రివ్యూ ‌: ఓ సాహస  ప్రయత్నం 'శ్రీకారం'

రివ్యూ ‌: ఓ సాహస  ప్రయత్నం 'శ్రీకారం'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 2.75/5
బ్యానర్  : 14 రీల్స్‌ ప్లస్‌
నటీనటులు :  శర్వానంద్, ప్రియాంకా అరుళ్‌ మోహన్, సీనియర్ నరేష్, సాయికుమార్‌, మురళీ శర్మ,
రావు రమేశ్‌, శిశిర్ శర్మ, ఆమని, సప్తగిరి, సత్య, విశ్వజిత్ జయకర్, తది తరులు నటించారు.
సంగీతం : మిక్కీ జె. మేయర్, సినిమాటోగ్రఫీ : జే యువరాజ్‌
ఎడిటింగ్‌ : మార్తండ్‌ కె వెంకటేశ్, పాటలు: పెంచల్ దాస్, సనాపటి భరద్వాజ్ పాత్రుడు,  
మాటలు: బి.కిశోర్, సాయి మాధవ్ బుర్ర,
నిర్మాతలు : రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, దర్శకత్వం : బి.కిశోర్‌‌
విడుదల తేది : 11. 03. 2021

 

ఒక  రాజకీయ నాయకుడు తన కొడుకును మంత్రిని చేస్తున్నాడు,  ఒక హీరో తన కొడుకుని స్టార్ ని  చేస్తున్నాడు.. ఒక డాక్టర్ తన కొడుకుని మెడికల్ స్పెషలిస్ట్ ని  చేస్తున్నాడు ఒక ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్ చేస్తున్నాడు... కానీ ఒక్క రైతు మాత్రం తన కొడుకుని రైతుని చేయడానికి ఇష్టపడటం లేదు. కారణం  వ్య‌వ‌సాయం అనేది ఈనాడు గ్యాంబ్లింగ్ ల తయారైంది.  క‌రెంటుంటే ఎరువులు ఉండ‌వు. ఎరువులు ఉంటే... నాణ్యమైన విత్తనాలు వుండవు, తీరా పండించిన పంట‌కి మార్కెట్ ఉండ‌దు. ఒకవేళ  మార్కెట్ ఉన్న పంట‌ని మ‌నం పండించడానికి అనుకూల ప‌రిస్థితులు ఉండ‌వు. కానీ రైతుకు  తర  త‌రాలుగా వ్య‌వ‌సాయం త‌ప్ప మ‌రొక‌టి తెలియ‌దు కాబ‌ట్టి అప్పులు చేసి మ‌రీ పొలాల్లో చెమటను దారపోస్తున్నాడు. చివ‌రికి ఆ అప్పులు త‌ప్ప మ‌రేమీ మిగ‌ల‌ని ప‌రిస్థితులు ఎంతోమంది రైతులు ఊళ్ల‌ని వ‌దిలిపెట్టి ప‌ట్ట‌ణాల్లో ర‌క‌ర‌కాల ప‌నులు చేస్తూ క‌నిపిస్తుంటారు. లేదంటే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు.  వ్యవసాయానికి సంబందించిన   అంశాల్ని స్పృశిస్తూ సినిమా తీయ‌డం అంటే నిజంగా ఇది సాహ‌స‌మే. వ్య‌వ‌సాయం నేప‌థ్యంలో సినిమాలు తీయాలంటే ఈ నిర్మాత, దర్శకుడు  ముందుకు రాడు. కానీ ఇటీవ‌ల ద‌ర్శ‌కులు ఈ త‌ర‌హా (మహర్షి లాంటి )క‌థ‌లకీ  వాణిజ్య హంగులు జోడిస్తూ కథలు రాస్తున్నారు.  గతం లో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన 14రీల్స్ అధినేతలు వ్యవసాయం అంటే దేశానికి బలం.. సేద్యం చేయడం మనందరి బాధ్యత అంటూ అధునాతన వ్యవసాయానికి ‘శ్రీకారం’ చుడదాం అంటూ శర్వానంద్ హీరోగా,  బి. కిశోర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ...  వ్యవసాయం నేపథ్యంలో ‘శ్రీకారం’ అనే సోషల్ మెసేజ్ చిత్రంతో ముందుకు వచ్చారు. మహాశివ రాత్రి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం కాన్సెప్ట్ ఎలా ఉంది? శర్వానంద్ మరో హిట్‌కి ‘శ్రీకారం’ చుట్టారా? అన్నది సమీక్షలో చూద్దాం.

