టాటా చేతికి ఎయిరిండియా

టాటా చేతికి ఎయిరిండియా

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా టాటాల వశమైంది. ఎయిరిండియా యాజమాన్య హక్కులను అధికారికంగా టాటా గ్రూప్‌కు కేంద్రం బదలాయించింది. ఎయిరిండియా-స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దాదాపు 69 సంవత్సరాల తర్వాత సుప్రసిద్ధ మహారాజాను ఇక పూర్తిగా టాటా గ్రూప్‌ సొంతం చేసుకుంది. బిడ్డింగ్‌లో ఎయిరిండియాను దక్కించుకున్న  టాటా అనుబంధ సంస్థ ట్యాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అధికారికంగా ఎయిరిండియాను అప్పగించినట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత్‌ పాండే మీడియాకు తెలిపారు.

ఎయిరిండియా అమ్మకానికి రూ.18,000 కోట్లకు టాటా గ్రూప్‌తో ప్రభుత్వం గత ఏడాది షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసింది. ఆటా గ్రూప్‌ రూ.2,700 కోట్లు నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించి రూ.15,300 కోట్ల మేరకు అప్పులను స్వాధీనం చేసుకుంది. ఎయిరిండియా అప్పగింత ప్రక్రియ పూర్తయినందుకు సంతోషంగా ఉందని టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. ప్రపంచస్థాయి సేవలందించేందుకు టాటా గ్రూప్‌ కట్టుబడి ఉందని చెప్పారు. ఆటా గ్రూప్‌ ఉద్యోగులుగా మారనున్న ఎయిరిండియా ఉద్యోగులకు సంస్థలోకి ఆహ్వానించారు. ఎయిరిండియా  అప్పగింత పట్ల రతన్‌ టాటా కూడా సంతోషం వ్యక్తం చేశారు.

 

Tags :