తానా పయనం ఎటు?

అమెరికాలోని జాతీయ తెలుగు సంఘాల్లో తానాకు 4 దశాబ్దాలకుపైగా చరిత్ర ఉంది. ప్రపంచ తెలుగు సంఘాలకు మాతృసంస్థలా, కమ్యూనిటీకి పెద్దన్నలా తానా వ్యవహరిస్తుంటుంది. తానా చేసే కార్యక్రమాలు కూడా భారీగానే ఉంటాయి. కోట్లాది రూపాయలను కమ్యూనిటీకోసం ఖర్చు చేయడంలో తానా ముందుంటుంది. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి సేవ చేస్తూనే మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకోసం కూడా అనేక సేవా కార్యక్రమాలను తానా నిర్వహిస్తుంటుంది. తానా ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలు ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు ఎంతోమందిని ఆకర్షిస్తుంటుంది. ఎంతోమంది పెద్దలు, రాజకీయ నాయకులు, సాంస్కృతిక కళాకారులు, సినిమా కళాకారులు ఇలా ఎంతోమంది ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతుంటారు.
తానా నిర్వహణను రెండు విభాగాలు చూస్తుంటాయి. కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్ కమిటి), తానా ఫౌండేషన్‌గా ఈ రెండిరటిలో... తానా ఈసీ (జుజ) తానాకి సంబందించిన అన్ని కార్యక్రమాలు (విద్య, వైద్య, సాంస్కృతిక, స్పోర్ట్స్, బిజినెస్, ఎంటర్టైన్మెంట్) చూసుకుంటుంది.. తానా ఫౌండేషన్ పూర్తిగా తానాకి సంబందించిన ఛారిటీ కార్యక్రమాలు చూసుకుంటుంది. ఈ రెండు విభాగాలు కు తోడుగా ఈ మధ్య కాలంలో తానా టీమ్ స్క్వేర్ కూడా ఒక విభాగం లాగా అమెరికాలో విపత్తు సమయంలో తెలుగు వారిని ఆడుకుంటూ పని చేస్తోంది. అయితే తానా బోర్డ్ ఆఫ్ డ్కెరెక్టర్స్ (బిఓడి) ఈ రెండు విభాగాల పైన ఒక సుప్రీం బాడీగా వుంటూ మొత్తం సంస్థకి దశా నిర్దేశం చేస్తుంది. తానా బోర్డ్ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే మిగతా విభాగాలు పనిచేస్తాయి.
అనేక కార్యక్రమాలతో ముందుకెళ్తున్న తానా
కొన్ని సంవత్సరాలుగా తానాలో జరుగుతున్న కార్యక్రమాలు గమనిస్తే.. అందరికి తెలిసే విషయం... ఏడాది పొడుగునా జరుగుతున్న కార్యక్ర మాలు.. ఏడాది ఏడాదికి పెరుగుతున్న కార్యక్రమా లు.. దానికి కారణం పెరుగుతున్న యువ నాయకులు, పెరుగుతున్న తెలుగు కమ్యూనిటీ.. పెరుగుతున్న కమ్యూనిటికి అవసరం అయిన కార్యక్ర మాలు. కొవిడ్ సంక్షోభంలో పూర్తిస్థాయి లాక్డౌన్ పరిస్థితులలో కూడా తానా చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు టైమ్స్ అప్పటికే ఆ కార్యక్రమాల మీద ఒక నివేదిక లాగా పుస్తకం తెచ్చిన విషయం కూడా అందరికి తెలుసు. బయటకు రాలేని పరిస్థితులలో కేవలం జూమ్ మీటింగ్‌ల ద్వారా కమ్యూనిటీకి ఎన్నో కార్యక్రమాలను, సేవలను అందించి అందరి మన్ననలు పొందింది.
ప్రస్తుతం కూడా అంజయ్య చౌదరి అధ్యక్షులుగా తానా నాలుగు విభాగాల ద్వారా తానా కమ్యూనిటీ సేవలు, తానా ఫౌండేషన్, తానా టీమ్ స్క్వేర్, తానా సాహిత్య వేదిక 45 సంవత్సరాలు జరగనన్ని సేవా కార్యక్రమాలు ఈ ఒక్క సంవత్సరం (జూలై 2021 నుంచి జూన్ 2022 వరకు) జరిగాయని తానా అధ్యక్షుడు అంటున్నారు. అవి ఏమిటో చూద్దాం.
