నమయ్య పద కోకిల “పద్మశ్రీ డాక్టర్ శోభారాజు ఆలపించిన భక్తి గీతాలకు ఈనాడు “రాగా “ వేదికగా నిలిచింది. మెడికోవర్ హాస్పిటల్స్ వారు ఈరోజు అనగా అక్టోబర్ తొమ్మిదవ తేదీ శనివారం నాడు నిర్వహించిన "రాగా” అను కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు పాల్గొని తాను స్వరపరచిన అనేక అద్భుతములైన అన్నమాచార్య కీర్తనలనూ, స్వీయ రచనలనూ గానం చేసి శ్రోతలను ఆనంద పరవశులను చేశారు . “శ్రీ నందకాయ “ అన్న అన్నమ గాయత్రి ప్రార్థనతో ప్రారంభించి స్వీయ రచన, సంగీత దర్శకత్వం వహించిన “గణరాజా, గుణరాజా” అన్న విఘ్నేశ్వర స్తుతినీ ఆలపించి భక్తులను భక్తి భావ ప్రవాహంలో ఓలలాడించారు.

అనంతరం “సిరుత నవ్వులవాడు, చాలదా హరినామ సౌఖ్యామృతము, ఎంత అందగాడవురా, కొండలలో నెలకొన్న, అదివో అల్లదివో, వేడుకొందామా , ఏడుకొండల వాడా “ మొదలగు కీర్తనలను ఆలపించి కార్యక్రమాన్ని భక్తి భావ రాగ రంజితం చేశారు. “ అన్నమాచార్య భావనా వాహిని “ సంస్థను స్థాపించి, భక్తి సంగీతం ద్వారా సమాజంలో తీవ్రంగా వేళ్లూనుకొని ఉన్న భావ కాలుష్యాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ సమాజాన్ని ప్రక్షాళితం చేస్తూ, “పరోపకారార్థమిదం శరీరం” అన్న సూక్తికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్న శ్రీమతి శోభారాజు గారు ’సంకీర్తనౌషధం పేరుతో జబ్బులతో బాధపడుతున్న వారిని సంకీర్తనాలాపన ద్వారా ఉపశమనం కలిగించి, సంగీతంతో రోగాలను నయం చేయవచ్చునని ప్రయోగాత్మకంగా నిరూపించిన మానవతామూర్తి. వారు ఆలపించిన కీర్తనల ద్వారా ఈరోజు కార్యక్రమం భక్తి భావ భరితం అయి, శ్రోతలు ఆనంద పరవశులు అయ్యారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తబలా పైన జయకుమారాచార్య, కీ బోర్డ్ పైన గురు ప్రసాద్ వాద్య సహకారం అందించగా,అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థినులు కుమారి సాహితి మరియు గాయత్రి సింధుజ గాత్ర సహకారం అందించారు.

 

Tags :