ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 175వ సాహితీ సదస్సు

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 20న జరిగిన 175వ సాహితీ సదస్సు ఫిబ్రవరి 20న డాలస్లో ఆసక్తికరంగా సాగింది. చిన్నారి భవ్య వినాయకుడి మీద ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారు ముఖ్య అతిథి శ్రీమతి కొమరవోలు సరోజ గారిని పరిచయం చేశారు. కొమరవోలు సరోజ గారు తన ప్రసంగంలో ‘‘అందరినీ ఆకట్టుకునే కథా రచన - ఒక కథా రచయిత్రి మనోభావాలు’’ అన్న అంశంపై చక్కగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. వారి రచనలలో పేరు గడిరచిన ‘‘గాదిరి కోడలు’’ కథను చెప్తూ అందరినీ నవ్వులతో ముంచెత్తారు.
శ్రీమతి కాశీనాథుని రాధ గారు పద్య సౌగంథం శీర్షికన భాగవతంలో నుండి చక్కని పద్యాన్ని వినిపించారు. లెనిన్ వేముల గారు మయూరుని శతకం గురించి వివరిస్తూ మాఘమాసం నాడు సూర్య భగవానుడి పై గల భక్తి ఆరాధన భావాలు వివరించారు.తరువాతి అంశంగా ‘‘మనతెలుగు సిరి సంపదలు’’ ధారావాహిక లో భాగంగా ఊరిమిండి నరసింహారెడ్డి గారు పొడుపు కథలు, జాతీయాలు, సంఖ్యా బోధక పదాలను సభ్యులకు గుర్తుచేశారు. మాసానికో మహనీయుడు శీర్షిక కింద శ్రీమతి అరుణ జ్యోతి గారు ఈ నెలలో గుర్తు చేసుకోవలసిన ప్రముఖ రచయితల గురించి వివరించారు. సమన్వయ కర్త కుప్పాచి శ్రీనివాసులు బసాబత్తిన గారు ముఖ్య అతిధి జ్ఞాపిక చదివి వినిపించారు.
సంఘం అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి గారు ముఖ్య అతిథి శ్రీమతి కొమరవోలు సరోజ గారికి, ప్రార్థనా గీతం పాడిన భవ్య తోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.