తానా కమ్యూనిటీ సర్వీస్‌లు
* అమెరికాలోని వివిధ పట్టణాలలో బ్లడ్ డొనేషన్, పుడ్ డ్క్రెవ్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వంటి కార్యక్రమాలను తానా ప్రస్తుతం అన్ని పట్టణాలలో నిర్వహిస్తోంది.
* అందరికి ఉపయోగపడే విధంగా అనుభవజ్ఞులు చేత ట్యాక్స్ ప్లానింగ్ సెమినార్లను, ఇమ్మిగ్రేషన్ సెమినార్లను నిర్వహిస్తోంది.
* సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అవసరం అయిన ఎస్ఏటీ కోచింగ్ క్లాస్‌లను నిర్వహిస్తోంది.
* తానా నిర్వహించిన ‘ఎక్స్‌ప్లోరింగ్ అపోర్చునిటిస్ ఫర్ ఫామ్‌లాండ్స్ సెమినార్’ వలన అందరికీ అమెరికాలో భూములు కొని వ్యవసాయం చేయటం ఎలాగో తెలిసిందనీ చాలా మంది మెచ్చుకొన్నారు.
* అనేక పట్టణాలలో హాల్ట్ఫుల్నెస్, యోగా శిబిరాలను వివిధ చోట్ల తానా ప్రాంతీయ నాయకులు నిర్వహించారు
* దాదాపుగా 40 చోట్ల సమ్మర్‌క్యాంప్‌లు జరిగితే సుమారు 8000 మందికిపైగా పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్నారు.
* తానా బాలోత్సవం అనేక పట్టణాలలో జరుగుతోంది.
* మహిళల కోసం ఉమెన్స్ డే ప్రోగామ్‌లు చాలా వైభవంగా చికాగో, సెంట్లూయిస్ నగరాలలో జరిగాయి.
* మదర్స్ డే పోగ్రాములు కూడా న్యూజెర్సీ, ఛార్లెట్లలో జరిగాయి.
* మొదటిసారిగా న్యూయార్క్‌లో మన్హట్టన్లో టైమ్‌స్క్వేర్ దగ్గర అత్యంత వైభవంగా బతుకమ్మ వేడుకలను తానా నిర్వహించింది.
* ఈ సంవత్సర కాలంలో దాదాపు 50 స్పోర్ట్స్ ఈవెంట్లను తానా నిర్వహించిందని వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ , క్రికెట్ పోటీలు జరిగాయని, సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు తానా క్రికెట్ కప్ పోటీలు జరగబోతున్నాయని చెప్పారు.
తానా టీమ్ స్క్వేర్
* అమెరికా దేశంలో తెలుగు వారే కాకుండా భారతీయులు కూడా మెచ్చెకొంటూ గుర్తించు కొనే పేరు తానా టీం స్క్వేర్. ఈ విభాగం ద్వారా రోడ్ ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, లేదా హటాత్తుగా ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు ఆదుకోవడం జరుగుతుంది.
తానా ఫౌండేషన్
* తానా మన ఊరి కోసం పథకం కింత అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాలలో వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం 100 క్యాన్సర్ క్యాంప్‌లు లక్ష్యంగా ప్రకటించి ఇప్పటి వరకు 24 క్యాన్సర్ క్యాంప్‌లను నిర్వహించింది. 50 కంటి వైద్యశిబిరాలను లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు 15 కంటి వైద్యశిబిరాలను నిర్వహించింది.
* తానా చేయూత కింద 1000 మందికి స్కాలర్షిప్ ఇచ్చే లక్ష్యంతో ప్రకటన చేసి ఇప్పటికే 800 స్కాలర్షిప్లను ఇచ్చింది.
