సుప్రీంకోర్టు చరిత్రలో ...ఇది మూడవ సారి

భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ మహిళా న్యాయమూర్తులకు అరుదైన అవకాశం కల్పించారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ఇద్దరు మహిళా న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇలా కేవలం మహిళా న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేయడం సుప్రీం కోర్టు చరిత్రలో ఇది మూడవ సారి మాత్రమే. న్యాయమూర్తులు హిమా కోహ్లీ, బేల త్రివేది ధర్మాసనం కేసుల బదిలీకి సంబంధించిన కేసులతో పాటు మ్యాట్రిమోనియల్ కేసులను కూడా విచారిస్తుంది. వాటిలో వివాహ వివాదాలకు సంబంధించిన 10 బదిలీ పిటిషన్లు, 10 బెయిల్ అంశాలు ఉన్నాయి. చివరగా 2013లో న్యాయమూర్తులు జ్ఞాన్ సుధా మిశ్రా, రంజనా ప్రకాశ్ దేశాయ్తో సర్వోన్నత న్యాయస్థానం మహిళా ధర్మసనాన్ని ఏర్పాటు చేసింది. కాగా, ప్రస్తుతం సుప్రీం కోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. జస్టిస్ హిమా కోహ్లి, బేల త్రివేది, బివి నాగరత్న ఉన్నారు. జస్టిస్ బి.వి. నాగరత్న 2027లో 36 రోజుల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేయనున్నారు. ఇక సుప్రీం కోర్టులో 34 మంది న్యాయమూర్తులు అవసరం ఉండగా, ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు పని చేస్తున్నారు.