తానా వారి ‘గ్రంథాలయం’ -తెలుగు భాషా పరిరక్షణా నిలయం

తానా వారి ‘గ్రంథాలయం’ -తెలుగు భాషా పరిరక్షణా నిలయం

చిరిగిన చొక్కా వేసుకున్నా ఫర్వాలేదు.. కానీ మంచి పుస్తకం చదువు.. అన్న ఒక మంచి మాట తెలియని తెలుగు ప్రజలుండరు. పుస్తకం ఇచ్చే విజ్జానం..పంచే సంస్కృతి..తెచ్చే చైతన్యం గురించి తెలిసే మహా మేధావులు ఆనాడు సైతం ఈ మంచినానుడి చాటి చెప్పారు. అయితే మాతృభూమిని వీడి ఖండాంతరాలు దాటినా మాతృభాష మీద మమకారం ఎవరికీ తగ్గదు. దేశ విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా మాతృభాష పరిరక్షణ, ప్రోత్సాహం కోసం సంకల్పించింది. పాఠకులలో విజ్జానం పెంచి, ప్రజలను చైతన్యవంతం చేసేది సాహిత్యం మాత్రమే. అందుకే తానా(తెలుగు అసొసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా)-కాపిటల్‌ రీజియన్‌ మరో ముందడుగు వేసింది. తెలుగు సాహిత్యాన్ని పెంపొందించడం కోసం తానా’ వారి ‘గ్రంథాలయం’ ఏర్పాటు చేసి దానిని తెలుగు భాషా పరిరక్షణా నిలయంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది.

తెలుగు సాహిత్య విజ్జాన ఆలోచనలతో నాంది వాక్యం పలుకుతూ వాషింగ్టన్‌ డీసీ మెట్రో ఏరియాలో మొదటిగా తన గుర్తింపుని చాటుకుంటూ ఈ సరిక్రొత్త ఆలోచనకు తెరతీసింది ‘తానా కాపిటల్‌ రీజియన్‌ ‘. తెలుగు భాషను పరిరక్షించాలన్న ఆకాంక్షతో ఈ తెలుగు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. తానా వారి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని శనివారం అక్టోబర్‌ 2, 2021 నూతన తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభిస్తున్నారు.

కంప్యూటర్‌ కీ బోర్డు పై మీటలు నొక్కటం అలవాటైన చేతులతో మళ్లీ పుస్తకాలు పట్టించి, పుటలు తిప్పించి తెలుగు పుస్తకాల పూర్వవైభవానికి పునాది వేస్తున్నాం. మొదటి విడతగా చిన్నారులకు ,పెద్దలకు సంభందించిన వివిధ అంశాలతో కూడుకున్న వెయ్యి తెలుగు సాహిత్య పుస్తకాలను పొందుపరుస్తున్నారు.

 

Tags :