జనసేనలోకి ఆలీ..! నిజమేనా...?

జనసేనలోకి ఆలీ..! నిజమేనా...?

కమెడియన్ గా సుపరిచితుడైన ఆలీ రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్నారు. 2014 ఎన్నికల్లోనే సీటు ఆశించారు. అయితే 2019 వరకూ టీడీపీలో ఉన్నా ఆలీకి చట్టసభల్లో అడుగు పెట్టే అదృష్టం దక్కలేదు. దీంతో 2019లో ఆలీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీలో చేరడంతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ అవకాశం దక్కలేదు. దీంతో ఏదైనా నామినేటెడ్ పోస్టుతో ఆలీని గౌరవిస్తారని అందరూ భావించారు.

ఎలాంటి షరుతులు లేకుండా ఆలీ వైసీపీలో చేరారు. టీడీపీ నుంచి రావడంతో వైసీపీ అధినేత జగన్ కూడా ఆలీని అక్కున చేర్చుకున్నారు. వైసీపీలో ఆలీకి దక్కిన ట్రీట్ మెంట్ చూసి ఆయనకు తప్పకుండా ఏదో ఒక కీలక పదవి దక్కడం ఖాయమని అందరూ ఊహించారు. గత రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆలీని పెద్దల సభకు పంపిస్తున్నారనే టాక్ బలంగా నడిచింది. అయితే ఆ ఛాన్స్ మిస్ అయింది. దీంతో ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఆలీ పేరు పలంగా వినిపించింది. అయితే అప్పుడు కూడా జగన్ పట్టించుకోలేదు. దీంతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి పదవులను ఆలీకీ కట్టబెడతారనే టాక్ నడిచింది. అయితే ఇలాంటి పదవులపై ఆలీకి పెద్దగా ఆసక్తి లేనట్టు సమాచారం.

టీడీపీ లాగే.. వైసీపీ కూడా తనను పట్టించుకునేలా లేదనే ఫీలింగ్ లో ఆలీ ఉన్నట్టు సమాచారం. అందుకే ఈసారి తనకు ఇష్టమైన హీరో - పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటే బెటర్ అనే ఉద్దేశంతో ఆలీ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేనలో చేరితే తప్పకుండా తనకు ఎమ్మెల్యే సీటు దక్కుతుందని నమ్ముతున్నారు. పోటీ పడే వారి సంఖ్య తక్కువగా ఉండడం, తనకు బాగా ఇష్టమైన వ్యక్తి కావడం.. గోదావరి జిల్లాల్లో జనసేనకు మంచి పట్టు ఉండడం.. లాంటి అనేక అంశాలు తనకు కచ్చితంగా కలిసొస్తాయనే భరోసా ఆలీలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈసారి టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే రాజమండ్రిలో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ఆలీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. రాజమండ్రి ఆలీ సొంతూరు. అక్కడ టీడీపీ, జనసేనలకు మంచి పట్టుంది. రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే తన విజయం ఖాయమని ఆలీ నమ్ముతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి టీడీపీ, వైసీపీల నుంచి కాకుండా జనసేనే సేఫ్ అనే ఫీలింగ్ లో ఉన్నారని సమాచారం. అయితే ఆలీ వైసీపీ నుంచి బయటకు వస్తారా.. లేదా అనేదానిపై ఇంకా సమాచారం లేదు. ఇప్పటికైతే ఇవన్నీ ఊహాగానాలే. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే.. మరి చూద్దాం ఆలీ చేస్తారో..!

 

Tags :
ii). Please add in the header part of the home page.