తెలుగు రాష్ట్రాలకు తానా 25 కోట్ల విరాళం- యార్లగడ్డ వెంకటరమణ

తెలుగు రాష్ట్రాలకు తానా 25 కోట్ల విరాళం- యార్లగడ్డ వెంకటరమణ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తెలుగు రాష్ట్రాల్లోని సేవా కార్యక్రమాలకు పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు కోసం రూ.25 కోట్ల విరాళం అందించనున్నట్లు తానా ఫౌండేషన్‍ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకటరమణ ప్రకటించారు. అమెరికాలోని నార్త్ వెస్టర్స్ హాస్పటల్‍ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పారు.  

తానా ఫౌండేషన్‍-నార్త్ వెస్టర్న్ మెడిసిన్‍ ప్రాజెక్టు ద్వారా 3.8మిలియన్ల(సుమారు రూ.25కోట్లు) విలువ చేసే వైద్య పరికరాలు, వైద్య యంత్రాలను అందించనున్నామని ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని అందించనున్నట్లు చెప్పారు. ప్రత్యేక కార్గో షిప్‍మెంట్‍ ద్వారా ఈ పరికరాలు రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాలకు చేరతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం తానా కోశాధికారి కొల్లా అశోక్‍ బాబు, తానా సమన్వయకర్త పద్మశ్రీ ముత్యాల ఎంతో కృషి చేశారని చెప్పారు. తానా ఫౌండేషన్‍ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు, చేయూత ప్రాజెక్టు ద్వారా పేద విద్యార్థులకు ల్యాప్‍ ట్యాప్‍లు, తానా ఫౌండేషన్‍-ఆదరణ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచితంగా మూడుచక్రాల వాహనాలు, స్టెమ్‍ పథకం ద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సామాగ్రి, ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ, రైతులకు చిన్నపాటి ఆధునిక యంత్రాలివ్వడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

 

Tags :