నాటికీ నేటికీ మెగా నాయకుడు చిరంజీవి

తెలుగు సినీపరిశ్రమలో నటునిగా, సామాజిక సేవామూర్తిగా, కమ్యూనిటీకోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తిగా గుర్తింపును పొందిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో సామాన్య నటుడిగా కెరీర్‍ను స్టార్ట్ చేసి ఎవరి అండదండలు లేకుండా తనకు తానుగా అత్యున్నత శిఖరాలను చేరుకున్నారు. అలాగే తన ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి అందించారు. మెగా హీరోలకే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకు ఇన్‍స్పిరేషన్‍గా చిరంజీవి నిలిచారు. కొన్ని కోట్ల మంది హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకున్న మెగాస్టార్ అయ్యారు. అచంచలమైన పట్టుదల, దీక్షతోనే సాధ్యమైంది. అగ్ర కథానాయకుడిగా బాక్సాఫీస్‍ను శాసించిన చిరంజీవి ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలెన్నో. అయితే ప్రతి పాఠాన్ని విజయంగా మార్చుకుంటూ తనకు తాను మెగా హిట్స్తో ఎవరూ అందుకోలేని రేంజ్‍కు చేరుకున్నారు.
అలుపెరగని ప్రయాణం...
1978లో పునాదిరాళ్ళుతో ఆయన నటుడిగా కెరీర్ ప్రారంభించినా ప్రాణం ఖరీదు చిత్రం ముందుగా విడుదలైంది. పునాది రాళ్లు మూడో చిత్రంగా విడుదలైంది. కెరీర్ ప్రారంభంలో హీరోగానే కాకుండా కొన్ని గ్రేడ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. వచ్చినా ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు చిరంజీవి. వరుస నిమాలతో పుల్‍బిజీగా మారినా. పనిలో తన ఫోకస్ ఎక్కడ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు చిరంజీవి. ఆ హార్డ్వర్కే ఆయనకు శ్రీరామరక్షగా మారింది. మనపూరి పాండవులు, తాయరమ్మ బంగారయ్య, ఇది కథ కాదు, శ్రీరామబంటు, కోతల రాయుడు, పున్నమినాగు, మొగుడు కావాలి. న్యాయం కావాలి, చట్టానికి కళ్ళులేవు, కిరాయిరౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, పల్లెటూరి మొనగాడు, అభిలాష, గూఢచారి నెం.1, మగమహారాజు వంటి విజయవంతమైన చిత్రాలతో దిగ్విజయంగా కొనసాగింది. ఖైదీ చిత్రం చిరంజీవిని స్టార్ హీరోగా మార్చింది. ఖైదీ సాధించిన సక్సెస్ తో చిరంజీవి సుప్రీమ్ హీరో అయ్యారు. ఈ సినిమా కలెక్షన్స్ ప్రభంజనం ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ సినిమా నుండి తెలుగు సినిమా స్పీడందుకుంది. యాక్షన్, డాన్సుల పరంగా తెలుగు సినిమా ట్రాన్స్ఫామ్ అయిన న్యూ ట్రెండ్‍కు చిరంజీవే నాంది పలికారు. ఆ తర్వాత మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్ ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం, దొంగ వంటి కమర్షియల్ చిత్రాల సక్సెస్‍తో ఆయన రేంజ్ మరింత పెరిగింది. అడవి దొంగ ఘన విజయంతో చిరంజీవి పెద్ద స్టార్ హీరోగా ఎదిగారు. విజేత, కొండవీటి రాజా, మగధీరుడు, చంటబ్చాయ్, రాక్షసుడు, దొంగమొగుడు చిత్రాలు చిరంజీవి స్టార్ ఇమేజ్‍ని పెంచుకుంటూ వచ్చాయి. పసివాడి ప్రాణం సంచలన విజయం చిరంజీవిని మరింత పెద్ద రేంజ్‍కు తీసుకెళ్ళింది. స్వయంకృషితో ఉత్తమ నటుడు అవార్డు అందుకొని మంచిదొంగతో కమర్షియల్ సక్సెస్ కొట్టి, రుద్రవీణని సొంతంగా నిర్మించి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న సుప్రీమ్ హీరో చిరంజీవి యుముడికి మొగుడుతో కొత్త రికార్డులు సృష్టించారు. ఖైదీ నెంబర్ 786 తర్వాత మరణ మృదంగంతో మెగాస్టార్ అయ్యారు. 100వ చిత్రం త్రినేత్రుడుతో అభిమానులను అలరించారు. స్టేట్ రౌడీ, కొండవీటి దొంగ వంటి వరుస విజయాలను సాధించారు. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ సాధించారు. గ్యాంగ్‍లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు ఇలా ఒకదాన్ని మించిన మరొక బ్లాక్ బస్టర్‍ని ఇచ్చి హ్యాట్రిక్ సాధించడమే కాదు ఘరానా మొగుడుతో తెలుగు సినిమా స్టామినాను పెంచారు.
