తానా వికలాంగుల క్రికెట్ పోటీలు...విజేత ఆంధ్ర టీమ్

తానా వికలాంగుల క్రికెట్ పోటీలు...విజేత ఆంధ్ర టీమ్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వికలాంగుల క్రికెట్‌ పోటీలను ఏర్పాటు చేశారు. తానా క్రీడా కార్యదర్శి శశాంక్‌ యార్లగడ్డ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను విశాఖపట్టణంలో ప్రారంభించారు. వికలాంగులలో మనోస్థైర్యాన్ని పెంపొందించేలా  ‘డిఫరెంట్లీ ఏబుల్డ్‌ వీల్‌ ఛైర్‌ కప్‌’ పేరుతో ఈ క్రికెట్‌ పోటీలను నిర్వహించారు. ఈ రాష్ట్ర స్థాయి దివ్యాంగుల వీల్‌చైర్‌ క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర జట్టు విజయం సాధించింది. విశాఖ జిల్లా పరిషత్‌ క్రీడా మైదానంలో తానా కప్‌ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో ఆఖరి రోజున తెలంగాణ జట్టుపై ఆంధ్ర జట్టు 132 పరుగుల తేడాతో గెలుపొందింది. 15 ఓవర్ల ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన తెలంగాణ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేసింది. ఆంధ్ర జట్టు ఆటగాడు దోని లక్ష్మణ్‌ 33 బంతుల్లో 70 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. విజేత జట్టుకు అతిథులు ట్రోఫీ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దివ్యాంగ క్రీడాకారుల కోసం ప్రత్యేక స్టేడియం ఏర్పాటుకు విశాఖలో స్థలం కేటాయించినా పనులు మాత్రం జరగడం లేదన్నారు. టోర్నీ నిర్వాహక కార్యదర్శి రుక్మాకరరావు మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో విజేతగా నిలిచిన టీమ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తానా క్రీడా కార్యదర్శి శశాంక్‌ యార్లగడ్డ, డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, జనసేన నేతలు శివశంకర్‌, డాక్టర్‌ బి.రఘు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :