నయనానందకరం యాదాద్రి క్షేత్రం

నాడు యాదగిరి గుట్ట పేరుతో గుట్ట మీద వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నేడు ప్రపంచంలో అద్భుతమైన క్షేత్రంగా, పర్యాటకులకు కనువిందు చేసే ప్రాంతంగా, శిల్పకళాసౌందర్య ప్రదేశంగా పేరు గాంచింది. ఈ క్షేత్రానికి ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం వెనుక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేసిన కృషి ఎంతో ఉంది. యాదగిరి గుట్టను దేశంలోనే ప్రముఖ దివ్యక్షేత్రంగా చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భవిష్యత్తు తరాలు కూడా ఆలయాన్ని చూసి అబ్బురపడేలా నిర్మాణాలు ఉండాలన్న ఉద్దేశ్యంతో స్వయంగా నిర్మాణ పనులను పర్యవేక్షించారు. దీంతో నేడు యాదాద్రి పంచ నారసింహ క్షేత్రం సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం జరుపుకుని నేడు వేలాదిమందిని ఆకర్షిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో...
దైవకార్యాలు సమర్థంగా పూర్తి కావాలంటే భగవంతుడి దయ ఉండాలి. ఇలాంటి బృహత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో నాకు సంపూర్ణ అండ దొరికింది. పునర్నిర్మాణ పనుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేవారు. అద్భుతమైన సహకారాన్ని అందించారు. అందుకే, ఇంత పెద్ద ఆలయ నిర్మాణం చేపట్టినా, నాకు ఎలాంటి సవాళ్లూ ఎదురుకాలేదు. ఆ భగవంతుడి ఆశీస్సులు, ముఖ్యమంత్రి సహకారంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం విజయవంతంగా పూర్తయింది.
పక్కా ప్రణాళిక
ఆలయం పునర్నిర్మాణ ప్రణాళిక రూప కల్పనకే ఏడాది సమయం తీసుకున్నాం. ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం ఆలయ నిర్మాణం ఉండాలని, నిష్ణాతులైన స్థపతులను సంప్రదించాం. నిపుణులైన ఇంజినీర్ల సహకారం తీసుకున్నాం. కళా దర్శకులు ప్రత్యేక సాయం అందించారు. గుట్ట సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, అన్ని జాగ్రత్తలతో.. ప్రణాళిక రూపొందించాం. దానిని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు, నాటి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్‌కు చూపించాం. వారి అనుమతితో పనులను మొదలుపెట్టాం.
కృష్ణ శిలలతో నిర్మితమైన దివ్యధామంగా.. దేశంలోనే పేరెన్నికగన్న ప్రఖ్యాత ఆలయాల చెంత యాదాద్రి పేరు నేడు వినిపిస్తున్నందటే దాని వెనుక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి. కిషన్‌రావు చేసిన కృషే కారణమని చెప్పవచ్చు. యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా ఉంటూ, ముఖ్యమంత్రి మనో సంకల్పాన్ని వాస్తవంలోకి తీసుకొచ్చిన కార్యదీక్షాపరుడు ఆయన. ఈ క్షేత్రం పునర్నిర్మాణ విశేషాలను ఆయన ‘తెలుగు టైమ్స్’కు వివరించారు.
పూర్వం నుంచే యాదాద్రి సుప్రసిద్ధ క్షేత్రం. వేలాదిమంది భక్తులు తరలివచ్చేవారు. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తీవ్ర నిరాదరణకు గురైంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందునుంచే యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్నది కేసీఆర్ సంకల్పం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడంతో ఆలయాభివృద్ధి సంకల్పం కార్యరూపం దాల్చింది. ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకరంగ కోణంలోనూ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ ఆవశ్యకత ఉంది. అందుకే, ముఖ్యమంత్రి ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని దీక్షలా భావించి, యాదాద్రి క్షేత్రాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. తన ఆలోచనలు కార్యరూపం దాల్చేలా మమ్మల్ని ముందుండి నడిపించారని ఆయన అంటారు.