* ఇప్పటి వరకు మునుపెన్నడూ జరగని విధంగా ప్రతి నెలా చివరి ఆదివారం రోజున తానా ప్రపంచ సాహిత్య వేదిక కింద అంతర్జాలంలో తెలుగు భాష మీద, సంఘం, సాంప్రదాయాల మీద కవులు, రచయితలు, కళాకారులు, ప్రభుత్వ అధికారులతో సెమినార్లను నిర్వహిస్తోంది. ఇవి ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి.
* ప్రముఖ కవి సిరివెన్నెల జయంతిని హైదరాబాద్‌లో శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా నిర్వహించి, సిరివెన్నెల రచించిన 2000 పాటలను 6 భాగాలుగా ముద్రించి ఒక చారితాత్మ్రక వేడుక జరిపింది.
* తెలుగు సాంస్కృతిక సిరులు కార్యక్రమమును రూపొంందించి ప్రతి నెల 2వ శనివారం తెలుగు కళలు అయిన బుర్రకథ, హరికథ లాంటి మన కళలను మళ్ళీ వెలుగులోకి తీసుకువస్తోంది. కిందటి నెలలో డల్లాస్‌లో తనికేళ్ల భరణిలో జరిపిన వేడు అందరి మన్ననలు పొందింది.
* తానా పుస్తక మహోద్యమం క్రింద పాత పుస్తకాలు, నవలలు సేకరించి పిల్లలకు వాటిని పంపిణీ చేసి వారిచేత పుస్తక పఠనం అనే ప్రక్రియ చేయించాలనే ఉద్వేగంతో తానా రూపొందించిన కార్యక్రమం ఇది. పిల్లలు తమకు ఇచ్చిన పుస్తకాలు చదివి తానా వెబ్సైట్లో వారి అనుభవాన్ని పోస్ట్ చేయాలి.
* తెలుగు తేజాలు పేరుతో తెలుగు భాష మీద పోటీలు నిర్వహించడం మొదలు పెట్టింది.
తానాలో ఆగని గ్రూప్ రాజకీయాలు
తానాలో ఇప్పుడు గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఒక వైపు ఇదివరకటి కంటే ఎక్కువగా కమ్యూనిటీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అని సంతోషంగా వున్నా, ఇదివరకటి కంటే ఎక్కువగా చిన్న వాళ్ళు -పెద్ద వాళ్ళు కూడా పదవులపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు అని ఒక నాయకుడు తెలుగు టైమ్స్‌తో తమ బాధను చెప్పుకొన్నారు. సేవా కార్యక్రమాలు, ఇస్తున్న విరాళాలు కూడా వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్న రాజకీయ ఆలోచనలతోనే అన్న మాట వాస్తవం అని తెలుగు టైమ్స్‌కి అనేక మంది చెప్పటం జరిగింది.
ఎన్నికల సమరం ఎన్నికల తరువాత కూడా జరుగుతోందా?
గత సంవత్సరం 2021 జనవరి నుంచి మే వరకు జరిగిన తానా నాయకత్వ ఎన్నికలు అందరికి గుర్తు వుండే ఉంటాయి. అమెరికాలోనే కాక , తెలుగు రాష్ట్రాలలో కూడా ఆ ఎన్నిక గురించి కథలు కధలు గ చెప్పుకొన్నారు. తెలుగు రాష్టాలలో దిన పత్రికలు, టీవీ చానెళ్లు కూడా ఆ ఎన్నికల వేడి వేడి వార్తలను ఎప్పటికప్పుడు అందించారు. ఇక సోషల్ మీడియా లో జరిగిన హడావిడి గురించి చెప్పనే అక్కర లేదు.
