తెలుగు రాష్ట్రాల్లో ఫౌండేషన్‌ సేవలు విస్తృతం చేస్తాం...

తెలుగు రాష్ట్రాల్లో ఫౌండేషన్‌ సేవలు విస్తృతం చేస్తాం...

తెలుగు టైమ్స్‌ ఇంటర్వ్యూలో తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకటరమణ యార్లగడ్డ

తెలుగు రాష్ట్రాల్లోని పేద పిల్లలకు, అనాధలకు, వికలాంగులకు, ఇతర ఎన్‌జివో సంస్థలకు తానా ఫౌండేషన్‌ ద్వారా మరిన్ని సేవలందించి ఫౌండేషన్‌ కార్యక్రమాలను విస్తృతపరుస్తామని తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకటరమణ యార్లగడ్డ తెలుగుటైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

గుంటూరు జిల్లా రేపల్లె మండలం వెనిగళ్లవారిపాలెంకు చెందిన యార్లగడ్డ వెంకటరమణ మిస్సిస్సిప్పి రాష్ట్రంలోని మేడిసన్‌లో నివసిస్తున్నారు. 2007`09 మధ్య తానా మిడ్‌వెస్ట్‌ ప్రాంతీయ ప్రతినిధిగా పనిచేసిన ఆయన 2009-11 మధ్య తానా ఫౌండేషన్‌ కార్యదర్శిగా వ్యవహరించి తానా ఫౌండేషన్‌ ఇండియా విభాగ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. 2011 నుండి ఆయన తానా ఫౌండేషన్‌లో పలు ప్రాజెక్టుల నిర్వహణలో పాలుపంచుకున్నారు. 2011 నుండి ఇప్పటివరకు ఇండియా విభాగం ఫౌండిరగ్‌ ట్రస్టీగా సేవాకార్యక్రమాల నిర్వహణలో పాల్గొంటున్నారు. 2013 నుంచి 2019 వరకు మాతృభూమిలో పెద్దఎత్తున ఉచిత కంటి వైద్యశిబిరాలను నిర్వహించారు. మరోవైపు అమెరికాలో కూడా తానా సేవ, సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వస్తున్నారు. బ్యాక్‌ ప్యాక్‌ డిస్ట్రిబ్యూషన్‌ తదితర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. కోవిడ్‌ టైంలో ఇండియాలో ఉన్న యార్లగడ్డ మాస్క్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. 2009 లో మిడ్‌వెస్ట్‌ ప్రాంతీయ ప్రతినిధిగా చికాగోలో జరిగిన తానా మహాసభలలో చురుకైన పాత్ర పోషించారు. అంచెలంచెలుగా ఎదిగిన యార్లగడ్డ వెంకట రమణ 2019-23 కాలానికి ఫౌండేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 

తానాలో తన పదవీకాలంలో మెజార్టీ భాగం ఫౌండేషన్‌లోనే గడిచిందని, ఆ అనుభవాలను వినియోగిస్తూ ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాల వ్యాప్తికి కృషి చేయడమే తన లక్ష్యమని చెబుతూ, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరిలావు, బోర్డ్‌ చైర్మన్‌ హనుమయ్య బండ్లతో కలిసి తానా ఫౌండేషన్‌ ట్రస్టీలను కలుపుకుని ఫౌండేషన్‌ కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతానని చెప్పారు.

తానా ఫౌండేషన్‌ కార్యక్రమాలు వివరిస్తారా?

తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు, పిల్లలకు సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా ఫౌండేషన్‌ ఏర్పాటైంది. దాతల సహకారంతో, సొంతంగా కొన్ని పథకాలతో తానా ఫౌండేషన్‌ కార్యక్రమాలను చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కంటిలోపంతో ఇబ్బంది పడుతున్న పేదలకోసం వివిధ చోట్ల కంటి శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయడంతోపాటు మందులను, అద్దాలను పంపిణీ చేస్తోంది. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ ద్వారా క్యాన్సర్‌ పేషంట్లను గుర్తించి వారికి కావాల్సిన వైద్య సహాయాన్ని అందిస్తోంది. వారధి కార్యక్రమం ద్వారా అనాథ పిల్లలకు కావాల్సిన విద్య, వసతి సౌకర్యాలను కల్పించి వారిని ఆదుకుంటోంది. ఆదరణ కార్యక్రమం ద్వారా వికలాంగులకు అవసరమైన ట్రై సైకిళ్ళను పంపిణీ చేస్తోంది. చేయూత కార్యక్రమం ద్వారా పేద పిల్లలకు ల్యాప్‌టాప్‌లను అందిస్తోంది. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి వారి చదువును కొనసాగించేందుకు సహాయాన్ని అందిస్తోంది. హైస్కూల్‌ చదువుల నుంచి ఇంజనీరింగ్‌, మెడికల్‌ చదువుతున్న విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్‌లను తానా ఫౌండేషన్‌ ఇస్తోంది.