అప్పట్లో ఈ సినిమా పదికోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్‍ను సాధించారు. అదే సమయంలో ఆయన బాలీవుడ్‍కు ఎంట్రీ ఇచ్చారు. అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంద్‍గా రీమేక్ చేశారు. అలాగే గ్యాంగ్‍లీడర్‍ను అజ్‍కాగుండారాజ్‍గా బాలీవుడ్‍లో రీమేక్ చేసి ప్రేక్షకులను అలరించారు. తర్వాత ఆయన బాలీవుడ్‍లో చేసిన ప్రతిబంధ్, ఆజ్‍కా గూండారాజ్ సాధించిన మెగాస్టార్ ముగ్గురు మొనగాళ్ళు, అల్లుడా మజాకా వంటి కమర్షియల్ హిట్స్ కూడా సాధించారు. ఆ తర్వాత వచ్చిన రెండు, మూడు చిత్రాలు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో తనకు తాను తొమ్మిది నెలలు గ్యాప్ విధించుకుని, ట్రెండ్ మార్చి హిట్లర్ వంటి ఫ్యామిలీ ఎంటంటైనర్‍తో బ్లాక్‍బస్టర్ హిట్ కొట్టారు. అక్కడ నుండి మళ్ళీ చిరంజీవి తన బ్లాక్ బస్టర్ ట్రాక్‍ను కంటిన్యూ చేశారు హిట్లర్, మాస్టర్, బావగారూ బాగున్నారా, చూడాలని వుంది, స్నేహం కోసం, అన్నయ్య, ఇద్దరు మిత్రులు శ్రీమంజునాథ వంటి వరుస మెగా హిట్స్ సాధించారు. శ్రీమంజనాథ చిత్రంలో శివుడిగా పౌరాణిక పాత్రలో నటించి మెప్పించారు. ఫ్యాక్షనిజం బ్యాక్‍డ్రాప్‍లో చేసిన ఇంద్రతో మళ్ళీ తన రికార్డుల్ని తానే క్రాస్ చేసుకోవడమే కాక తెలుగు సినిమా రేంజ్‍ని మరింత పెంచి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ సినిమాలో చిరు నటనతో పాటు డాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‍గా నిలిచాయి. అన్యాయాలపై ఎదురు తిరిగే ప్రాఫెసర్ పాత్రలో చిరు చేసిన ఠాగూర్ బ్లాక్ బస్టర్‍తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో మళ్ళీ తన సత్తా చూపించి మరో ఇండస్ట్రీ హిట్ సాధించారు. శంకర్‍దాదా ఎం.బి.బి.ఎస్‍తో మరో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఎవర్‍గ్రీన్ మెగా స్టార్‍గా బాక్సాఫీస్‍ని షేర్ చేశాడు. స్టాలిన్‍తో మరో మంచి హిట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ తర్వాత రాజీయ రంగ ప్రవేశం చేశారు. అయితే తన అభిమానులను మెగా పవర్‍స్టార్ రామ్‍చరణ్ మగధీర, బ్రూస్‍లీ చిత్రాల్లో స్పేషల్ అప్పీయరెన్స్ ఇచ్చి అలరించారు. ఈ జర్నీలో నకిలీమనిషి, జ్వాల, సింహపురి సింహం, రక్తసింధూరం, రిక్షావోడు, దొంగ మొగుడు, స్నేహం కోసం, రౌడీ అల్లుడు, ఖైదీ నంబర్ 150 చిత్రాల్లో డ్యూయెల్ రోల్స్తో, ముగ్గురు మొనగాళ్ళు చిత్రంలో ట్రిపుల్‍రోల్స్తో ప్రేక్షకులను, అభిమానులను మెప్పించారు.
