లక్ష్మీ పార్వతి, కొడాలి నాని, వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారా?

లక్ష్మీ పార్వతి, కొడాలి నాని, వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారా?

వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు ఇదొక పెద్ద సవాల్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ వై.ఎస్.జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది వివాదానికి దారి తీస్తోంది. ఎన్టీఆర్ పేరు మార్చడం సబబు కాదంటూ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. కానీ వైసీపీ నేతలు మాత్రం హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ కంటే వైఎస్సారే కరెక్ట్ అని వాదిస్తున్నారు. ఎన్టీఆర్ కు అనుకూలంగా టీడీపీ, వ్యతిరేకంగా వైసీపీ పార్టీల వాళ్లు మాట్లాడడం మామూలే. అయితే వైసీపీలోనే ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం.

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఎన్టీఆర్ అనే అంశం తెరపైకి వచ్చే ప్రతిసారి లక్ష్మీ పార్వతి మీడియా ముందుకొచ్చి వాదిస్తుంటారు. ఇప్పుడు అదే ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టిన సమయంలో లక్ష్మీ పార్వతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కలిగంచే అంశం. ఒకవేళ పేరు మార్పుపై పార్టీ నిర్ణయం కరెక్టే అని లక్ష్మీ పార్వతి భావిస్తే అదే విషయాన్ని ఆమె బహిరంగంగా ప్రకటిస్తే బాగుంటుంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్న నిజమైన కార్యకర్త అని అందరూ భావిస్తారు. అలా కాకుండా దేశలోనే తొలిసారి ఎన్టీఆర్ స్థాపించిన యూనివర్సిటీకి ఆయన పేరు ఉంచడమే కరెక్ట్ అని లక్ష్మీపార్వతి అనుకుంటే ఆమె పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. మరి లక్ష్మీ పార్వతి ఏం చేస్తారు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా.. లేకుంటే వ్యతిరేకిస్తారా.. వైసీపీలో ఉన్న మిగిలిన నేతల సంగతి వేరు.. లక్ష్మీపార్వతి సంగతి వేరు. ఎన్టీఆర్ సతీమణిగా ఆమె దీనిపై తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది.

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వై.ఎస్.ఆర్. పేరు పెడ్తున్న విషయం తెలియగానే అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. పేరు మార్చడం సబబు కాదని ఆయన ప్రకటించారు. దీనిపై ఆయనకు ఒక స్పష్టత ఉంది. పార్టీ కంటే తాను నమ్మిన సిద్ధాంతమే గొప్పదని ఆయన భావించారు. పదవిని తృణప్రాయంగా త్యజించారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి కూడా ఇదే పని చేస్తారా.. అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే లక్ష్మిపార్వతి మౌనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని పదేపదే విమర్శించే లక్ష్మీపార్వతి.. ఇప్పుడు సొంతపార్టీనే ఆయన పేరు మార్చి వై.ఎస్.ఆర్. పేరు పెడ్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు వైసీపీలో ఉన్నా తమ ఆత్మ నిండా ఎన్టీఆరే ఉన్నారని చెప్తుంటారు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఎన్టీఆర్ కు నిజమైన అభిమానులమని ప్రకటిస్తుంటారు. ఇప్పుడు అదే ఎన్టీఆర్ కు అవమానం జరుగుతుంటే వీళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్న తలెత్తుతోంది. కొడాలినాని ఈ అంశంపై నోరు మెదపలేదు. వల్లభనేని వంశీ మాత్రం పేరు మార్చడం సరికాదని అభిప్రాయపడ్డట్లు వార్తలొచ్చాయి. కానీ ఇది సరిపోదు. నిజంగా వాళ్లు ఎన్టీఆర్ అభిమానులైతే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన  అవసరం ఉందనేది ఎన్టీఆర్ అభిమానుల డిమాండ్. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుండే అర్హత లేదని వైసీపీ నేతలు వాదిస్తుంటే ఎందుకు వీళ్లిద్దరూ మౌనంగా ఉన్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి వీళ్లు ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది.

 

Tags :