వెయ్యేళ్లు నిలిచేలా.. కృష్ణశిలతో!
యాదాద్రి ఆలయం వెయ్యేండ్ల వరకూ పటిష్ఠంగా నిలవాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. ఆ స్థాయి నాణ్యత కోసమే కృష్ణశిలలను ఉపయోగించి, సంప్రదాయ పద్దతులతో ఆలయ నిర్మాణం చేపట్టాం. ఇలాంటి బృహత్తర ఆలయ నిర్మాణానికి ఇరవై ఏండ్లకు పైగా సమయం పడుతుంది. కానీ, ముఖ్యమంత్రి పట్టుదలతోపాటు వారు అందించిన ప్రోత్సాహంతో అత్యంత వేగంగా పనులు పూర్తి చేశాం. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన సర్వాధికారాలనూ ముఖ్యమంత్రి నా దగ్గరే ఉంచారు. దీంతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులతోపాటు మేం సాయం కోరిన ప్రతి ఒక్కరూ సరైన తోడ్పాటు అందించారు.
యంత్ర నరసింహా..
యాదాద్రి నరసింహస్వామి సన్నిధి అనంతశక్తికి కేంద్రబిందువు. ఆ శక్తిని క్రమబద్దీకరిస్తూ పూర్వం ఋషులు మూలమూర్తి పాదాల చెంత యంత్రం ప్రతిష్ఠించారని స్థలపురాణం. దండకారణ్యంలోని మునులంతా యాదాద్రికి తరలి వచ్చి, తమ తపశ్శక్తినంతా యంత్ర రూపంలో నిక్షిప్తం చేసి ఇక్కడ స్థాపించారట. మళ్లీ 300 సంవత్సరాల కిందట వానమామలై పీఠాధిపతి తీర్థయాత్రలు సాగిస్తూ యాదాద్రికి వచ్చారు. ఆయన హయాంలోనే స్వామివారి కరా క్రమబద్దీకరణ జరిగింది. 150 ఏండ్ల కిందట బెల్లంకొండ స్వామివారు యాదాద్రిలో కఠోర తపస్సు చేశారట. ఆ తపశ్శక్తినంతా ధారపోసి ఆలయంలో మరో యంత్రాన్ని నెలకొల్పారు. ఈ యంత్రాన్ని స్వామివారి సన్నిధిలో నేటికీ చూడొచ్చని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఇలాంటి చరిత్ర ఉన్న ఆలయాన్ని నేడు స్వరాంగసుందరంగా తయారు చేశామని కిషన్ రావు పేర్కొన్నారు.
ఆలయ నిర్మాణమంతా..
రెండు సీజన్లలో భారీ వర్షాలు పడినప్పటికీ, కొత్తగా జోడిరచిన కొండ ఏమాత్రం చెక్కుచెదరలేదు. భారీ వాహనాలు, క్రేన్లు వంటి వాటితో కూడా పరీక్షలు జరిపినా ఎలాంటి సమస్యలూ తలెత్తకపోవడంతో, కొన్ని వందల ఏళ్ల వరకు కొండ మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు తేల్చారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సీఎం కేసీఆర్ దాదాపు 2,400 డ్రాయింగ్లను పరిశీలించి, ప్రస్తుత రూపాన్ని ఆమోదించారు. మొత్తం ఆలయ నిర్మాణమంతా యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) ఆధ్వర్యంలో జరిగింది.
125 కిలోల బంగారంతో..
యాదాద్రి ప్రధాన ఆలయానికి సప్తగోపురాలను సర్వాంగ సుందరంగా మలచారు. ద్వితీయ ప్రాకారంలో నాలుగు దిక్కులా నాలుగు గోపురాలను, మూడు పంచతల గోపురాలను, ఒక సప్తతల మహారాజ గోపురాన్ని నిర్మించారు. పశ్చిమదిశలో మహారాజ గోపురాన్ని 85 అడుగుల ఎత్తున, ఒక్కో పంచతల గోపురాన్నీ 57 అడుగుల ఎత్తున, తూర్పు గోపురం నుంచి ముఖమండపానికి వెళ్లే దారిలో 30.8 అడుగుల ఎత్తున త్రితల గోపురాన్ని, గర్భాలయంపైన విమాన గోపురాన్ని నిర్మించారు. విమానగోపురానికి భక్తుల విరాళాలతో 125 కిలోల బంగారు తాపడం చేయిస్తున్నారు.
గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు పశ్చిమ గోపురం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. సరిగ్గా గర్భాలయంపైన విమాన గోపురం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి, గండభేరుండ నారసింహుడు దర్శనమిస్తారు. గర్భాలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం, గరుత్మంతుని విగ్రహం, స్వామివారి ఎదుట భారీ దర్పణం, గర్భగుడికి పక్కన ఆండాళ్ అమ్మవారు, శయన మండపం, మెట్ల వెంబడి గరుత్మంతుని విగ్రహాలు, ఆలయంలో వెలుగులు విరజిమ్మే షాండ్లియర్లు, రాజస్థానీ పద్మాలు భక్తులకు కనువిందు చేస్తాయి.
స్వామివారి ప్రధాన ఆలయం రెండో అంతర ప్రాకారాల వద్ద నాలుగు వైపులా నాలుగు మండపాలను నిర్మించారు. ఆగ్నేయంలో స్వామివారి కైంకర్యాల కోసం ఏర్పాటు చేసిన రామానుజకూటం మండపం ఉంటుంది. ఈశాన్యంలో నిత్యకల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. రెండో బాహ్య ప్రాకారం వద్ద నాలుగు దిక్కుల్లో అష్టభుజి మండపాలను నిర్మించారు. స్వామివారి గర్భగుడి ఎదురుగా ఉండే ముఖమండపాన్ని 150 మందికిపైగా కూర్చునేందుకు అనువైన వేదికగా ఏర్పాటు చేశారు. ప్రధానాలయంలోకి అడుగు పెడుతూనే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యేలా లోపలి వాతావరణాన్ని తీర్చిదిద్దారు.
గర్భగుడి గోడలపై స్వామివారి శంఖుచక్ర నామాలు, పంచనారసింహ రూపాలు, ప్రహ్లాద చరిత్ర శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి. మూడు ఉపాలయాలు, శయన మండపం, బలిపీఠం, బంగారు తాపడంతో ధ్వజస్తంభం, దర్పణం భక్తులకు కనువిందు చేస్తాయి. ఆలయ పునర్నిర్మాణం, విస్తరణలో కీలకమైన రక్షణగోడ నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించింది.
ఆలయ పునర్నిర్మాణంలో సిమెంటు వాడలేదు
ఆధునిక నిర్మాణాల్లో రాళ్లు, ఇటుకలను జోడించి, వాటిని దృఢంగా నిలపడానికి సిమెంటు వాడటం మామూలే! అయితే, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంటు వాడలేదు. పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతో తయారు చేసిన గానుగ సున్నాన్నే ఉపయోగించారు. ఆలయంలోని తలుపులకు వాడిన కలపకు సైతం క్షుణ్ణంగా నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటిని అమర్చారు. కలప రకం, మందం, దారుఢ్యం, తేమను తట్టుకునే శక్తి వంటి లక్షణాలన్నింటినీ పరీక్షించి, ఉత్తమమైన కలపనే తలుపుల నిర్మాణం కోసం ఎంపిక చేశారు.
శిల్పశోభితం...