గ్రాండ్ రీ ఎంట్రీ
తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ అనగానే చిరంజీవి ఇప్పటి ట్రెండ్‍లో సినిమాలు చేయాలి. మునుపటిలా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ను కొల్లగొడతాడా? చిరంజీవి అంటే డ్యాన్సులు, ఫైట్స్కే ట్రేడ్ మార్క్గా నిలిచారు. మరి ఈ యువతరం హీరోలందరూ డ్యాన్సుల్లో యాక్షన్స్ సీక్వెన్స్లో రాణిస్తున్నారు. మరి వారితో చిరు ఎలా పోటీ పడతారనే ఆసక్తి అందరిలో క్రియేట్ అయ్యింది. అయితే చిరంజీవి ఎప్పటికే బాక్సాపీస్ దగ్గర చిరంజీవే అంటూ తన ల్యాండ్ మార్క్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో తన సత్తా చాటారు. ముఖ్యంగా ఆరు పదులు వయసైనా తన డ్యాన్సుల్లో ఏ మాత్రం పదను తగ్గలేదని ఫ్రూవ్ చేశారు. ముఖ్యంగా అమ్మడు సాంగ్‍లో చిరంజీవి, చరణ్ కలిసి వేసిన స్టెప్పులు సినీ అభిమానులకు కన్నులపండుగ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డుల దుమ్ము దులిపారు. చిరంజీవి సినిమా అంటే పక్కా కమర్షియల్‍గా ఉంటూనే మంచి మెసేజ్ ఉండాలని ఆయన అందరూ కోరుకుంటారు. అలాంటి సినిమాను ప్రేక్షకులకు, అభిమానులకు అందించి బ్లాక్‍బస్టర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుని రీ ఎంట్రీపై వచ్చిన ప్రశ్నలకు కలెక్షన్స్తో, ఫెర్ఫామెన్స్తో సమాధానమిచ్చి దటీజ్ చిరంజీవి అనిపించుకున్నారు. అలాగే తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా చేసిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని చేసిన ప్యాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డితో ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‍లో నే ఓ మెమొరబుల్ మూవీగా నిలిచింది.
మెగా స్పీడు
వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చిరంజీవి మంచి స్పీడు మీదున్నారు. రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 బ్లాక్‍బస్టర్ కొట్టిన చిరంజీవి ఈ సినిమా డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో హాట్రీక్ మూవీ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ స్టార్ట్ కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఓ సినిమా డిస్కషన్స్ జరుగుతుంది. బాబీ దర్శకత్వంలో సినిమా కథ సిద్ధమైందని, అలాగే సుకుమార్, హరిశ్ శంకర్ స్టోరీస్ సిద్ధం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి 152వ చిత్రం తర్వాత స్టార్ అయ్యే సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే.
అవార్డులు, సత్కారాలు..
సుదీర్ఘ ప్రయాణంలో చిరంజీవిని వరించిన అవార్డులు, హత్తుకున్న సత్కారాలు ఎన్నో స్వయంకృషి, ఆపద్భాంవుడు, ఇంద్ర చిత్రాలకు నంది అవార్డులను చిరంజీవి సొంతం చేసుకున్నారు. అలాగే శుభలేఖ, విజేత, ఆపద్భాంవుడు, ముఠామేస్త్రీ, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్‍దాదా ఎంబీబీఎస్, చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్న చిరంజీవి 2010లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ ఎచీవ్‍మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. 2016లో సినిమా రంగానికి సిన సేవలకుగానూ రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును దక్కించుకున్నారు. అలాగే 2014లో ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా చిరంజీవి సొంతమైంది. 2006లో కళలు, సేవా రంగంలో చిరంజీవి విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ పురస్కారాల్లో మూడవది అయిన పద్మభూషణ్ అవార్డునిచ్చి గౌరవించింది.
- రాంబాబు వర్మ
సినిమా బ్యూరో