పాపం రేవంత్..! మితిమీరిన స్వేచ్ఛ తెలంగాణ కాంగ్రెస్ కొంప ముంచుతోందా?

పాపం రేవంత్..! మితిమీరిన స్వేచ్ఛ తెలంగాణ కాంగ్రెస్ కొంప ముంచుతోందా?

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏ పార్టీలో లేనంత ఫ్రీడం ఆ పార్టీ నేతలకు ఉంటుంది. అయితే ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ లో ఈ ఫ్రీడం మరీ ఎక్కువయినట్లుంది. అందుకే ఎవరికి వారే.. యమునా తీరే.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బిహేవ్ చేస్తున్నారు. దీంతో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా ప్రజల్లో కాస్త కృతజ్ఞత ఉన్నా.. లీడర్ల వల్ల అది కూడా పోతోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా సొంత పార్టీ నేతలే వెనక్కు లాగుతున్నారు.

తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీదే ప్రతిపక్ష స్థానం. టీఆర్ఎస్ ను గత ఎన్నికల్లో ఎదుర్కొని ప్రతిపక్ష స్థానం దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకోవడం కష్టమేననే భావన సర్వత్రా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలే ఇందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని పార్టీ తలపెట్టినప్పుడు విభేదాలను పక్కనపెట్టి అందులో పాల్గొనాల్సిన బాధ్యత ఆ పార్టీ లీడర్లపై ఉంటుంది. తమలో తమకు ఎన్ని విభేదాలున్నా పార్టీని బతికించాలనుకున్నప్పుడు అవన్నీ పక్కన పెట్టాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎవరూ ఎవరి మాటా వినే పరిస్థితి లేదు.

సెప్టెంబర్ 17ను ఈసారి తెలంగాణలో అన్ని పార్టీలూ ఘనంగా నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజును అన్ని పార్టీల కంటే ఘనంగా నిర్వహించాలని భావించింది. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇందుకోసం భారీ ప్రణాళికలే వేశారు. సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు. సెప్టెంబర్ 17న ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. కానీ సీనియర్లు మాత్రం దీనికి అడ్డుపుల్ల వేశారు. పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలోనే ఈ విగ్రహానికి ఆమోద ముద్ర పడింది. అయినా ఇప్పుడు సీనియర్లు దీన్ని అడ్డుకున్నారు. విగ్రహం భరతమాత విగ్రహంలా ఉండాలని.. అందులో జెండా ఉండాలో వద్దో ఆలోచించాలని సూచించారు. సీనియర్ నేతలంతా తలోమాటా చెప్పడంతో ఈ ప్రోగ్రామ్ వాయిదా పడింది. రేవంత్ రెడ్డి ఉత్సాహం నీరుగారిపోయింది.

రేవంత్ రెడ్డి సారథ్యాన్ని తొలి నుంచి ఆ పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కానీ రేవంత్ కు మాత్రం అధిష్టానం అండదండలు ఉన్నాయి. రేవంత్ మినహా మిగతా నేతలు ఎవరికి బాధ్యతలు ఇచ్చినా సీనియర్ నేతలు ఇలాగే వ్యవహరిస్తారనేది అధిష్టానం ఆలోచన. అందుకే టీఆర్ఎస్, బీజేపీలపై దూకుడుగా వెళ్లగలిగే సత్తా రేవంత్ రెడ్డికి ఉందని భావించి.. సీనియర్లు ఎన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నా ఆయన్నే పీసీసీ చీఫ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. రేవంత్ కూడా సీనియర్లు ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నా వాటిని పట్టించుకోకుండా అధిష్టానం ఆదేశాలను అమలు చేసేందుకే సమయం కేటాయిస్తున్నారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు మునుగోడు ఉపఎన్నిక రూపంలో అతి పెద్ద బాధ్యత ఉంది. వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఈ సీటుకు, పార్టీకి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. దీన్ని ఓర్చుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి.. ఎలాగైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని సత్తా చాటాలనుకుంటున్నారు. ఇందుకు సీనియర్లను కలుపుకుని పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ మొహమే చూసేది లేదని తేల్చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతున్నా, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖాతరు చేయడం లేదంటే ఆ పార్టీలో ఫ్రీడమ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

 

 

Tags :