నారా లోకేశ్, పవన్ కల్యాణ్ యాత్రలు ఎందుకు వాయిదా పడ్డాయ్..?

నారా లోకేశ్, పవన్ కల్యాణ్ యాత్రలు ఎందుకు వాయిదా పడ్డాయ్..?

ఎన్నికలు దగ్గర పడుతున్నాయ్.. ఎవరి ప్లాన్లలో వాళ్లున్నారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నాయంటే అన్ని పార్టీలకూ గుర్తుకొచ్చేది పాదయాత్ర. పాదయాత్ర చేయడం ద్వారా ప్రజలకు చేరువ కావచ్చని.. వారి మనసులు గెలుచుకోవచ్చని పార్టీ అధ్యక్షులు భావిస్తుంటారు. అందుకే ఎన్నికల ముందు ఇలాంటి పాదయాత్రలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తోంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, జగన్, షర్మిల.. తదితరులు పాదయాత్రల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు ఇదే ప్లాన్లో ఉన్నారు పవన్ కల్యాణ్, నారా లోకేశ్. ఇప్పటికీ వీళ్లిద్దరూ పాదయాత్రలు చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ పాదయాత్రలను వాయిదా వేస్తున్నామనేది లేటెస్ట్ న్యూస్. మరి పాదయాత్రల వాయిదా వెనుక రీజనేంటి?

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోండి టీడీపీ. వైసీపీ పాలనలో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ దూకుడుగా ముందుకెళ్తుంటే.. టీడీపీ అసహాయస్థితిలోకి వెళ్లిపోతోంది. అందుకే ఈసారి తాడోపేడో తేల్చుకోవాలనుకుంటోంది. అందుకోసం పాదయాత్రతో రంగంలోకి దిగబోతున్నారు లోకేశ్. వాస్తవానికి అక్టోబర్ నుంచి పాదయాత్ర చేయాలనుకున్నారు లోకేశ్. చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకూ 450 రోజులపాటు విరామం లేకుండా పాదయాత్ర చేపట్టాలని లోకేశ్ భావించారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావించారు. అక్టోబర్ నుంచి బస్సు యాత్రలు ప్రారంభించి ఎన్నికలయ్యే వరకూ పూర్తిగా ప్రజల్లోనే ఉండాలనుకున్నారు. విజయదశమి నుంచి ఈ యాత్రలు చేపట్టాలనుకున్నారు. వైసీపీని అధికారం నుంచి దించడమే తమ ఏకైక ఉద్దేశమంటున్నారు పవన్ కల్యాణ్. జగన్ ను ఓడించేందుకు ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్తామంటున్నారు.

అయితే ఇప్పుడు వీళ్లద్దరి యాత్రలూ పోస్ట్ పోన్ అయ్యాయి. వచ్చే ఏడాదిలోనే యాత్రలు చేపట్టే అవకాశం ఉందని ఆయా పార్టీ వర్గాలు చెప్తున్నమాట. వీళ్లద్దరూ యాత్రలు వాయిదా వేసుకోవడానికి ఒకే కారణం కనిపిస్తోంది. గతంలో వైసీపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే వార్తలు వినిపించాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు వెళ్తే ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంటుందని భావించి ఒక ఏడాది ముందుగానే ఎన్నికలకు జగన్ వెళ్తారని భావించారు. అయితే ఇప్పుడు అలాంటి ఆలోచనలేవీ లేవని వైసీపీ కుండబద్దలు కొట్టింది. దీంతో లోకేశ్, పవన్ కల్యాణ్ తమ యాత్రలు పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి 2024 సంక్రాంతి వరకూ పాదయాత్ర చేయాలని తాజాగా నిర్ణయించుకున్నారు నారా లోకేశ్. ముందుస్తు ఎన్నికలు లేవు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024 ఏప్రిల్ లేదా మే నెలల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేంత వరకూ పాదయాత్ర చేయడం ద్వారా జనంలో ఉండేందుకు అవకాశం ఉంటుందనుకుంటున్నారు లోకేశ్.

మరోవైపు పవన్ కల్యాణ్ ది కూడా ఇదే ఆలోచన. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత బస్సు యాత్రలు మొదలు పెట్టి ఏడాది చివరి వరకూ చేయాలనుకుంటున్నారు. ఈలోపు తాను ఇప్పటికే కమిట్ అయిన పలు సినిమాలను కంప్లీట్ చేయాలనుకంటున్నారు. అవి పూర్తయిపోతే ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేయవచ్చనుకుంటున్నారు పవన్ కల్యాణ్.

 

-

Tags :