వేసవిలో తెలుగువారికి 3 మహాసభలు

వేసవిలో తెలుగువారికి 3 మహాసభలు

అమెరికాలో తెలుగువాళ్ళ సంఖ్య తొలుత వందలు ఉండేవి. తరువాత వేలల్లోకి మారింది. ఇపుడు లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ జనాభాకు తగ్గట్టుగా తెలుగు సంఘాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అటు జాతీయ సంఘాలు, ఇటు ప్రాంతీయ తెలుగు సంఘాల సంఖ్య నేడు వందల్లోకి చేరుకుంది. మొదటల్లో జాతీయ తెలుగు సంఘాలు తొలుత 2 ఉండేవి నేడు అవి 7కి చేరుకుంది. అలాగే ప్రాంతీయ తెలుగు సంఘాల సంఖ్య లెక్కల్లేదు. దీనికి తోడు తెలంగాణ తెలుగు సంఘాల సంఖ్య కూడా చేరడంతో తెలుగువారికి అమెరికాలో ఎక్కువగానే సంఘాలు ఉన్నట్లు చెప్పవచ్చు. జాతీయ తెలుగు సంఘాలు ప్రతి రెండేళ్ళకోమారు మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటాయి. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు సంతతి వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడం, మాతృభూమితో వారి బంధాన్ని పటిష్టం చేయడంకోసం ఈ మహాసభలను జాతీయ తెలుగు సంఘాలు ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహిస్తుంటాయి. ఈ జాతీయ మహాసభలు జరుగుతున్నా యంటే అమెరికాలో ఉన్న తెలుగు కుటుంబాల్లో సంతోషం కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ మహాసభలు జరిగే మూడురోజులు ఎల్లెడలా కనిపించే తెలుగు వాతావరణం, తెలుగు వంటకాలు, ఇండియా నుంచి వచ్చేవారి తెలుగు మాటలు, ప్రసంగాలు, కార్యక్రమాలు వినడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాంతోపాటు ఎంతోమంది ప్రముఖులను సినిమా నటీనటులను, ఇతరులను ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఈ మహాసభల ద్వారా కలుగుతుంది. రాజకీయరంగంతోపాటు వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులను స్వయంగా కలుసుకుని పలకరించే అవకాశం కూడా ఈ వేడుకల ద్వారా ఉండటంతో ఎంతోమంది ఈ మహాసభలకు హాజరవుతుంటారు. జాతీయ తెలుగు సంఘాలు నిర్వహించే ఈ మహాసభలు వస్తున్నాయంటే అక్కడ ఉన్న తెలుగువారంతా తమ ఇంటి పండుగ వస్తోందని భావిస్తుంటారు.

కోవిడ్‌ కారణంగా గతంలో కొన్ని సంఘాలు తెలుగు మహాసభలను నిర్వహించలేకపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు మారడంతో వచ్చే సంవత్సరం సమ్మర్‌లో మహాసభలను నిర్వహించాలని జాతీయ తెలుగు సంఘాలైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా), నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) నిర్వహించాయి. తానా తన మహాసభలను ఫిలడెల్ఫియాలో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తోంది. నాటా మహాసభలు జూన్‌ 30 నుంచి 2 జూలై వరకు డల్లాస్‌లో జరగనున్నది. నాట్స్‌ మహాసభలు మే 26 నుంచి 28 వరకు న్యూజెర్సిలో  నిర్వహించనున్నారు.

తానా మహాసభల వేదిక... పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ 

దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఫిలడెల్ఫియా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల 2023 జులై 7 నుండి 9 వరకు జరగనున్నాయి. నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌ను తానా మహాసభల వేదికగా నిర్ణయించారు. ఈ మహాసభలకు కన్వీనర్‌గా  పొట్లూరి రవి వ్యవహరిస్తున్నారు.  అన్ని సౌకర్యాలతో అందరికీ అందుబాటులో ఉన్నపెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే 23వ తానా మహాసభలను తానా నాయకత్వం, స్థానిక తెలుగు ప్రజలు, దాతల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా నవంబర్‌ 5వ తేదీనాడు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వార్మిన్స్టర్‌ నగరంలోని ఫ్యూజ్‌ బ్యాంక్వెట్‌ హాల్లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమానికి అంచనాలకి మించిన స్పందన లభించింది. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్‌ పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విరాళాల సేకరణ విందుకు ఎనిమిది వందల మందికి పైగా ప్రవాసులు హాజరయ్యారు. గతంలో జరిగిన అన్ని విరాళాల సేకరణని మించిపోయేలా దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయల (ఆరు మిలియన్ల డాలర్లు) విరాళాలు ఈ కార్యక్రమంలో వచ్చింది. తానా మాజీ అధ్యక్షులు జయ్‌ తాళ్లూరి, సతీష్‌ వేమన, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ నిరంజన్‌ శృంగవరపుతోపాటు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, బోర్డ్‌ చైర్మన్‌ హనుయ్య బండ్ల, సభ్యులు, ఫౌండేషన్‌ కమిటీ చైర్మన్‌ వెంకటరమణ యార్లగడ్డ, సభ్యులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఎడిసన్ వేదికగా నాట్స్ మహాసభలు 

ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాల కోసం సన్నాహాలు ఇటీవల ఘనంగా ప్రారంభమయ్యాయి. 2023 మే 26 నుండి 28 వరకూ న్యూ జెర్సీ ఎక్స్పో సెంటర్‌, ఎడిసన్‌లో జరుగనున్న ఈ అమెరికా తెలుగు సంబరాలకు అందరినీ సన్నద్ధం చేసేలా ఇటీవల నిర్వహించిన కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌కు తెలుగు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. న్యూజెర్సీలోని ఎడిసన్‌ వేదికగా జరిగిన ఈ కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌కు వందల మంది తెలుగు ప్రజలు హాజరయ్యారు. నాట్స్‌ అధ్యక్షులు బాపు నూతి 7వ నాట్స్‌ అమెరికా సంబరాలు 2023 మే 26 నుండి 28 వరకూ న్యూ జెర్సీలో జరుగనున్నట్టు ప్రకటించి, అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్‌ శ్రీధర్‌ అప్పసానిని సభకి పరిచయం చేసారు. ఈ సందర్భంగా ‘‘భాషే రమ్యం సేవే గమ్యం’’ అనే నినాదంతో స్థాపించబడిన నాట్స్‌ సంస్థ సేవకి, భాషకి సమ ప్రాధాన్యతనిస్తూ చేస్తున్న అనేక సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను, వైద్య శిబిరాలు, కంటి శిబిరాలు  ద్వారా అమెరికాలో మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న సేవలను వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాట్స్‌ జాతీయ కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేసారు. నాట్స్‌ చైర్‌ వుమన్‌ అరుణ గంటి, సంబరాలు కో కన్వీనర్‌ వసుంధర దేసు, బిందు ఎలమంచిలి, స్వాతి అట్లూరి, ఉమ మాకం, గాయత్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుజాతికి నాట్స్‌ అండగా ఉంటుందనేది అనేక సంఘటనలు నిరూపించాయని నాట్స్‌ చైర్‌ వుమెన్‌ అరుణ గంటి అన్నారు. సంబరాల కోర్‌ కమిటీ సభ్యులైన  రాజేంద్ర అప్పలనేని - కో కన్వీనర్‌, వసుంధర దేసు - కో కన్వీనర్‌, రావు తుమ్మలపెంట (టిపి) - కోఆర్డినేటర్‌, విజయ్‌ బండ్ల - కోఆర్డినేటర్‌, శ్రీహరి మందాడి - డిప్యూటీ కన్వీనర్‌, రాజ్‌ అల్లాడ - డిప్యూటీ కన్వీనర్‌, శ్యామ్‌ నాళం - కాన్ఫరెన్స్‌ సెక్రటరీ, చక్రధర్‌ వోలేటి-కాన్ఫరెన్స్‌ ట్రెజరర్‌, రంజిత్‌ చాగంటి-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆపరేషన్స్‌లను సభకు పరిచయం చేసారు.

వచ్చే ఏడాది మేలో జరగనున్న 7వ అమెరికా తెలుగు సంబరాల కోసం నాట్స్‌ తెలుగువారిని సన్నద్ధులను చేసే క్రమంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించింది.  ఈ సారి నాట్స్‌ తెలుగు సంబరాలు న్యూజెర్సీ వేదికగానే అంగరంగ వైభవంగా జరిపేందుకు నాట్స్‌ ఏర్పాట్లు చేస్తోంది. నాట్స్‌ ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగువారి నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్‌  శ్రీధర్‌ అప్పసాని అన్నారు.  తెలుగు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టేలా తాము శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. సంబరాల అంటే కేవలం విందు, వినోదమే కాకుండా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సాటి వారికి సాయం చేసేలా సేవా దృక్పథం.. ఇవన్నీ కలగలసి ఉంటాయని శ్రీధర్‌ అప్పసాని అన్నారు. మరుగున పడుతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించనున్నామని శ్రీధర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో నాట్స్‌ ప్రెసిడెంట్‌ బాపయ్య చౌదరి(బాపు) నూతి, నాట్స్‌ చైర్‌ వుమన్‌ అరుణ గంటి, డిప్యూటీ చైర్మన్‌ ప్రశాంత్‌ పిన్నమనేని, బోర్డు సెక్రటరీ శ్యామ్‌ నాళం, నాట్స్‌ గౌరవ బోర్డ్‌ సభ్యులు డా.రవి ఆలపాటి, శేఖరం కొత్త,  బోర్డ్‌ అఫ్‌ డైరెక్టర్స్‌ రాజ్‌ అల్లాడ, మోహన్‌ కృష్ణ మన్నవ, శ్రీహరి మందాడి, వంశీకృష్ణ వెనిగళ్ల, చంద్రశేఖర్‌ వెనిగళ్ల, నాట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సెక్రటరీ రంజిత్‌ చాగంటి, నాట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల,  వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌ ఫైనాన్స్‌) భాను ధూళిపాళ్ల,  వైస్‌ ప్రెసిడెంట్‌ (ప్రోగ్రామ్స్‌) హరినాథ్‌ బుంగటావుల, వైస్‌ ప్రెసిడెంట్‌ (సర్వీసెస్‌), మదన్‌ పాములపాటి, జోనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(నార్త్‌ ఈస్ట్‌) గురు కిరణ్‌ దేసు, ఇమ్మిగ్రేషన్‌ అసిస్టెన్స్‌ - సూర్య గుత్తికొండ హాజరయ్యారు.