యాదాద్రిలో వెలసిన పంచ నారసింహక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీనరసింహుడు స్వయంభువులుగా వెలసిన ఈ దివ్యక్షేత్రాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికీ తీసిపోని రీతిలో వివిధ శిల్పకళా శైలుల వైభవం ఒకేచోట భక్తులకు కనువిందు చేసేలా అత్యంత అపురూపంగా, అనన్యసామాన్యంగా నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ నిర్మాణంలో శ్రేష్ఠమైన కృష్ణశిలదే సింహభాగం. ఆలయ పునర్నిర్మాణం కోసం ఏకంగా 9.5 లక్షల ఘనపు మీటర్ల (2.5 లక్షల టన్నులు) కృష్ణశిలను వినియోగించారు. ఆధారశిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను వినియోగించారు. ఆధునికకాలంలో ఇలా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ నిర్మాణం చేపట్టడం విశేషం. విమాన గోపురాన్ని ద్రవిడ శిల్పకళారీతిలోను, అష్టభుజి మండపంలోని గోపురాలను పల్లవ శైలిలోను రూపొందించారు. కాకతీయ వైభవాన్ని తలపిస్తూ ముఖమంటపాలను కాకతీయ శైలిలో నిర్మించారు. పదిమంది స్థపతులు, ఎనిమిదివందల మంది శిల్పులు ఆలయ మండపాలు, గోపురాలపై 541 దేవతారూపాలను, 58 యాలీ పిల్లర్లను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణం, శిల్పాల రూపకల్పనలో రఘునాథ పాత్రో, ముత్తయ్య స్థపతి, సౌందరరాజన్, డాక్టర్ ఆనందాచారి వేలు వంటి నిష్ణాతులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన కృష్ణశిల ఏళ్లు గడిచేకొద్ది మరింత నునుపుదేలి, నాణ్యతను సంతరించుకుంటుంది.
ఆలయ పునర్నిర్మాణం కోసం భారీస్థాయిలో కృష్ణశిల అవసరం కావడంతో రాష్ట్ర గనులశాఖ అధికారులు, ఇతర నిపుణులు దేశమంతటా పర్యటించి, నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గురుజపల్లిలో నాణ్యమైన కృష్ణశిల లభించడంతో, ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం శిలను ఆ గ్రామంలోని ఒకే క్వారీ నుంచి సేకరించారు. రాళ్ల నాణ్యతను ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్’ సంస్థ, వాటితో చెక్కిన శిల్పాల నాణ్యతను ‘మెస్సెర్స్ సివిల్స్ ఇంజినీర్స్’ సంస్థలు పరిశీలించి, ధ్రువీకరించాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇలాంటి పరీక్షలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. యాదాద్రి ఆలయాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు.
శ్రీవైష్ణవ భక్తిసంప్రదాయాన్ని ప్రచారం చేసిన పన్నెండు మంది ఆళ్వార్ల విగ్రహాలను, రెండో అంతస్తులో కాకతీయ స్తంభాలు, అష్టభుజి మండపాలు, మాడవీథులు, పురవీథుల ప్రాకారాలు, త్రితల, పంచతల, సప్తతల, మహారాజ గోపురాలు, విమాన గోపురాలు ఇలా ఆలయంలోని ప్రతి నిర్మాణంలోనూ అణువణువునా విష్ణుతత్త్వం ప్రతిఫలించేలా రూపొందించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దేశంలోని అనేక శిల్పకళారీతులను స్వయంగా అధ్యయనం చేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఇతర అధికారులు దేశవ్యాప్తంగా సంచరించి, వివిధ ఆలయ శిల్పరీతులను పరిశీలించి వచ్చారు. చెన్నై, మహాబలిపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి దాదాపు రెండువేల మంది శిల్పులు యాదాద్రి పునర్నిర్మాణంలో అహరహం శ్రమించారు.
