మరోసారి కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్! ప్రహసనంగా మారిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..!!

మరోసారి కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్! ప్రహసనంగా మారిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..!!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. తుది సమరంలో మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ మిగిలారు. ఈనెల 17వ తేదీన ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారో ఇప్పటికే దాదాపు ఒక ఐడియా వచ్చేసింది. గాంధీ కుటుంబం మద్దతు ఎవరికైతే ఉంటుందో వాళ్లు ఈ ఎన్నికలో గెలవడం ఖాయం. మిగిలిన వాళ్లు ఓడిపోవడం కామన్. గాంధీ ఫ్యామిలీ ఎవరికి మద్దతు ఇస్తోందో దేశవ్యాప్తంగా పీసీసీ నేతలందరికీ ఇప్పటికే తెలిసిపోయింది. పైకి ప్రజాస్వామ్యంగా కనిపించే ఎన్నికే కానీ.. తెరవెనుక మాత్రం ఇదొక ప్రహసనం మాత్రమే.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా మాట్లాడేస్తుంటారు. రాష్ట్రాల్లో అయితే నేతల మధ్య సఖ్యత చాలా తక్కువ ఉంటుంది. కానీ నేతలందరూ అధిష్టానానికి విధేయులే. సోనియా, రాహుల్ మాట కాదనే వాళ్లు ఎవరూ ఉండరు. వాళ్లను వ్యతిరేకించిన జీ23 నేతలు వేరుకుంపటి పెట్టుకునేంత వరకూ వెళ్లారు. కానీ వాళ్లకు మిగిలిన కాంగ్రెస్ నేతలు సహకరించకపోవడంతో వాళ్ల పప్పులుడకలేదు. దీంతో అధిష్టానంతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంతకు మించి వాళ్లు చేయడానికి కూడా ఏం లేదు.

ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చాలాకాలం తర్వాత ఎన్నిక జరుగుతోంది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుందని.. దేశంలోని పీసీసీ ప్రతినిధుల్లో ఎవరైనా ఈ పదవికి పోటీ చేయవచ్చని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అందుకు తగ్గట్టే ఎన్నికల అజెండా రూపొందించారు. సోనియా, రాహుల్ పోటీలో నిలబడట్లేదని తొలినుంచీ చెప్తూ వచ్చారు. దీంతో ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అనేక తర్జనభర్జనల అనంతరం కొందరు నేతలు ముందుకొచ్చారు. కొందరు మధ్యలోనే చేతులెత్తేశారు. గాంధీ ఫ్యామిలీ బరిలోకి దిగట్లేదు కాబట్టి తాను పోటీ చేస్తానన్నారు శశిథరూర్. ఆయన పోటీని కాంగ్రెస్ నేతలు స్వాగతించారు.

ఇక చివర్లో అశోక్ గెహ్లాట్ తప్పుకోవడంతో మల్లికార్జున ఖర్గేను తెరమీదకు తెచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. పోటీ చేయవలసిందిగా సోనియా, రాహుల్ కోరడంతో ఆయన నామినేషన్ వేశారు. మల్లికార్జున ఖర్గేకు గాంధీ ఫ్యామిలీ మద్దతు ఉందని తెలియగానే కాంగ్రెస్ నేతలందరూ జై ఖర్గే అనడం మొదలు పెట్టారు. శశి థరూర్ ను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. శశి థరూర్ హైదరాబాద్ కు వచ్చి కాంగ్రెస్ లీడర్లను కలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన్ను కలిసేందుకు ఒక్క నేత కూడా ముందుకు రాలేదు. ఇదీ కాంగ్రెస్ లో అధ్యక్ష ఎన్నిక తీరు.

కాంగ్రెస్ లో గాంధీ ఫ్యామిలీయే సుప్రీం. వాళ్ల చేతుల్లో అధ్యక్ష పదవి ఉన్నా.. లేకపోయినా.. చక్రం తిప్పేది వాళ్లే. వాళ్ల మద్దతు ఉంటేనే కాంగ్రెస్ నేతలు సహకరిస్తారు. లేకుంటే పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పుడు మరోసారి ఇదే రుజువైంది. ప్రజాస్వామ్యం లేదు.. ఏమీ లేదు.. అంతా ప్రహసనమే.! ఖర్గేకు అధిష్టానం అండదండలు ఉన్నాయి కాబట్టి అయిష్టంగానైనా నేతలందరూ ఆయనకు జైకొట్టడం ఖాయం. ఆయన ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయం. జరిగేది ఇదే.. జరగబోయేది ఇదే..!

 

 

Tags :
ii). Please add in the header part of the home page.