డల్లాస్ లో నాటా మహాసభలు 30 జూన్ - 2 జులై 2023

అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మహాసభలు జూన్‌ 30, జులై 1-2  2023లో డాలస్‌లో జరగనున్నాయి. దీనిని పురస్కరించుకుని ఇటీవల డల్లాస్‌లో బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. అమెరికా నలుమూలల నుండి నాటా కార్యవర్గ సభ్యులు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ మరియు వివిధ ప్రతినిధులు హాజరయ్యారు.  ఈ సమావేశానికి నాటా అడ్వైజరీ కౌన్సిల్‌ గౌరవ చైర్మన్‌ డాక్టర్‌ ప్రేమ్‌ రెడ్డి ప్రత్యేక అతిధిగా విచ్చేయగా, డాక్టర్‌ కొర్సపాటి శ్రీధర్‌ రెడ్డి(అధ్యక్షులు), డాక్టర్‌ ఆదిశేషా రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్‌ చైర్మన్‌), డాక్టర్‌ గోసల రాఘవ రెడ్డి(మాజీ అధ్యక్షులు), డాక్టర్‌ సంజీవ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యులు), హరి వేల్కూర్‌(కాబోయే అధ్యక్షులు), ఆళ్ళ రామి రెడ్డి (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి), శ్రీనివాస్‌ సోమవరపు(కోశాధికారి), మందపాటి శరత్‌ రెడ్డి(సంయుక్త కార్యదర్శి), సతీష్‌ నరాల (సంయుక్త కోశాధికారి)తో పాటు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, బోర్డు సభ్యులు, స్టాండిరగ్‌ కమిటీ చైర్స్‌, రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌, రీజినల్‌ కోఆర్డినేటర్స్‌  తదితర నాయకులు పాల్గొన్నారు. నాటా మెగా కన్వెన్షన్‌కు రానున్న పదిహేను వేల మంది అతిధులకు  కల్పించే  సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు.  నిధుల సేకరణ విందులో పాల్గొన్న ఏడు వందల పైగా పలువురు దాతలు కనీవిని ఎరుగని రీతిలో రెండు మిలియన్ల ఆరు వందల వేల డాలర్లు (2,600,000) ఇస్తామని నాటాకు వచ్చిన హామీ అమెరికాలో రికార్డు సృష్టించింది. ఈ విధంగా నిధుల సేకరణకు విశేష కృషి చేసిన డాక్టర్‌ కొర్సపాటి శ్రీధర్‌ రెడ్డిని నాటా కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించింది. వివిధ రాష్టాల నుండి వచ్చిన నాటా కార్యవర్గ సభ్యులను గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి) నిధుల సేకరణ విందులో పాల్గొన్న దాతలను పరిచయ చేశారు. ఈ కార్యక్రమాన్ని గిరీష్‌ రామిరెడ్డి (కన్వీనర్‌), బూచిపూడి రామి రెడ్డి (కోఆర్డినేటర్‌), కృష్ణ కోడూరు (కో కన్వీనర్‌), భాస్కర్‌  గండికోట (కో కోఆర్డినేటర్‌), రమణ రెడ్డి క్రిస్టపాటి(డిప్యూటీ కన్వీనర్‌), మల్లిక్‌ ఆవుల (డిప్యూటీ కోఆర్డినేటర్‌), రవీంద్ర అరిమండ (బోర్డు సభ్యుడు), వీరా రెడ్డి వేముల, దర్గా నాగిరెడ్డి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), పుట్లూరు రమణ(బోర్డు సభ్యుడు), చెన్నా రెడ్డి, మోహన్‌ రెడ్డి మల్లంపాటి, ప్రసాద్‌ చొప్ప నిర్వహించి విజయవంతం అయ్యేలా చూశారు.

Tags :