కథ:

కార్తీక్ (శర్వానంద్) హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇతని తండ్రి కేశవులు (రావు రమేష్) చిత్తూరు అనంతరాజపురంలో రైతు.  కార్తీక్ తన పనితనంతో ఆఫీస్‌లో అందరి మన్ననలు పొందుతాడు. చైత్ర(ప్రియాంకా అరుళ్‌ మోహన్) ఇతడిని బుట్టలో వేసుకునేందుకు ఎంత ట్రై చేసినప్పటికీ ఆమెను పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంటాడు. ఒక ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించేందుకు డిసైడ్ అవుతుంది. అయితే కార్తీక్‌కి అమెరికా వెళ్లే అవకాశం రావడంతో తండ్రి  కేశవులు పొంగిపోతాడు.  కానీ కార్తీక్ మాత్రం ఉద్యోగం మానేసి వ్యసాయం చేయడానికి తన గ్రామానికి వెళ్తాడు. వ్యవసాయం దండుగ అని వదిలేసిన కొంత మంది రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు. అసలు కార్తిక్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు మళ్లాడు? ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి? ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలను కార్తిక్‌ ఎలా పరిష్కరించాడు? టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మలిచాడు? ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి వ్యవసాయం చేసి ఎలాంటి అద్భుతాలను సృష్టించాడు అన్నదే? మిగతా కథ.

నటి నటుల హావభావాలు:

తన కెరీర్ ప్రారంభం నుండి  విభిన్నమైన కథాంశాలను ఎంచుకునే శర్వానంద్‌ ఈ సినిమాలోనూ నటనతో మెప్పించాడు. కంప్యూటర్‌ ముందు యంత్రంలా పని చేసే యువ సాఫ్ట్‌వేర్‌ పొలంలోకి దిగుతే ఎలా ఉంటుందన్నది కళ్లకు కట్టినట్లు చూపించాడు. స్టాఫ్ వేర్ ఉద్యోగిగా.. రైతుగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. సరైన పాత్ర పడాలే కానీ.. పర్ఫెక్షన్ చూపించడంతో తాను దిట్ట అని శర్వానంద్ మరోసారి నిరూపించాడు. పాత్రకు ఎంత వరకూ అవసరమో అంతే చేస్తూ నేచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో జీవించేశాడు. పరిణితి ఉన్న నటనతో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌లో టక్ చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా మంచి స్టైలిష్‌గా కనిపించిన శర్వానంద్‌. సెకండాఫ్‌లో లుంగీ కట్టి పొలంలో పనిచేసే రైతుగా వేరియేషన్స్ చూపిస్తూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయాడు.  హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్.. చైత్ర పాత్రలో ఆకట్టుకుంది. హీరో వెనుక పడే తుంటరి పిల్ల పాత్రే అయినప్పటికీ కథలో స్కోప్ ఉంది. శర్వానంద్ పక్కన అందంగా కనిపించింది ప్రియాంకా. ఇక శర్వానంద్ తండ్రి పాత్రలో రావు రమేష్ అద్భుత నటనతో మరోసారి మెప్పించారు. మట్టిని నమ్ముకుని ఓడిపోయి,  కుటుంబ బాధ్యతని మోయలేక ఇబ్బంది పడే రైతు పాత్రలో జీవించారు. సీనియర్ నటుడు సాయి కుమార్ ప్రతినాయకుడు ఏకాంబరంగా తన విలక్షణ నటనను చూపించారు. పీచుమిఠాయి అమ్ముకునే వాడు.. ఆ ఊరికి షావుకారుగా ఎలా మారాడన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇక సీనియర్ నటుడు నరేష్ ఎమోషనల్ సీన్స్‌లో జీవించేశాడు. శర్వానంద్ కాంబినేషన్ సీన్స్‌లో నరేష్ తన నటనతో కళ్లు చెమ్మగిల్లేట్టుగా నటించారు. సీనియర్ హీరోయిన్ ఆమని,  హీరో తల్లి పాత్రకి న్యాయం చేసింది. కమెడియన్ సత్య చిత్తూరు యాసతో అదరగొట్టాడు.  సప్తగిరి, మురళీశర్మ ఆయా పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

