తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు పై.. సుప్రీంకోర్టులో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు పై.. సుప్రీంకోర్టులో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై వేసిన రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలని విభజన చట్టంలో పొందుపర్చినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోర్టును కోరారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేంద్రం, ఈసీనీ ప్రతివాదులుగా పిటిషన్‌లో చేర్చారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ల ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా ఈ రిట్‌ పిటిషన్‌ను జమ్ము కశ్మీర్‌ నియోజకవర్గాల పిటిషన్‌కు జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. సెప్టెంబర్‌ 29న సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన కేసు విచారణ జరిగే అవకాశం ఉంది.

 

Tags :