సాధారణంగా ఎన్నికల ఫలితాలు వచ్చాక, గెలుపు- ఓటమిలు సహజం, మనమంతా ఒక సంస్థకు చెందిన వాళ్ళం అని అందరు కలిసి పని చేస్తారని, తానా కార్యక్రమాలు మరింత ఎక్కువగా జరుగుతాయని అందరు ఆశించారు. అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా పేరు పొందిన తానాలో నాయకత్వం 40లలో వున్న యువకుల చేతిలోకి వెళ్తన్న విషయం సంతోషించ వలసిన విషయమే అయినా వర్గ రాజకీయాలు, ఆవేశపూరిత నిర్ణయాలతో తానా లక్ష్యాలను కూడా పక్కన పెట్టి ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది అని సీనియర్స్ బాధ పడుతున్నారు. అధికారమే పరమావధిగా నేటి తానా నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఎంతో మందిని కలవరపరుస్తోంది అని ఒక సీనియర్ తానా నాయకులు బాధని తెలుగు టైమ్స్‌తో చెప్పుకున్నారు. ఇటీవలి కాలంలో తానా చరిత్రలో ఎన్నడూ చూడని అవిశ్వాసతీర్మానం ద్వారా తానా ఫౌండేషన్ చైర్మన్ ను దించేయడం, కోర్టు తీర్పుతో చెంపలేసుకుని మరీ ఆయనను మళ్ళీ ఫౌండేషన్ చైర్మన్ గా స్వీకరించడం వంటివి తానా ప్రతిష్టను దిగజార్చింది. గత ఎన్నికల్లో రెండు వర్గాలుగా మారి కొట్లాడుకుని, సోషల్ మీడియా ద్వారా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న వర్గాలు ఇప్పుడు ఎన్నికల తరువాత మళ్ళీ విభేధాలతో రోడ్డు కెక్కాయి.
పెరిగిన తానా సభ్యుల కోసం
ఒక సంస్థలో కొత్త సభ్యులను చేర్పించే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. రాజకీయ పార్టీలలో గాని, స్వచ్ఛంద సంస్థలలో కానీ ఒక పీరియడ్‌లో, ఒక లక్ష్యంతో పనిచేసి కొత్త సభ్యులను చేర్పించటం తప్పు కాదు. కొత్త విష్యం కూడా కాదు. అయితే తానాలో ఈ సంవత్సరం కొత్తగా సభ్యులు వేల సంఖ్యలో చేరారు. అందులో డిసెంబర్ వరకు వందల్లో చేరిన సభ్యుల సంఖ్య, ఒక్క జనవరి నెలలో మాత్రం ఇరువర్గాలు పోటాపోటీగా సభ్యులను చేర్పించాయి. దాంతో జనవరి నెలలో దాదాపుగా 16,500 మందికి పైగా కొత్తగా తానా సభ్యత్వం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఒక వర్గం ఈ సారి భారీగా డబ్బులు ఖర్చు పెట్టి నూతన సభ్యులను చేర్పించిందని చెబుతున్నారు. మరో వర్గం కూడా వచ్చే ఎన్నికల్లో తమ మెజారిటీ తగ్గకూడదన్న ఉద్దేశ్యంతో తాను కూడా సభ్యులను చేర్పించింది అని కూడా చెపుతున్నారు. రాజ్యాంగం ప్రకారం సభ్యత్వ ధృవీకరణ కమిటీ (MVC - Membership Verification Committee) నిర్ణీత సమయంలో అంటే ఏప్రిల్ 30 2022 లోపు సభ్యుల దరఖాస్తులను పరిశీలించి సభ్యుల నమోదు ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. చాలా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావటం వలన నిర్ణీత సమయంలో కొత్త సభ్యుల పరిశీలనలు జరగలేదు. ఆమోదం పొందకపోవటం వలన కొత్త సభ్యులు ఓటు హక్కు కోల్పోయారు అని చెబుతున్నారు. ఈ ఓటు హక్కును వారు పొందలేకపోవడం వెనుక గ్రూపు రాజకీయాలే కారణమని అంటున్నారు. నూతన సభ్యత్వాల్లో తమ వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది లేకపోవడంతో రాబయే ఎన్నికలలొ సంస్థపై పట్టు కోల్పోతాము అని గ్రహించిన ఓ వర్గం కుట్ర చేసి సకాలంలో సభ్యత్వ ధ్రువీకరణ చేయకుండా అడ్డుపడిరది అని