అలాగే దాతల సహాయంతో మరిన్ని కార్యక్రమాలను కూడా తానా ఫౌండేషన్‌ చేస్తోంది. దాతలు కోరుకున్నట్లుగా వారి స్వస్థలాల్లో సహాయ కార్యక్రమాను తానా ఫౌండేషన్‌ నిర్వహిస్తోంది. 

కొత్త కార్యక్రమాల గురించి వివరిస్తారా?

తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇప్పుడు కొత్త కార్యక్రమాలను కూడా చేపట్టాము. అందులో ముఖ్యమైనది చికాగోలో ఉన్న నార్త్‌వెస్టర్న్‌ మెడికల్‌ ప్రాజెక్టు ద్వారా తెలుగు రాష్ట్రాలకు భారీ సహయాన్ని అందిస్తున్నాము. తానా ఫౌండేషన్‌-నార్త్‌ వెస్టర్న్‌ మెడిసిన్‌ ప్రాజెక్టు ద్వారా 3.8మిలియన్ల(సుమారు రూ.25కోట్లు) విలువ చేసే వైద్య పరికరాలు, వైద్య యంత్రాలను అందించనున్నాము. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఆయా ప్రభుత్వాల ద్వారా పంపిణీ చేయనున్నాము. ప్రత్యేక కార్గో షిప్‌మెంట్‌ ద్వారా ఈ పరికరాలు రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాలకు చేరుతాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన షిప్పింగ్‌ కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం తానా కోశాధికారి కొల్లా అశోక్‌, తానా సమన్వయకర్త ముత్యాల పద్మశ్రీలు ఎంతో కష్టపడ్డారు. పెద్దఎత్తున ఉన్న ఈ వైద్య పరికరాలను అనేక కంటైనర్లలో తెలుగు రాష్ట్రాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమవుతోందని అంటూ, దసరా, సంక్రాంతి మధ్య తెలుగు రాష్ట్రాలకు ఇవి అందుతాయి. 

స్టెమ్‌ పథకం ద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సామాగ్రి, ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ వంటివి అందించనున్నాము. రూరల్‌ విలేజ్‌లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ జరుగుతుండటంతో ల్యాప్‌టాప్‌లను కూడా ఇవ్వనున్నాము. అమెరికాలోని విద్యార్థులతో, అక్కడి చదువుల గురించి ఇక్కడి విద్యార్థులకు తెలియజేసేలా స్టూడెంట్‌ కనెక్ట్‌ కార్యక్రమం కూడా చేస్తున్నాము. దీనివల్ల వారికి అమెరికా చదువుల గురించి అవగాహన ఏర్పడటంతో వారి విద్యాభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది. 

ఆరుణ్య పథకం ద్వారా మూగ, బధిరుల పిల్లలకోసం స్క్రీనింగ్‌ క్యాంప్‌ నిర్వహించి వైద్య సహాయాన్ని అందిస్తున్నాము. ఇలా కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తానా ఫౌండేషన్‌ ద్వారా సహాయపడనున్నాము. 

తెలుగుటైమ్స్‌ ద్వారా మీరిచ్చే సందేశమేమిటి?

తానా ఫౌండేషన్‌ అనేది సేవలందించడానికి ఏర్పడిన సంస్థ. ఇందులో రాజకీయాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు తావులేదు. అందువల్ల దాతలు ఫౌండేషన్‌కు విరాళం ఇవ్వడం ద్వారా వారిచ్చిన విరాళాన్ని సద్వినియోగం అయ్యేలా తానా ఫౌండేషన్‌ చేస్తుంది. ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు అందరూ సహాయ సహకారాలను అందించాలని, ఇందుకు దాతలు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. 

 

Tags :