ప్రవాసాంధ్రులతో సోము వీర్రాజు వీడియో కాన్ఫరెన్స్

ప్రవాసాంధ్రులతో సోము వీర్రాజు వీడియో కాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలునిచ్చారు. ఇందుకు సుముఖత వ్యక్తం చేసిన ప్రవాసాంధ్రులు క్రమం తప్పకుండా నెలకోసారి వీడియో సమావేశాలు నిర్వహించాలని వీర్రాజును కోరారు. ఇదే సమయంలో ఒకసారి అమెరికా వచ్చి ప్రవాసాంధ్రులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని సూచించారు. అజాదీ అమృత మహోత్సవాల్లో భాగంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులతో సోము వీర్రాజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులు, బీజేపీ నిర్వహిస్తున్న పాత్రను సోము వీర్రాజు వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణకు బీజేపీ చేస్తున్న ఉద్యమాలు, ధర్మ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అజాదీ కా అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్న తీరును వారి దృష్టికి తీసుకెళ్లారు. రానున్న రోజుల్లో తరుచుగా వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులతో వీడియో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా వీర్రాజు వారికి హామీ ఇచ్చారు.

 

Tags :