ఎదుటివర్గం వారు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ విషయంలో ఏ విధంగాననా వారికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని భావించి ఈసీ సమావేశంలో ఓ తీర్మానాన్ని ఓవర్గం ఆమోదింపజేసుకుంది. దీని ప్రకారం కొత్త సభ్యులకు ఓటు హక్కు కల్పించే విషయాన్ని పరిశీలించా ల్సిందిగా బోర్డుని కోరింది. దీంతో తానా బోర్డు ఈ విషయమై సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించింది. అయితే బైలాస్‌ను ఎప్పుటికప్పుడు మార్చడం సబబుగా ఉండదని సీనియర్లు భావించారు. కొత్తగా చేరిన దాదాపు 33,000 ఓటర్లు (సాధారణంగా ఒక లైఫ్ మెంబెర్ -ఆయన సతీమణితో ఇద్దరికి ఓటు హక్కు వస్తుంది) ఓటింగ్ హక్కు కల్పించేలా బ్కెలాస్లో మార్పులు చేయాలని కోరింది. దీనిపై ఓటింగ్ జరిగింది. 15 మంది సభ్యుల బోర్డులో ఇద్దరు సీనియర్ సభ్యులు తటస్థంగా ఉండటంతో 7-6తో తీర్మానం వీగిపోయింది. కొత్తగా చేరిన సభ్యులు తానా కార్యక్రమాలలో అన్ని విధాలగా పాల్గొనవచ్చు గాని ఈ టర్మ్‌కి మాత్రం వారికీ వోట్ హక్కు ఉండదు అని నిర్ణయించటం జరిగింది.
విభేదాలకు కారణాలు ఏమిటి?
తానాలో అధ్యక్షుడిగా ఎన్నికయిన వ్యక్తి రెండు సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేసి ఆ తరువాత అధ్యక్ష పదవి చేపడుతారని అందరికి తెలిసిన విషయమే. అధ్యక్ష పదవి పూర్తి బాధ్యతలతో కూడిన పని కాబట్టి రెండు సంవత్సరాలు లీడర్ షిప్ లో ఉండి, సంస్టను, సభ్యులను, లక్ష్యాలను, కార్యక్రమాలను అర్ధం చేసుకొని అప్పుడు అధ్యక్ష పదవిని చేపడితే మంచిదని అప్పటిలో పెద్దలు ఆ విధంగా నిర్ణయించారు. అయితే ఈ టర్మ్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయిన వ్యక్తి , రెండేళ్ళ తరువాత వచ్చిన కార్య వర్గ సభ్యులతో కలిసి పని చేయాలి. సంస్థ బైలాస్‌లో వుండే ఈ కారణం వలన కూడా ఇబ్బందులు వస్తాయని అధ్యక్ష పదవికి చేరుకోవాలంటే ఒక టర్మ్ తన కోసం, ఇంకో టర్మ్ తన కార్యవర్గం కోసం ఎన్నికలలో పని చేయాలనీ తెలుస్తోంది.
ముగింపు
తానా అనేది స్వచ్ఛంద సేవా సంస్థ. ఇందులో పదవులు సంపాదించుకోవడానికి గతంలో ఎంతో మంది ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పదవులను పొందేవారు. అలాగే తానా బైలాస్‌ను చాలా జాగ్రత్తగా పెద్దలు ఏర్పాటు చేశారు. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగకుండా పాలకవర్గం తన స్వప్రయోజనాలకు పెద్ద పీట వేయలేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని బ్కెలాస్ను ఏర్పాటు చేశారు. అందువల్లే తానా బైలాస్‌ను మార్చా లన్నా ఎక్కువ మెజారిటీ ఉండాలి. అలాగే ఓ వేళ మార్చినా దానిని ప్రస్తుత టర్మ్‌లో అమలు చేయడం కష్టం కాబట్టి ఇంతకాలం అధ్యక్షులుగా ఉన్నవాళ్లు ఇలాంటి విషయాల జోలికి వెళ్ళలేదు. కాని ప్రస్తుత పాలకవర్గం ఎందుకో తానా బ్కెలాస్ మార్చడంపై చూపిస్తున్న శ్రద్ధను సేవా కార్యక్రమాలపై గట్టిగా చూపించి ఉంటే కోవిడ్ సామాగ్రి దగ్ధమయ్యేది కాదని అంటున్నారు. ఇప్పుడు తానాలో రెండువర్గాలుగా ఉన్నవారు తమ విభేదాలను ఎన్నికల సమయంలో మాత్రమే చూపించుకుంటే బావుంటుందని, సేవా కార్యక్రమాలపై దానిని చూపించరాదని పలువురు కోరుతున్నారు.
