ఘనంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు

ఘనంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు

అత్యంత వైభవోపేతముగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) దీపావళి వేడుకలను తెలుగు సంస్కృతికీ తెలుగు భాషకీ పట్టంకట్టే టాంటెక్స్ అధ్యక్షులు శ్రీమతి లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి గారు తమ కార్యవర్గ బృందంతో కలిసి చక్కగా నిర్వహించారు.

దీపావళి వేడుకలు 2021 నవంబరు 13వ తేదీన టెక్సాస్ రాష్ట్రములో ఫ్రిస్కో మహా నగరం ఇండిపెండెన్స్ హైస్కూలు ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. టాంటెక్స్ అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి తమ కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రముఖులైన ప్రత్యేక ఆహ్వానితులనూ మరియు ఆహూతులను సాదరముగా ఆహ్వానించి ఈ దీపావళి వేడుకలను రంగ రంగ వైభోగముగా నిర్వహించారు. ఏపిక్ సరితా ఈదర గారి నేతృత్వములో సభాప్రాంగణమంతా రంగురంగుల అలంకరణలతో శోభాయమానంగా వెలుగొందింది. దీపావళి సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్నము 3:00 గంటలకు మొదలై రాత్రి 7:00 గంటల వరకూ నిర్విరామముగా కొనసాగాయి. అమెరికా జాతీయ గీతము ఆలపించడం మరియు గణేశస్తుతితో ప్రారంభించిన కార్యక్రమాలకు స్రవంతి ఎర్రమనేని సంధాన కర్తగా వ్యవహరించారు. వ్యాఖ్యాత మరియు గాయకురాలు మధు నెక్కంటి తన కోయిల స్వరం తో గాన మాధుర్యంతో ఎంతో అద్భుతంగా శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.

నేపధ్య గాయకులు అర్జున్ అడపల్లి, శృతి నండూరి, శ్రీకాంత్ లంకా గార్లు పాడిన వీనుల విందైన సుమధుర గీతాలు మరియు స్థానిక కళాకారుల శాస్త్రీయ నృత్యాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి.  ఈ సందర్భంగా మన టాంటెక్సు సంస్థకు అన్నిరకాలుగా తమవంతు సహాయ సహకారాలను అందిస్తున్న ప్రత్యేక ఆహ్వానితులు ఫ్రిస్కో సిటీ మేయరు జెఫ్ చెనీ గారినీ, ఫ్రిస్కో సిటీ ప్రొటెం మేయరు బిల్ వుడ్ వర్డ్ గారినీ, ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ మెంబరు జాన్ కీటింగ్ గారినీ, ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ ఉమన్ ఎంజెలీయా పెహ్లాము గారినీ, ఫ్రిస్కోసిటీ బోర్డు ఆఫ్ ట్రస్టీ గోపాల్ పోణంగి గారినీ, ఫ్రిస్కో సిటీ పార్కులు మరియు రిక్రియేషన్ బోర్డు మెంబర్. వేణు భాగ్యనగర్ గారినీ, ఫ్రిస్కో సిటీ అర్బన్ ఫారెస్ట్రీ బోర్డు మెంబరు పవన్ రాజ్ నెల్లుట్ల గారినీ, ఫ్రిస్కో ఇంక్లూషన్ కమిటి చెయిర్ సునీత చెరువు గారినీ ఘనంగా సన్మానించడమైనది.

అనంతరం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి మాట్లాడుతూ ఈరోజు మంచి ఆహూతులకు రుచికరమైన భోజనాన్ని అందించిన “బావార్చి” కిషోర్ కంచెర్ల గారిని ప్రత్యేకముగా అభినందించారు. ఈ నాటి కార్యక్రమం జయ ప్రదంకావడానికి సహకరించిన ఈవెంట్ కోఆర్డినేటర్ స్రవంతి ఎర్రమనేని గారినీ, వసతి మరియు లాజిస్టిక్స్ వ్యహహారాన్ని సమర్ధవంతముగా నిర్వహించిన ట్రెజరర్ చంద్ర పొట్టిపాటి గారినీ, మంచి సౌండ్ సిస్టం అందచేసిన కల్చరల్ చెయిర్ సురేష్ పతనేని గారిని, మెంబర్ షిప్ చెయిర్ సుబ్బా రెడ్డి కొండు గారినీ, ఫుడ్ కమిటీ చెయిర్ ఉదయ్ కిరణ్ నిడిగంటి గారినీ సంస్థ అధ్యక్షులు శ్రీమతి లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి గారు పేరుపేరునా అభినందించారు. ఈ కోవిడ్ సమయములో పిలవగానే వచ్చి అన్ని జాగ్రత్తలూ తీసుకొని ఆహూతులకు తమ విలువైన సేవలు అందించిన స్టూడెంట్ వాలంటీర్లను మరియు ఫుడ్ కమిటీ వాలంటీర్లను ఆమె ప్రత్యేకముగా అభినందించారు.

అటు పిమ్మట, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన మిగతా పోషకదాతలకు, స్వచ్చంద సేవకులకు, కార్యవర్గ బృందంకు, గాయకులకు, నృత్యరూప కల్పకులకు, గోపాల్ పోణంగి గారికి ప్రత్యక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఎల్లప్పుడూ వినూత్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని తెలియజేశారు.

Click here for Photogallery

 

Tags :