ఇది వరకు యాదాద్రి చుట్టూ కలిపి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు దీనికి ఇంకో గుట్టను జోడిరచి, మరో మూడెకరాలను కలిపారు. ఉపరితలం నుంచి ఎనభై అడుగుల ఎత్తువరకు ఉన్న కొండను కాంక్రీటుతో నింపకుండా, సహజసిద్ధంగా ఉండేలా మట్టితో ఎనభై అడుగుల ఎత్తు వరకు నింపి, మూడెకరాలను విస్తరించారు. మహాయజ్ఞంలా సాగిన ఈ ప్రక్రియకు ఏడాదిన్నర పట్టింది. కొండ కోసం తరలించిన మట్టి, రాళ్లు కూలిపోకుండా పటిష్ఠంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కొత్తగా విస్తరించిన కొండభాగం పటిష్ఠతను, నాణ్యతను జేఎన్టీయూ, ‘నిట్’ నిపుణులు పరీక్షించారు. చలికాలంలో, ఎండాకాలంలోనే కాకుండా భారీగా వర్షాలు కురిసినప్పుడు కొత్తగా జోడిరచిన కొండ ఎలా ఉంటుందనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
ముఖమంటపం
నిలువెత్తుగా రెండంతస్తులుగా శిల్ప శోభితమైన ముఖమంటపం, స్వామివారికి చక్రవర్తి సభా మంటపంలా శోభిల్లుతున్నది. నిజానికి ఈ నిర్మాణం కత్తిమీదసాము, రూపకర్తల మేధకు పరీక్ష. కారణం స్వామివారి మూల విరాట్టును, దానికి ఆనుకొని ఉన్న కొండను, నృసింహుడు విరాజమా నమైన గుహ పవిత్రతను కాపాడుతూ, సవరణలేవీ లేకుండా దాన్ని కలుపుకొని నిర్మాణాలు చేయడం కష్టకార్యం. క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి ఉపాల యాన్ని, గరుడాళ్వారు ఆలయాన్ని, యథాతథంగా ఉంచుతూనే సువిశాల ముఖమంటప నిర్మాణం సాగింది. పై అంతస్తులో తూర్పున స్వామికి అభిముఖంగా, తంజావూరు చిత్రాలతో పురాణ గాథలతో చిత్రశాల నిర్మించారు. కుడి వసారాలో భక్తులు వేచి ఉండేందుకు, ఎడమ వసారాలో స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపునకు విశాలంగా నిర్మించారు. శయన మంటపం భక్తుల దర్శనార్థం ఉత్తర ప్రదక్షిణపథంలో నిర్మించారు.
అస్సాం నుంచి వచ్చిన కర్రదుంగ శ్రేష్ఠమైన వృక్ష స్కంధంతో నిటారుగా 34 అడుగుల సమున్నత దారు ధ్వజంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. పడమటి గోపురం సప్తతల గోపురంగా 72 అడుగులతో నిర్మితమైంది. నాలుగు దిశల్లో 55 అడుగులతో పంచతల, ఈశాన్యంవైపు 33 అడుగుల త్రితల గోపురాన్ని నిర్మించారు. మొత్తం సప్త గోపురాలతో సప్తగిరులవలె శోభిస్తున్నది. ఆలయంలో కుడ్యాలపై, స్తంభాలపై చెక్కిన దేవతామూర్తుల సంఖ్య 541. బాహ్యాంతః ప్రాకారాల కుడ్యాలపై, స్తంభాలపై రామాయణ, మహాభారత ఇతిహాసాల దృశ్యాలు చెక్కించారు. ఇది దక్షిణాది ఆలయాల సాదృశ్యంతో చేసింది. పడమటి మహాగోపురం బృహదీశ్వరాలయంలా సమస్త శిలానిర్మితం.
టెంపుల్ సిటీ
ఇప్పుడున్న యాదాద్రికి తోడుగా మరో 850 ఎకరాలలో టెంపుల్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వసతి సౌకర్యాల కోసం దాదాపు వెయ్యికి పైగా వసతి గృహాలను అక్కడ నిర్మించనున్నారు. తొలిదశలో 252 వీఐపీ కాటేజీలను ఒక్కొక్కటి రూ.1.50 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి దాతలు ఏడాదిలో ముప్పయి రోజులు ఈ వసతిగృహాల్లో ఉండవచ్చు. వీటికి తోడు 13.5 ఎకరాల్లో ప్రత్యేకంగా వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్ సూట్ల పేరిట 15 కాటేజీలను నిర్మించారు. వీటి నిర్మాణానికి ఒక్కోదానికి ఏడు కోట్లు ఖర్చు చేశారు. ఇక గుట్ట కింద తులసి కాటేజీలో అదనంగా 120 గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవి కాకుండా, ఇంకా ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెండ్లి మండపాలు, ఆస్పత్రి, పాఠశాల వంటి వాటిని కూడా నిర్మించనున్నారు.