తెలుగు టైమ్స్‌కు తానాతో ఎన్నో ఏళ్ళుగా ఉన్న అనుబంధం వల్ల ఇప్పటికైనా పాలకవర్గం, ఎదుటి వర్గం తానా శ్రేయస్సును, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిందిగా కోరుతోంది. ఇప్పటికే ప్రపంచంలో పెద్ద తెలుగు సంఘంగా పేరు తెచ్చుకొన్న తానా, ఇప్పుడు పెరిగిన సభ్యుల సంఖ్యతో మరెన్నో కార్యక్రమాలు, సేవలు చేయొచ్చని గమనించి పెద్ద మనసుతో ముందుకెళ్లాలని కోరుతోంది.
ఎందుకు అవిశ్వాసం పెట్టారు?
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాము కొత్తగా చేర్పించిన వారికి ఓటుహక్కు లభించదన్న విషయం స్పష్టం కావడంతో దీనికి సంబంధించి సవరణలు చేయాలంటే బోర్డులో మెజారిటీ ఉంటేనే లభిస్తుందన్న విషయాన్ని గమనించిన వర్గం వారు, ఇతరులు కలిసి వోటు హక్కుకు వ్యతిరేకంగా ఉన్న బోర్డు సభ్యుల తొలగింపులో భాగంగా ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటరమణ యార్లగడ్డ, కోశాధికారి శ్రీకాంత్ పోలవరపుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి వారిని పదవి నుంచి తొలగించారు. వీరి స్థానంలో శశికాంత్ వల్లేపల్లిని చైర్మన్‌గా చేశారు. విద్యా గారపాటిని సెక్రటరీని చేసి, వినయ్ మద్దినేనిని కోశాధికారిగా ఎన్నుకున్నారు. వీరు బోర్డులో మెంబర్లుగా ఉండటం వల్ల ఈ ఓటు హక్కు విషయంలో తానా బైలాస్‌ను మార్చేందుకు వీలవుతుందని భావించి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోం ది. తానా ఫౌండేషన్‌లో కూడా 15 మంది కార్యవర్గ సభ్యులు ఉండటం, 8 మందితో అవిశ్వాస తీర్మానం జరపటం బాధాకరమైన విషయమే!
అయితే తానా బైలాస్‌లో ఏద్కెనా మార్పులు చేసినా అది ఈ సంవత్సరమే అమల్లోకి రాదు. 2 సంవత్సరాల టర్మ్ అయిన తరువాతనే అమల్లోకి వస్తుంది. తానా పెద్దలు అన్నీ విషయాలను గమనించి, ఆచితూచి ఇలాంటి బైలాస్‌ను అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఒక వర్గం వారు కొత్త సభ్యులకు ఏ విధంగా అయినా ఓటు హక్కు కల్పించాలన్న నిర్ణయంలో భాగంగా ఇలాంటి అవిశ్వాస తీర్మానాలను తీసుకువచ్చారు.
కానీ పదవిని తొలగించ బడిన యార్లగడ్డ వెంకట రమణ, శ్రీకాంత్ పోలవరపు మేరీ ల్యాండ్ కోర్ట్ని ఆశ్రయించటం, తానా బైలాస్, ఇతర వివరాలు సమర్పించటం, మేరీల్యాండ్ కోర్ట్ వెంటనే ఈ తొలగింపు చర్య సరికాదు అని తీర్పు ఇవ్వటం, వెంటనే ఎమర్జెన్సీ సమావేశం జరిపి వారి వారి పడవులను వారికీ అప్పగించటం చకచకా జరిగాయి. ఈ 2-3 వారాలలోనే తెలుగు రాష్ట్రాలలోని దిన పత్రికలలో, టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో ఈ వార్తలన్ని రావటం, సామాన్య ప్రజలు, తానా సభ్యులు ఆశ్చర్య పోవటం, అనేక మంది భాధ పడటం జరిగింది.