సాంకేతిక విభాగంలో సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌ల‌కి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ‘ఒక హీరో తన కొడుకును హీరో చేస్తున్నాడు.. ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేస్తున్నాడు.. ఒక ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్ చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్రమే తన కొడుకును రైతు చేయడం లేదు’, ‘తినేవాడు నెత్తి మీద జుట్టంతా ఉంటే.. పండించేవాడు మూతి మీద మీసం అంత లేరు’లాంటి సంభాషణలతో రైతుల దీనగాథను వివరించారు. అలాగే ‘పనిని పట్టి పరువు.. పరువుని పట్టి పలకరింపు’, ‘ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందాం అని అనుకున్నానురా.. ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేం చూసుకోలేకపోతున్నా’అనే డైలాగ్స్‌ యువతను ఆలోచింపజేస్తాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. ద‌ర్శ‌కుడు కిషోర్‌కి ఇది తొలి చిత్ర‌మే అయినా.. తాను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని బ‌లంగా చెప్పాడు. భావోద్వేగాలపై మంచి ప‌ట్టుని ప్ర‌ద‌ర్శించాడు. ఎడిటర్‌ మార్తండ్‌ కె వెంకటేశ్‌  చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్‌ చేస్తే బాగుండనిపిస్తుంది.  సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. యువ‌రాజ్ కెమెరా ప‌నిత‌నం ప‌ల్లెటూరి అందాల్ని మ‌రింత అందంగా చూపించింది. మిక్కీ జె. మేయర్ నేప‌థ్య సంగీతంతోపాటు పాట‌లు బాగున్నాయి. నిర్మాత‌లు ఈ క‌థ‌ని ఎంత న‌మ్మారో నిర్మాణ విలువ‌లు చెబుతాయి.

విశ్లేషణ:

మట్టి వాసనలు, స్వచ్ఛమైన పల్లెటూరి పలకరింపులు, పండుగ సందడులు ఇలా ‘శ్రీకారం’లో మన ఊరి జ్ఞాపకాలు చాలానే కనిపిస్తుంటాయి. కష్టంపడి పనిచేసి పంటను పండించిన రైతు.. తన పంటను అమ్ముకోలేక ఎంతటి కష్టాలు పడుతాడో ఈ  సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే రైతులకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు.. వారిని ఎలా పీక్కుతింటారనేది వాస్తవానికి దగ్గరగా చూపించాడు. మంచి సందేశాత్మక కథ అయినప్పటికీ.. వ్యవసాయం.. రైతు కష్టం.. సొంత ఊరు.. అక్కడ జనం పాట్లు.. సిటీ నుంచి సొంత ఊరికి వచ్చిన హీరో తిరిగి వ్యవసాయం చేయడం అక్కడ మార్పు తీసుకురావడం.. ఇదంతా తెలిసిన సబ్జెక్టే కావడంతో శ్రీకారం కథ కొత్తగా అనిపించడు.  కొత్తదనం లేకపోవడం ఈ సినిమా ప్రధాన లోపం. దానికి తోడు స్లో నెరేషన్‌ కూడా ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది. మొత్తంగా ‘శ్రీకారం’ మంచి సందేశాత్మక మన ఊరి కథ.. కథలో కొత్తదనం లేకపోయినా ఎమోషన్స్‌కి మాత్రం లోటు ఉండదు. ఎక్కడో ఒక చోట ఈ కథకి కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల ఊహను దాటి పోకుండా హీరో స్పీచ్‌తో ముగించడం కూడా రొటీన్ అనిపిస్తుంది. మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా ఛాయలు కొన్ని  శ్రీకారం లో కనిపిస్తుంటాయి. భావోద్వేగాలపై మంచి ప‌ట్టుని ప్ర‌ద‌ర్శించాడు దర్శకుడు . అక్క‌డ‌క్క‌డా డ్ర‌మ‌టిక్‌గా అనిపించే స‌న్నివేశాలున్నా… భావోద్వేగాల‌తో క‌ట్టిప‌డేస్తూ, మ‌రోసారి మ‌న మూలాల్ని గుర్తు చేసే ఓ మంచి ప్ర‌య‌త్న‌మిది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు సిటీ లైఫ్‌కి అలవాటు పడ్డ వాళ్లు చూడాల్సిన సినిమా.

 

Tags :